Maharashtra | ఎన్నికల ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు

హర్యానా ఎన్నికల ఫలితాలపై సందేహాలు లేవనెత్తిన కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట్ర ఎన్నికలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Update: 2024-11-29 12:37 GMT

మహారాష్ట్రలో ఎన్నికలయితే ముగిశాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇక ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. పరాజయానికి కారణాలు ఏమై ఉంటాయని పార్టీ నేతలతో చర్చించింది. వారంతా ఈవీఎంలలోనే ఏదో మతలబు ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఎన్నికలపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషి లేవనెత్తిన సందేహాలను జోడిస్తూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు 12 పేజీల మెమోరాండం సమర్పించారు.

పేర్లను భారీగా తొలగించారు..

రెండింటి వల్ల తాము ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఓటర్లను ఏకపక్షంగా తొలగించడం, ప్రతి నియోజకవర్గంలో 10 వేల మంది ఓటర్లను చేర్చడం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక రెండోది.. ఓటింగ్ శాతంలో పెరుగుదలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై - నవంబర్ 2024 మధ్య కాలంలో 47 లక్షల మంది ఓటర్లను జాబితాలో చేర్చారన్నది కాంగ్రెస్ వాదన. సగటున 50 వేల మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 47 నియోజకవర్గాల్లో విజయం సాధించారని గట్టిగా వాదిస్తోంది.

అక్రమ ఓట్లు..

తుల్జాపూర్ నియోజకవర్గంలో అక్రమ ఓట్లు వేయడానికి వేర్వేరు ఫోటోలు, పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారని కాంగ్రెస్ పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ సగటు ఓటింగ్ శాతం 58.22 శాతంగా ఉందని, అయితే ఇది రాత్రి 11.30 గంటలకు 65.02 శాతానికి పెరిగిందని కాంగ్రెస్ ఎత్తిచూపింది.

హర్యానాలో అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ఇదే విధమైన ఆందోళనలను లేవనెత్తింది. కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్ పోల్స్‌ చెప్పినా..చివరకు అక్కడ బీజేపీ గెలుపొందింది. ఇటు పోల్ ప్యానెల్ కూడా ఆరోపణలు "నిరాధారమైనది" అని కొట్టిపారేసింది. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. 

Tags:    

Similar News