‘అవకాశం ఇస్తారుగా..’

లోక్‌సభ స్వీకర్‌గా ఎన్నికయిన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆయనను ఏమని కోరారు?

Update: 2024-06-26 08:35 GMT

లోక్‌సభలో జనం గొంతుకను వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభాపతి ఓం బిర్లాను కోరారు. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత బిర్లాకు అభినందనలు తెలుపుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ఇండియా కూటమి సహకరిస్తుంది. ప్రభుత్వానికి రాజకీయ శక్తి ఉంది. అదే సమయంలో ప్రతిపక్షానికి దేశ ప్రజల గొంతు ఉంది. గత ఎన్నికల కంటే ఈసారి విపక్షాల బలం ఎక్కువగా ఉంది. దేశ ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే సందేశాన్ని లోక్ సభ ఎన్నికలు నిరూపించాయి. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం కల్పించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి" అని రాహుల్ పేర్కొన్నారు.

స్పీకర్‌గా రెండో సారి..

సభాపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా వరుసగా రెండో‌సారి గెలిచారు. 17వ లోక్ సభలోనూ ఆయనే స్పీకర్‌గా ఉన్నారు. ప్రస్తుత 18వ లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్డీఎ తరుపున ఓం బిర్లా, ఇండియా కూటమి తరుపున కోడికున్నిల్ సురేష్ పోటీపడ్డారు. మూజువాణీ విధానంలో చేపట్టిన ఓటింగ్‌లో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెంట రాగా.. ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్‌ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News