వైసీపీలో 49 సీట్లు రెడ్లకి, టీడీపీలో 34 సీట్లు కమ్మలకి..
అందరూ సామాజిక న్యాయమే మాట్లాడుతున్నా టికెట్లు దక్కింది మాత్రం ఆ రెండు వర్గాలకే ఎక్కువ. రిజర్వే సీట్లు పోను మిగతా 139 సీట్లలో ఎవరెవరికి ఎన్నెన్ని ఇచ్చారంటే..
ఏపీ అసెంబ్లీ ఫ్యాక్ట్‌ఫైల్
మొత్తం అసెంబ్లీ సీట్లు 175
రిజర్వ్‌డ్– ఎస్సీలు 29
ఎస్టీలు 7 (రిజర్వ్‌డ్)
రిజర్వ్ కాని 139 సీట్లలో ఎవరికెన్ని?
వైసీపీ
49 రెడ్లు
23 కాపులు
9 కమ్మ
5 క్షత్రియ
3 వైశ్య
1 బ్రాహ్మణ
1 వెలమ
41 బీసీలు
7 మైనారిటీ
టీడీపీ కూటమి
34 కమ్మ
29 రెడ్డి
18 కాపులు
38 బీసీలు
20 ఇతర వర్గాలు
ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎండలు ముదురుతున్నాయి. ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఊళ్లల్లోకి మైకులు కట్టుకున్న వ్యాన్లు, మెటాడోర్లు, ఆటోలు వస్తున్నాయి..
అందులో ఓ ఆటో మైకు నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వినపడే పాటొకటి వస్తోంది.. దాసరి నారాయణ రావు తీసిన రాములమ్మ సినిమాలోని పాటది..
’ఓ రెడ్డీ గారు, ఓ చౌదరి గారు’ అనే పాటకు లయబద్ధంగా కాస్తంత మందేసిన వాళ్లు చిందేస్తున్నారు..
మురికివాడల్లో చిరుగుపడ్డ చెడ్డీలతో మరకలుపడ్డ చొక్కాలతో చింపిరి జుట్టుతో ఉన్న పిల్లలు ఆ ఆటో ముందు డాన్స్ ఆడుతున్నారు. ఇంతలో కరపత్రాలు పట్టుకున్న ఓ గుంపు .. ఈ రెడ్డిగారే మన అభ్యర్థి, ఆయన గుర్తు పలానా అని చెబుతుంటే మరోవైపు నుంచి ఇంకో గుంపు ఇంకో రంగు కాగితం చేతిలో పెట్టి ఈయనే మన చౌదరి గారు, ఏదైనా పనుంటే రేపొద్దున ఆ ఇంట్లోకి వెళ్లండంటూ ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల యుద్ధానికి శంఖారావాలు పూరించాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. 2024 ఎన్నికలు చాలా అసాధారణమైనవని అందరూ చెబుతున్నా ఏ ఒక్కరూ తమ గెలుపు గుర్రాలను మాత్రం వదులు కోలేదు. 60,70 ఏళ్లుగా వస్తున్న ఆనావాయితీనీ వదల్లేదు. ఆధిపత్యాన్ని వదల్లేదు. సంఖ్యాపరంగా చిన్నవైన రెండు సామాజిక వర్గాలదే పైచేయిగా ఆంధ్రా పాలిటిక్స్‌లో నిలిచింది. చిన్నవి అయినప్పటికీ సామాజికంగా బలమైన రెండు కులాలు ఆంధ్ర రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల పంపిణీతో ఇది మరోసారి రుజువైంది. ఈ రెండు కులాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బీసీ నినాదాన్ని మాత్రం వదులుకోలేదు. అటు అధికార వైసీపీ అయినా ఇటు ప్రతిపక్ష టీడీపీ అయినా తమ వర్గాలకు అధిక ప్రాధాన్యతనే ఇచ్చాయనేది వాస్తవం. ఈ రెండూ పార్టీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లలో సింహభాగం కేటాయించాయి.
ప్రస్తుతం ఉన్న అనధికార జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 35 శాతం ఉంటారని అంచనా. కమ్మలు 5.6 శాతం, రెడ్లు సుమారు 8 శాతం. ఆంధ్రా రాజకీయాల్లో కమ్మ, రెడ్ల మధ్యనే తరతరాలుగా అధికార మార్పిడి జరుగుతోంది. టీడీపీ నాయకత్వం కమ్మవాళ్లతో, పాత కాంగ్రెస్ అయినా ప్రస్తుత వైసీపీ అయినా రెడ్లతోనే గుర్తింపు పొందాయనేది నగ్నసత్యం.
1956 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు రెడ్లు, ఏడు సార్లు కమ్మ వారు సీఎం పదవిని అలంకరించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం వరకు రెడ్లు కాంగ్రెస్‌తోనే కొనసాగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆ ప్లేస్‌ను ఇప్పుడు వైసీపీ భర్తీ చేసింది. ఇందులో రెడ్లదే పైచేయి. కాంగ్రెస్ స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ఆక్రమించడం ప్రారంభించిన తర్వాత మెజారిటీ రెడ్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ వైపు మొగ్గు చూపారు.
వైసీపీలో 49 మంది రెడ్లే....
సామాజిక సమతూకమే తమ ఉద్దేశమన్న వైసీపీలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 49 మంది రెడ్లు అత్యధికంగా టికెట్లను సంపాయించారు. ఇక టీడీపీలోనైతే సహజంగా తమకు అండగా నిలిచే కమ్మ సామాజికవర్గీయులకు 34 టికెట్లు దక్కాయి. జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇస్తే బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలి. కాని అటువంటి పరిస్థితి మనకు కనిపించదు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత జనాబా దాదాపు 4.8 కోట్లు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 షెడ్యూల్డ్ కులాలకు, ఏడు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు అయ్యాయి. మిగతా 139 అన్ రిజర్వ్‌డ్ సీట్లలో బీసీలకు అగ్రస్థానం లభించాలి. రెండు పార్టీలలోనూ ఆ పరిస్థితి కనిపించలేదు. బీసీలలో 140కి పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా 35, 40 శాతం వరకు ఉంటుందని అంచనా.
ఇక అగ్రవర్ణాల విషయానికి వస్తే కాపులు 15 శాతం కంటే ఎక్కువ. కానీ ఈ వర్గం ఎన్నడూ అధికారం ఛాయలకు కూడా రాలేదు. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కాస్త హడావిడి కన్పించినా అది మధ్యలోనే అంతర్థానమైంది. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు, నటుడు పవన్ కల్యాణ్ జనసేన ఏర్పాటు చేసి కాపులవైపు నిలిచినా ఇప్పుడు ఆయనా టీడీపీతో జత కట్టారు. కాపులకు పార్టీ సారథ్యం అప్పగించి కాపుల్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నించినా ఆ ప్రయత్నం నెరవేరలేదు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హయాంలోగాని సోము వీర్రాజు కాలంలో గాని బీజేపీ వైపు కాపులు తొంగి చూడలేదు. దీంతో ఒకప్పుడు టీడీపీకి అండగా నిలిచిన బీసీల వైపే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. ఆ ప్రయత్నంలో వైఎస్‌ఆర్‌సిపి సక్సెస్ అయింది. 2019లో అధికారాన్ని చేపట్టింది.
టీడీపీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నా గత ఐదేళ్లలో పెద్దగా మార్పు వచ్చిన సూచనలు ఏమీ కనిపించలేదు.
వైసీపీ టికెట్ల కేటాయింపు ఇలా...
139 అన్‌రిజర్వ్‌డ్ సీట్లలో 91 మంది అగ్రవర్ణాల అభ్యర్థులకు వైసీపీ టికెట్లు ఇచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ కేవలం 41 మంది బీసీ అభ్యర్థులను బీసీలను బరిలోకి దింపింది. అగ్రవర్ణాలకు చెందిన 91 మంది అభ్యర్థుల్లో 49 మంది రెడ్లు, 23 సీట్లు కాపులకు ఇచ్చింది. 9 సీట్లు కమ్మసామాజిక వర్గీయులకు ఇచ్చింది.
టీడీపీ కూటమి కేటాయింపులు ఇలా...
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి 38 మంది బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. 34 మంది కమ్మ, 29 మంది రెడ్డి, 18 మంది కాపులకు టిక్కెట్లు ఇచ్చింది. మిగతా అన్ని కులాలకు కలిపి 20 సీట్లు ఇచ్చింది. వీరిలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, వైశ్య వర్గాలు ఉన్నాయి. ఈ కూటమిలో మూడు పార్టీల కంటే బీసీలకు రెండు సీట్లు అదనంగా వైసీపీ ఇచ్చింది.