మళ్లీ అధికారంలోకి వస్తే 5 లక్షల ఉద్యోగాలు..

"హర్యానాను అభివృద్ధి చేయడం రాహుల్ బాబా ఆయన కంపెనీ వల్ల కాదు. కేవలం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యం." - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Update: 2024-09-29 12:52 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో హస్తం పార్టీ హామీలను అమలు చేయలేక అపసోపాలు పడుతున్నాయని విమర్శించారు. హర్యానా గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

అభివ‌ృద్ధి మాతోనే సాధ్యం..

"హర్యానాను అభివృద్ధి చేయడం రాహుల్ బాబా ఆయన కంపెనీ వల్ల కాదు. అది కేవలం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యం." అని చెప్పారు. వక్ఫ్ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుత వక్ఫ్ బిల్లుతో సమాజంలో చీలికలకు అవకాశం ఉందని పలువురు విపక్ష నేతలు తమ దృష్టికి తేవడంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లుకు సవరణ చేస్తామన్నారు.

బాద్‌షాపూర్‌కు చెందిన రావు నర్బీర్ సింగ్‌తో సహా గురుగ్రామ్ ప్రాంతంలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తూ..ఆర్మీలో ప్రతి 10వ సైనికుడు హర్యానా చెందిన వ్యక్తి అయి ఉంటాడని చెప్పారు. ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ డిమాండ్‌ నెరవేర్చలేదని, 2015లో దాన్ని అమలు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

అగ్నివీరులకు పెన్షన్..

రాహుల్‌ను "అబద్ధాలయంత్రం"గా అభివర్ణించిన షా అగ్నిపథ్ పథకం గురించి కూడా మాట్లాడారు. ‘అగ్నివీరులకు ఉద్యోగాలు రావని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నాడు. రాహుల్ బాబా మాటలు నమ్మి మీ పిల్లలను ఆర్మీకి పంపడానికి వెనుకాడవద్దు. ప్రతి అగ్నివీర్‌కు ఐదేళ్ల తర్వాత పెన్షన్ ఇస్తాం.’ అని చెప్పారు.

అక్టోబరు 3న దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 5న మీ ఓటు వేసేటప్పుడు, శక్తిని (దేవత) అవమానించిన రాహుల్ బాబాకు, ఆయన పార్టీ కాంగ్రెస్‌కు ఓటుతో సమాధానం చెప్పాలి' అని ఓటర్లను కోరారు.

రాష్ట్రామంతా అభివ‌ృద్ధి..

భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని షా విమర్శనాస్త్రాలు సంధించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకే కులం, ఒక జిల్లాను అభివృద్ధి చేశాయని ఆరోపించారు. 2014లో హర్యానా ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానంతా అభివృద్ధి చేసి చూపించామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో కేవలం ప్రతిభ ఆధారంగా యువతకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. హథిన్‌ నుంచి తానేసర్‌ వరకు, థానేసర్‌ నుంచి పల్వాల్‌ వరకు కాంగ్రెస్‌ ర్యాలీల్లో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ నినాదాలు చేశారని షా ఆరోపించారు. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ బాబాని అడగాలనుకుంటున్నాను.. వాటిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంశంపై మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఉన్నంత వరకు కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గోధుమలు, వరిని మాత్రమే ఎమ్‌ఎస్‌పికి కొనుగోలు చేసేవారని అయితే బిజెపి ప్రభుత్వం 24 పంటలను ఎంఎస్‌పికి కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. హర్యానాకు 2004 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం రూ.41,000 కోట్లు ఇచ్చిందని, అయితే మోదీ ప్రభుత్వం 2014 నుంచి 2024 మధ్య రూ.2.92 లక్షల కోట్లు ఇచ్చిందని వివరించారు.

హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటిస్తారు. 

Tags:    

Similar News