ఈ అక్కను గెలిపిస్తే ఫారిన్ విస్కీ, బీరు ఫ్రీ!
మంచి మద్యం సప్లై చేస్తానని చెప్పే చంద్రబాబు, మద్యాన్ని నిషేధిస్తాననే జగన్ కన్నా ఈ వనితక్క పాలసీరైటేమో ఆలోచిస్తే మంచిదేమో ఓటర్లు ఓసారి యోచన చేయాలి
‘నేను గెలిస్తే రాష్ట్రంలో మద్యమే లేకుండా చేస్తా.. గెలిచిన తర్వాత మూడేళ్లలో లిక్కర్ ను నిషేధిస్తా. నాలుగేళ్ల తర్వాత పూర్తిగా లేకుండా చేస్తా. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి ఓట్లడుగుతా’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావొచ్చింది. అది మాత్రం అమలు కాలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి..
‘ఏం తమ్ముళ్లూ.. రాష్ట్రంలో ఎక్కడైనా మంచి మందు దొరుకుతుందా.. పొద్దంతా పని చేసి సాయంత్రం ఒక పెగ్గెద్దామంటే అన్నీ నకిలీ బ్రాండ్లే. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. మన పార్టీ గెలిచిన తర్వాత మంచి బ్రాండ్లు పెట్టిస్తా. నిఖార్సైన మద్యం అమ్మిస్తా’ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
యహే.. ఈ బ్రాండ్లేందీ, నకిలీదేంది. నన్నుగెలిపిస్తే మీ అందరికీ ఫారిన్ లిక్కర్ ఉచితంగా పోయిస్తానంటోంది ఇక్కడో మహిళ.
జనరంజక లేదా పాపులర్ విధానాలను అనుసరించే రాజకీయ పార్టీలకు ఈ అక్క చక్కటి దారి చూపింది. మద్యం ప్రియులకు పెద్ద భరోసా ఇచ్చింది. కొండంత అండగా నిలిచింది. ఒక్క ఓటు.. ఒకే ఒక్క ఓటు వేసి గెలిపిస్తే తన నియోజకవర్గ ప్రజలందరీ ఫారిన్ స్కాచ్, బీరు ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఓట్లు వేసి గెలిపిస్తే ఒకరేమో చీప్ లిక్కరు, మరొకరేమో సొంత బ్రాండ్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ జనం ప్రాణాలు తీసే కన్నా ఈ పథకమేదో బాగుందంటున్నారు కదూ..
ఎన్నికలలో మద్యనిషేధం విధిస్తామని ఎవరైనా చెబితే అది ముమ్మాటికీ అబద్ధమేనని స్వాతంత్ర్య భారతావనిలో తేలిపోయింది. ఆ మాట చెప్పి ఆడవారి ఓట్లు వేయించుకుని మద్యం ఆదాయం లేకపోతే ప్రభుత్వాన్ని నడపడమే సాధ్యం కాని పరిస్థితి. మద్యనిషేధమన్నది ఎట్టాగూ అమలు చేయలేము గాబట్టి _ ఇదిగో ఇలా...మేము గెలిస్తే విదేశీ విస్కీ,బీరు ఉచితం అని వాగ్దానం చేసి తదుపరి ఎన్నికలలో మగవారి ఓట్లు పొందే స్ట్రాటజీని కనుక అమలు చేస్తే... కనీసం గ్యారంటీగా పదేండ్లు అధికారంలో వుండవచ్చు! అని చమత్కారంగా అనొచ్చుగాని అదైతే అక్షరాల నిజమే కదా.
ఇంతకీ ఈ అక్క ఎవరంటే..
ఈమె పేరు వనితా రౌత్. మహారాష్ట్ర చంద్రాపూర్. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి అఖిల భారత మానవతా పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. పేదలైతే ఎంతకాలం చీప్ లిక్కరే తాగాల్నా, ఖరీదైన విదేశీ మద్యం తాగొద్దా ఏమిటీ అని ప్రశ్నించారు. కాయకష్టం చేసి బతికే పేదసాదలకు ఉచితంగా విదేశీ విస్కీ, స్కాచ్, బీరు ఇస్తానని గట్టి హామీనే ఇచ్చారు. తనను గెలిపిస్తేనే సుమా అని షరతు కూడా పెట్టారు. పల్లెటూళ్లలో ఓపెన్ బీర్ షాపులు ఉండాలన్నది ఆమె మనోవాంఛ. పేదలకు ఉచితంగా పోయించే మద్యానికి అయ్యే ఖర్చునంతా తన ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తానని, పేదల చేతి చమురు వదలకుండా చూస్తానని హామీ ఇస్తోంది. పేదలైతే ఖరీదైన మద్యం తాగొద్దా అన్నది ఆమె ప్రధాన ప్రశ్న. అతి పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చినట్టే మద్యం ఫ్రీ, ఓమోస్తరు పేదలకి సబ్సిడీ రేట్లకు, బాగా డబ్బున్న వాళ్లు మాత్రం కొనుక్కుని తాగాల్సిందేనని కూడా ఆమె షరతులు విధించింది. ఇదే డిమాండ్ తో ఆమె 2019 ఎన్నికల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) హెడ్ క్వార్టర్స్ ఉండే నాగపూర్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆమె ఇదే హామీ ఇచ్చింది. చీప్ లిక్కర్ తాగితాగి లివర్ పాడుచేసుకునే కన్నా ఇది మంచి స్కీం అంటారు ఆమె. మద్యం కిక్కులోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే తాగిపడిపోతే ఎలా, అందుకే ఫారిన్ విస్కీ అందిస్తా, అది తాగితే వారికి స్వర్గం కనిపిస్తుందన్నది వనితా రౌత్ వాదన.
మంచి మద్యం సప్లై చేస్తానని చెప్పి చంద్రబాబు, మద్యాన్ని నిషేధిస్తాననే జగన్ కన్నా ఈ వనితక్క పాలసీరైటేమో ఆలోచిస్తే మంచిదని మానవతా పార్టీ ఏపీ శాఖ చెబుతోంది. ఓటర్లారా , ఆలోచించండి మరి.