నేడు జార్ఖండ్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. 13వ తేది తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు.

Update: 2024-11-03 06:44 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్‌ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆదివారం రాష్ట్రంలో మూడు ఎన్నికల ప్రచార ర్యాలీలలో ప్రసంగించాల్సి ఉండడంతో ఆయన శనివారం రాత్రే జార్ఖండ్‌ రాజధాని రాంచీ చేరుకున్నారు.

‘‘సంకల్ప్ పత్ర’’ రిలీజ్

"కేంద్ర హోం మంత్రి అమిత్ షా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 'సంకల్ప్ పత్ర'ను రాంచీలో విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆయన ఘట్‌శిలా, బర్కథా, సిమారియా అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రసంగిస్తారు" అని బీజేపీ తెలిపింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 4న జార్ఖండ్‌లో పర్యటించి రెండు ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 5న జంషెడ్‌పూర్‌ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరవుతారు.

రాష్ట్రం ఏర్పడి పాతికేళ్లు ..

జార్ఖండ్ రాష్ట్రం నవంబర్ 15, 2000 సంవత్సరం ఏర్పడింది. అదే రోజు బిర్సా ముండా పుట్టిన రోజు కూడా. రాష్ట్ర ఆవిర్భావం జరిగి 25 ఏళ్లు కావడంతో కాషాయ పార్టీ మేనిఫెస్టోలో 25 కీలకాంశాలతో పాటు గిరిజన దిగ్గజం బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని 150 పాయింట్ల నోట్‌ను షా విడుదల చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

బీజేపీ 'పంచ్ ప్రాణ్' ..

బీజేపీ 'పంచ్ ప్రాణ్' పేరిట అక్టోబర్ 5న మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రతి నెలా మహిళలకు రూ. 2,100 ఆర్థిక సాయం, యువకులకు ఐదు లక్షల ఉద్యోగాలు, అధికారంలోకి వస్తే అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అన్నపూర్ణా దేవి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'పంచప్రాణ్' హామీలో భాగంగా రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ ఇవ్వనున్నారు. అలాగే ఏడాదిలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. దీంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.87 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలి కేబినెట్ సమావేశం తర్వాత నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని, నవంబర్ 2025 నాటికి 1.5 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే గ్రాడ్యుయేట్లకు, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి రూ.2వేలు ఆర్థిక సాయం కూడా అందజేస్తామన్నారు. మహిళా సాధికారతలో భాగంగా బీజేపీ 'గోగో-దీదీ' పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద స్ర్తీలకు నెలకు రూ. 2,100 ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ పోలింగ్ నవంబర్ 13, మలిదశ 20 తేదీలో ఉంటుంది. నవంబర్ 23 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

Tags:    

Similar News