మహారాష్ట్రలో హైడ్రామా: బీజేపీ నేత వినోద్ తావ్డే డబ్బు పంపిణీపై ఆరోపణలు

మహారాష్ట్రలోని ఓ హోటల్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Update: 2024-11-19 12:31 GMT

మహారాష్ట్రలో పోలింగ్‌కు ఒకరోజు ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వసాయ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) సభ్యులు మంగళవారం (నవంబర్ 19) విరార్ ఈస్ట్‌లో బీజేపీ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని నాలాసోపరా ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్, బీవీఏ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఠాకూర్ వాదన పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదని, మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఓటమికి కారణాలను వెతుక్కుంటోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

హోటల్‌లో సమావేశం..

విరార్ ఈస్ట్‌లోని హోటల్ వివాంటాలో బీజేపీ నాలాసోపరా నియోజకవర్గ అభ్యర్థి రాజన్ నాయక్‌తో తావ్డే సమావేశమయ్యారు. అయితే హోటల్‌లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీవీఏ కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకున్నారు.

వైరలయిన వీడియో..

పాల్ఘర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తావ్డే ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని ఠాకూర్ ఆరోపించారు. ప్రస్తుతం తావ్డే, BVA నాయకులు, కార్యకర్తలు మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. అందులో బీజేపీ కార్యకర్తలు బ్యాగ్ లోంచి డబ్బుల కట్టలను తీస్తుండగా.. తావ్డే దూరంగా కూర్చుని ఉన్నారు. బీవీఏ కార్యకర్తలు తమ ఫోన్‌లో వీడియో తీయడానికి ముందుకెళ్లారు. అయితే బ్యాగ్ తనది కాదని తావ్డే చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తావ్డే నుంచి నగదుతో పాటు రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు.


BVA నాయకుడు స్థానిక మరాఠీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తావ్డే తనకు క్షమాపణలు చెప్పాడని, హోటల్ నుంచి బయటకు వెళ్లడానికి తన సహాయం కూడా కోరాడని పేర్కొన్నారు. తావ్డేని తక్షణమే అరెస్టు చేయాలని BVA కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు హోటల్‌ను సీజ్ చేశారు. అలాగే తావ్డేను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

నాకు సమాచారం ఉంది.

అనంతరం ఠాకూర్ విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది బీజేపీ నాయకులు నాకు సమాచారం ఇచ్చారు. తావ్డే విరార్‌కు వస్తున్నాడని, ఓటర్లను కొనేందుకు రూ. 5 కోట్ల డబ్బు కూడా వెంట తెస్తున్నాడని చెప్పారు. ఓ జాతీయ స్థాయి నాయకుడు ఇంతటి పనికిమాలిన పనికి దిగజారుతాడని నేను అనుకోలేదు. తావ్డే, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతా.

హోటల్ CCTV రికార్డింగ్‌ను కూడా ఆపేశారని BVA శాసనసభ్యుడు ఆరోపించారు.

“హోటల్ యాజమాన్యం, తావ్డే కుమ్మక్కైనట్లు కనిపిస్తోంది. మేము కోరిన తర్వాత మాత్రమే హోటల్ వాళ్లు CCTVని యాక్టివేట్ చేశారు. తావ్డే మూడు గంటలకు పైగా హోటల్‌లోనే ఉన్నాడు.’’అని ఠాకూర్ పేర్కొన్నారు.

బీవీఏకు ప్రాబల్యం ఎక్కువే..

వసాయ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ నేతృత్వంలోని బీవీఏకు జిల్లాలో మంచి బలం ఉంది. వసాయ్, నలసోపరా, బోయిసర్ స్థానాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. హితేంద్ర ఠాకూర్ వసాయ్ నుంచి, ఆయన కుమారుడు క్షితిజ్ నలసోపరా నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేష్ పాటిల్ బోయిసర్ నుంచి పోటీ చేస్తున్నారు.

తావ్డేపై FIR..

మరోవైపు తావ్డే, బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఘటనా స్థలం నుంచి రూ. 9 లక్షల నగదు, పలు పత్రాలను కూడా పోల్ ప్యానెల్ స్వాధీనం చేసుకున్నారు. అయి తావ్డే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. హోటల్‌లో నాలాసోపారా బీజేపీ కార్యకర్తల సమావేశం జరుగుతుందని చెప్పారు. "ఓటింగ్ యంత్రాలను ఎలా సీల్ చేస్తారో.. అభ్యంతరాలను లేవనెత్తే ప్రక్రియ గురించి కార్యకర్తలతో చర్చిస్తున్నాం. అయితే మేము డబ్బు పంపిణీ చేస్తున్నామని BVA కార్యకర్తలు భావించారు" అని వార్తా సంస్థ ANI తో చెప్పారు. పోలీసులు విచారణ చేయనివ్వండి. సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయనివ్వండి అని కూడా అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఈ ఘటనపై ఎక్స్‌లో స్పందించారు.

“బీజేపీ పథకం ముగిసింది. ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఠాకూర్ చేశారు. EC అధికారులు మా బ్యాగ్‌లను చూస్తారు. బీజేపీ వాళ్ల దగ్గరికి మాత్రం వెళ్లరు.’’ అని పేర్కొన్నారు.

డబ్బు పంపిణీలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. "ఓటు జిహాద్ లేదా ధర్మ యుధ్" అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీజేపీ నేతలు ఈ పదాలను తరచుగా వాడుతుంటారని కామెంట్ చేశారు.

ఆరోపణలను ఖండిస్తూ.. బిజెపి నాయకుడు, MLC ప్రవీణ్ దారేకర్ “MVA ఇప్పటికే గేమ్‌లో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదు. అందుకే మాపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ఠాకూర్ చేస్తున్నది పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదు’’ అని అన్నారు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags:    

Similar News