తండ్రితో ప్రచారానికి నో..కూతురితో బీజేపీ క్యాంపెయినింగ్
మహారాష్ట్రలోని ఒకే పార్టీ నుంచి తండ్రి, కూతురు పోటీచేస్తున్నారు. అయితే తండ్రి తరుపున ప్రచారం చేయనని చెప్పిన బీజేపీ, కూతురి ప్రచారానికి మాత్రం వస్తానంటోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్ష ఎన్‌సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్ తరుపున ప్రచారానికి బీజేపీ నిరాకరిస్తోంది. పారిపోయిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో ఆయనకు సంబంధాలున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన కూతురు సనా మాలిక్ తరుపున ప్రచారానికి మాత్రం ఏ అభ్యంతరాలు లేవని చెబుతోంది.
అనుశక్తి నగర్ నుంచి సనా మాలిక్..
నవాబ్ మాలిక్ చిన్న కూతురు సనా మాలిక్. ఈమె తండ్రి గతంలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన అనుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో సనా మాలిక్ పోటీచేయడం ఇదే తొలిసారి.
మాన్‌ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి నవాబ్ మాలిక్..
బీజేపీ నుంచి వ్యతిరేకత ఉన్నా..ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్ మంగళవారం ముంబైలోని మాన్‌ఖుర్డ్-శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ గడువు ముగియడానికి కొద్ది నిమిషాల ముందు అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీ నవాబ్ మాలిక్‌కు నామినేషన్ ఫారం అందజేసింది.
నవాబ్ మాలిక్ తరుపున ప్రచారం చేయం..
నవాబ్ మాలిక్ తరుపున బీజేపీ ప్రచారం చేయబోమని పార్టీ ముంబై యూనిట్ చీఫ్ ఆశిష్ షెలార్ మంగళవారం స్పష్టం చేశారు. "మొదటి నుంచి మా వైఖరి స్పష్టంగా ఉంది. మహాయుతి కూటమి నేతలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. మా ఆందోళన కేవలం నవాబ్ మాలిక్ గురించి మాత్రమే. ఈ విషయంలో నేను, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పదేపదే బీజేపీ వైఖరిని స్పష్టం చేశాం. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదని మరోసారి చెబుతున్నాను. దావూద్‌తో పాటు అతనితో సంబంధం ఉన్న వారందరి గురించి మా అభిప్రాయం స్పష్టంగా ఉంది.’’ అని పేర్కొన్నారు.
వివాదాల నవాబ్..
మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మంత్రివర్గంలో నవాబ్ మాలిక్ మంత్రిగా ఉన్నారు. క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకున్నాడని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై మాదకద్రవ్యాల ఆరోపణలను డ్రగ్ నిరోధక సంస్థ ఎత్తివేసింది.
దావూద్ ఆయన సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మొదట నమోదు చేసిన కేసులో మాలిక్ 2022లో అరెస్టయ్యారు. ఈ ఏడాది జులైలో వైద్య కారణాలతో మాలిక్‌కు బెయిల్ మంజూరైంది.
బీజేపీది ద్వంద్వ వైఖరి..
నాన్న, కూతురు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ విమర్శించారు. ఎన్నికల ప్రచారం గురించి ఎన్‌డీఎ సభ్యులంతా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. చివరగా మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తామని చెప్పారు.
నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగంగా ఎన్‌సీపీ పోటీ చేస్తోంది. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా ఉన్నాయి.