క్రిమినల్ కేసులున్న ఎంపీలు ఎంతమందో తెలుసా?
ప్రస్తుతం లోక్‌సభకు ఎంపికయిన వారిలో దాదాపు సగం మంది నేరారోపణలున్న వారే. వీరిలో కొంతమందిపై తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయి. గతంతో పోలిస్తే వీరి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మంది (46 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని పోల్ హక్కుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పేర్కొంది. వీరిలో 27 మందికి శిక్షలు కూడా పడ్డాయి. ఇలాంటి వారు 2014లో 185 మంది ఎంపీలుండగా(34 శాతం), 2009లో 162 మంది(30 శాతం), 2004లో 125 (23 శాతం) మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంటే 2009 నుంచి క్రిమినల్ కేసులు ఉన్నఎంపీల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మంది (31 శాతం) తీవ్రమైన నేరారోపణలు (అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్) ఎదుర్కొంటున్నారు.
15 మందిపై లైంగిక ఆరోపణలు..
15 మంది ఎంపీలు IPC సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో నలుగురిపై కిడ్నాప్‌కు సంబంధించిన కేసులున్నాయి. 43 మందిపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న అభ్యర్థికి గెలిచే అవకాశాలు 15.3 శాతం ఉండగా.. ఎలాంటి నేరారోపణలు లేని అభ్యర్థిలకు కేవలం 4.4 శాతం మాత్రమేనని విశ్లేషణలో తేలింది.
18వ లోక్‌సభకు బీజేపీ తరుపున 240 మంది గెలిచారు. దీంతో ఆ పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు గెలిచిన బీజేపీ అభ్యర్థుల్లో 94 మందిపై(39 శాతం) క్రిమినల్ కేసులున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 99 మంది అభ్యర్థుల్లో 49 మంది (49 శాతం) క్రిమినల్ కేసులున్నాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన 37 మంది అభ్యర్థుల్లో 21 మంది (45 శాతం), టీఎంసీకి చెందిన 29 మందిలో 13 మంది (45 శాతం), డీఎంకేకు చెందిన 22 మందిలో 13 మంది (59 శాతం), టీడీపీకి చెందిన 16 మందిలో ఎనిమిది మంది (50 శాతం), శివసేన ఏడుగురు గెలిచిన అభ్యర్థుల్లో ఐదుగురు (71 శాతం)పై నేరారోపణలున్నాయి.
తీవ్రమైన కేసులున్న వారిలో 63 మంది (26 శాతం) బిజెపి అభ్యర్థులు కాగా, 32 (32 శాతం) మంది కాంగ్రెస్ అభ్యర్థులు,17 మంది (46 శాతం) ఎస్‌పి అభ్యర్థులు ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. అలాగే ఏడుగురు (24 శాతం) టీఎంసీ అభ్యర్థులు, ఆరుగురు (27 శాతం) డీఎంకే అభ్యర్థులు, ఐదుగురు (31 శాతం) టీడీపీ అభ్యర్థులు, నలుగురు (57 శాతం) శివసేన అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.