ఎన్‌సీతో కుదిరిన పొత్తు.. తొలిదశ పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
నేషనల్ కాంగ్రెస్, సిపిఐ(ఎం), పాంథర్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఈ పార్టీలు జమ్ము, కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీచేయనున్నారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరగనుంది.
పొత్తులపై క్లారిటీ..
ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేయడంపై నేషనల్ కాంగ్రెస్(ఎన్‌సీ), సిపిఐ(ఎం), పాంథర్స్ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపింది. శ్రీనగర్‌లోని ఎన్‌సి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో చర్చల అనంతరం విలేకరుల సమావేశంలో తామంతా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తున్నట్లు మిత్రపక్షాలు స్పష్టం చేశాయి.
సీట్ల సర్దుబాట్లు..
నేషనల్ కాంగ్రెస్ (ఎన్‌సి), సిపిఐ(ఎం), పాంథర్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 32, ఎన్‌సీ 50 స్థానాలు, సీపీఐ(ఎం), పాంథర్స్ పార్టీ ఒక్కో స్థానంలో అభ్యర్థులను నిలబెట్టాయి. మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్‌సి విడివిడిగా పోటీచేయాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు సోపోర్, బనిహాల్, భదర్వా, దోడా, దేవ్‌సర్, నగ్రోటాలో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
ఈ క్రమంలో మొదటి దశ పోలింగ్‌లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. చినాబ్ వ్యాలీ దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాలు, కాశ్మీర్ డివిజన్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది.
పోటీలో పీసీసీ మాజీ చీఫ్‌లు కూడా..
పీసీసీ మాజీ చీఫ్‌లు గులాం అహ్మద్ మీర్ దూరు నియోజకవర్గం నుంచి, వికార్ రసూల్ వానీ అనంత్‌నాగ్ నుంచి పీర్జాదా మహ్మద్ సయ్యద్ బనిహాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వీరిలో సయ్యద్ పూర్వ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాల హయాంలో మంత్రిగా పనిచేశారు. 2022 ఆగస్టులో కాంగ్రెస్‌ను వీడి గులాం నబీ ఆజాద్ DPAPలో చేరారు. గతేడాది జనవరిలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ట్రాల్ స్థానం నుంచి సురీందర్ సింగ్ చన్నీ, దేవ్‌సర్ నుంచి అమానుల్లా మంటూ, ఇందర్వాల్ నుంచి షేక్ జఫరుల్లా, భదర్వా నుంచి నదీమ్ షరీఫ్, దోడా నుంచి షేక్ రియాజ్, దోడా వెస్ట్ నుంచి ప్రదీప్ కుమార్ భగత్‌ను కూడా పార్టీ బరిలోకి దించింది.