హర్యానాలో ఒంటరిగానే..
హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..కేంద్రం హోంశాఖ మంత్రి పార్టీ శ్రేణుల సమావేశంలో ఏం మాట్లాడారు. ఎవరినుద్దేశించి ఆయన ‘‘తార-సితార’’కు చోటులేదన్నారు.
హర్యానాలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎవరి అండదండలు అవసరం లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలో మూడో సారి పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా సైనీనే కొనసాగుతారని వెల్లడించారు.
హర్యానా అసెంబ్లీకి అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చండీగఢ్‌లోని పంచకులలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి షా ప్రసంగించారు.
మెజారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికి తిరిగి కాపాయ పార్టీకి ఓటు వేయాలని కోరాలని సూచించారు.
ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన తొలి నాయకుడు మోదీయేనని పార్టీ కార్యకర్తలకు షా గుర్తు చేశారు. బీజేపీ విజయానికి ఆ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల శ్రమ, సంక్షేమ పథకాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు.
గతంలో హర్యానాలో ఒక ప్రభుత్వం ఒక జిల్లా కోసం, మరో ప్రభుత్వం మరో జిల్లా కోసం పనిచేసేవని, అయితే గత 10 ఏళ్లలో బీజేపీ అదేపనిని హర్యానా మొత్తం చేసిందని గుర్తుచేశారు. బీజేపీ పాలనలో ప్రాంతీయ పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు.
"తారా-సితార"కి చోటు లేదు
హర్యానా కాంగ్రెస్ నేతలు కోతలు, కమీషన్లు, అవినీతికి పాల్పడ్డారని షా ఆరోపించారు. ఇకపై ‘ తారా, సితార ’ పనిచేయవని చెప్పారు.
“సోనియా కా ఆఖోన్ కా తారా (రాహుల్ గాంధీ), (భూపీందర్) హుడా సాబ్ కా సితార (దీపేందర్ హుడా). అబ్ హర్యానా మే తారా సితార నహిం చలేగా..” అని షా కామెంట్ చేశారు.
అభివృద్ధిని వివరించి ఓట్లడగండి..
గత పదేళ్లలో హర్యానాలో కేంద్రం రూ. 2, 70,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిందని షా పేర్కొన్నారు. దీన్ని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు.
దేవ్ దుర్లభ్ ఫౌజ్..
బూత్ స్థాయిలో ఓటరును గౌరవించే ఏకైక పార్టీ బీజేపీయేనని, ఏ విజయం సాధించినా ఆ ఘనత తమ బూత్ వర్కర్‌కే దక్కుతుందని షా అన్నారు. అందుకే కార్యకర్తల సమూహాన్ని బిజెపిలో "దేవ్ దుర్లభ్ ఫౌజ్" అని పిలుస్తారని, కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఉన్నంత కార్యకర్తలు మరే పార్టీకి లేరని షా పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తల్లో షా కొత్త ఉత్సాహాన్ని నింపారని పార్టీ నేత కిరణ్ చౌదరి పేర్కొన్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 4,500 మంది బీజేపీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, పదాధికారులు, దాదాపు 4,500 మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్లతోనూ అమిత్ షా సమావేశమయ్యారు.