ఒడిశాలో బీజేపీ విజయం ఎలా సాధ్యమైంది?

ఒడిశాలో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం రాత్రికి రాత్రి జరిగింది కాదు. విజయం వెనక ఎంతో కృషి ఉంది. సంఘ పరివార్ కార్యక్రమాలు గిరిజనులను ఆకట్టుకున్నాయి.

Update: 2024-06-14 06:41 GMT

భారతీయ జనతా పార్టీ (BJP)లో ఎప్పుడు, ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేం. ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని ఇందుకు ఒక ఉదాహరణ. తాను మంత్రి అవుతానని మాత్రమే మోహన్ చరణ్ భావించారు. కాని ముఖ్యమంత్రి అవుతానని ఆయన ఊహించలేదు. ఇదే విషయాన్ని ఆయన భార్య కూడా ఒప్పుకుంది.

జూన్ 12న సీఎంగా మోహన్ చరణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమెతో పాటు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ సారి ఎన్నికలలో నవీన్ పట్నాయక్ గెలిచి ఉంటే.. దేశంలో అత్యంత కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు నమోదయ్యేది. కాని అలా జరగకుండా మోహన్ చరణ్ అడ్డుకున్నారు. రెండోది..ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

ఒడిశా మూడో గిరిజన సీఎం..

వాస్తవానికి మోహన్ చరణ్ ఒడిశాకు తొలి గిరిజన ముఖ్యమంత్రి కాదు. ఆయన కంటే ముందే మరో ఇద్దరు గిరిజనులు ఆ స్థానానికి చేరుకున్నారు. వారు హేమానంద బిస్వాల్, గిర్ధర్ గమాంగ్. బిస్వాల్ 1989-90, 1999-2000లో మధ్య కాలంలో మూడు నెలలు పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గమాంగ్‌ 1999లో 10 నెలలు ఆ బాధ్యతలు నిర్వహించారు.

మూడో అతిపెద్ద గిరిజన ఆధిపత్య రాష్ట్రానికి మోహన్ చరణ్ మూడో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలోని ఇతర ముఖ్యమంత్రులలో చాలా మంది తీర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆర్థికంగా వారు సంపన్న సంఘాల నుంచి వచ్చిన వారు కూడా. ఒడిశాలో బిజెపి అధికారంలోకి రావడం విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవాలి.

గిరిజనుల్లోకి సంఘ్ పరివార్ కార్యకలాపాలు..

ఒడిశాలో బీజేపీ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. కొన్నేళ్లుగా రాష్ట్రంలోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సంఘ్‌ పరివార్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే, 1995కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గిరిజన సంక్షేమానికి కూడా కృషి చేసింది.

కాంగ్రెస్ బలహీనతలను సంఘ్ పరివార్ అర్థం చేసుకుంది. వనవాసి కళ్యాణ్ ఆశ్రమాల ద్వారా గిరిజనులను గుర్తించడం, వారికి ఉపాధి కల్పించడం మొదలుపెట్టారు. మత మార్పిడికి అడ్డుకట్ట వేయడం ద్వారా గిరిజన సమాజాన్ని తమ వైపు ఆకట్టుకోగలిగారు.

దీంతో పాటు ఒడిశాలోని గిరిజన సమాజాన్ని రాజకీయంగా బిజెపి బలోపేతం చేసింది. ద్రౌపది ముర్ము మొదట రాష్ట్ర మంత్రిగా తర్వాత జార్ఖండ్ గవర్నర్‌గా చివరకు దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతికి ఎదిగారు. బీజేపీ గిరిజన సమాజానికి పెద్దపీఠ వేస్తుందన్న సంకేతాలను పంపింది. వారి నమ్మకాన్ని చూరగొంది.

జార్ఖండ్‌పై ప్రభావం..

మోహన్ చరణ్ ఒడిశా ముఖ్యమంత్రి కావడం నేరుగా కాకపోయినా .. జార్ఖండ్‌పై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. జార్ఖండ్ రాజకీయాల్లో శిబు సోరెన్ కుటుంబ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ జైలులో ఉన్నా.. చంపై సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోంది.

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పనితీరు అంతగా లేదు. దుమ్కా నియోజకవర్గంలో శిబు పెద్ద కోడలు సీతా సోరెన్‌ను బీజేపీ పోటీకి దింపింది. అయితే ఆమె ఓడిపోయింది.

ఆమె ఓటమిని అటుంచితే.. సంతాల్ వర్గం పార్టీకి దూరం కావడం బీజేపీని ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అదే కమ్యూనిటీకి చెందిన మోహన్ చరణ్ ఒడిశా సీఎం చేయడం వల్ల సంతాల్ వర్గం మద్దతు బీజేపీ కూడగట్టినట్లయ్యింది.

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవసాయిని ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా ఆదివాసీ సామాజికవర్గం తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పకనే చెప్పింది బీజేపీ.

బెంగాల్‌పై పట్టుకోసం..

రాజకీయాల్లో గాలి తన దిశను మార్చుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అలాగే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులను అనుకుని ఉన్నపశ్చిమ బెంగాల్ మీద కాషాయ పార్టీ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News