నిజంగానే నారా లోకేశ్‌కి జెడ్ స్థాయి భద్రత కావాల్సినంత ముప్పుందా?
నారా లోకేశ్ పవన్ కల్యాణ్ కన్నా, బొత్సా సత్యనారాయణ కన్నా ముప్పున్న పాలిటీషియనా? వాళ్లకు లేని భద్రత ఈయనకు ఎందుకు? దీని వెనకున్న మతలబు ఏమిటీ?
By : The Federal
Update: 2024-04-01 12:29 GMT
పొత్తులు ఎత్తులు ఎట్లున్నా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పోలీస్ భద్రత పెరిగింది. 15,16 సార్లు అడిగినా ఇవ్వని జెడ్ కేటగిరీ భద్రత ఈ ఎన్నికల సందర్భంగా ఇస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు జారీ అయిన 24 గంటల్లో ఢిల్లీ నుంచి 22 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు తుపాకులు, తూటాలు వేసుకుని నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు కుమారుడైన లోకేశ్ ఇంటికి చేరుకున్నారు. కేంద్ర నిఘావర్గాలకు అందిన నివేదిక ఆధారంగా లోకేశ్‌కు భద్రత పెంచాలని నిర్ణయించడంపై తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా మరికొన్ని సెటైర్లు పేలుతున్నాయి.
తన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖర్ని తప్పుబడుతూ చాలాసార్లు లోకేశ్ కేంద్రానికి లేఖలు కూడా రాసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లోకేశ్ భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో నలుగురైదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఉంటారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేశ్ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని లోకేశ్ కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లోకేశ్ లేఖలు కూడా రాసుకున్నారు. 2016 అక్టోబర్ లో ఏవోబీ ఎన్‌కౌంటర్ తరువాత లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ మాత్రమే కల్పిస్తూ వచ్చింది.
14సార్లు లేఖలు రాసిన లోకేశ్....
భద్రత కల్పించాలంటూ 14 సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌కు లోకేశ్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ లక్ష్యంగా అనేక సార్లు తనపై దాడులు జరిగాయని కూడా లోకేశ్ మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ తతంగం నడుస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. ఇటీవలే బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఇటీవల ఓ సభలో కూడా ప్రసంగించారు. ఆ తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకుంది.
జెడ్ స్థాయి భద్రత ఎవరికిస్తారు?
జెడ్ స్థాయి భద్రత అనేది దేశంలోని మూడవ అత్యున్నత స్థాయి భద్రత. ఎవరి జీవితాలైనా ప్రమాదంలో ఉన్నట్లు భావించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయి భద్రత కల్పిస్తుంది. ఈ భద్రతా బృందంలో మొత్తం 22 మంది ఉంటారు. నలుగురైదుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైనికులు, పోలీసు అధికారులు సహా 22 మంది ఉంటారు. జెడ్ స్థాయి భద్రత అనేది ఎక్కువ ముప్పున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం అందించే భద్రతా ప్రొటోకాల్. ఉదాహరణకు రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, ఇతర వ్యక్తులకు హాని కలిగే ప్రమాదం ఉన్నట్టు గుర్తిస్తే ఈ భద్రత కల్పిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు అభ్యర్థించినా లేదా దానికి అయ్యే ఖర్చు తాము భరాయిస్తామని చెప్పినా కూడా ఈ స్థాయి భద్రత సాధారణంగా అందుబాటులో ఉండదు. జెడ్ ప్లస్ భద్రతను అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలు వ్యక్తికి ముప్పు స్థాయిని అంచనా వేయడం ఆధారంగా తీసుకుంటాయి. అయితే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పుందని భావిస్తే ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలను ఆశ్రయించి భద్రతను పెట్టుకోవచ్చు.
లోకేశ్ జడ్ ప్లస్ సెక్యూరిటీపై స్పందిస్తూ..
లోకేశ్‌కు జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించడంపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణైతే ఏకంగా .. ఆహా.. ఆయనంత పోటుగాడా అని విమర్శించారు. ’చంద్రబాబు, ఆయన కొడుకు కోసమే ఎన్నికల కూటమి తప్ప ప్రజలకోసం కాదు’ అని బొత్స విమర్శించారు. లోకేశ్ కు జెడ్ ప్లస్ కేటగిరి కోసం జరిగిన ప్రయత్నం చూస్తుంటే.. కూటమి వెనుక జరుగుతుందేమిటో ప్రజలకు అర్థమైందని అన్నారు బొత్స. ’ నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..?’ అంటూ బొత్స ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి గురవుతున్న తరుణంలో చంద్రబాబు కొడుక్కు సెక్యూరిటీ కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అంటున్నారు బొత్స.
పవన్ కన్నా ఎక్కువ ముప్పుందా?
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కల్పించినట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించాలంటున్నారు జనసేనికులు. ’చాలా రోజుల నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌కు బయటి నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయనపై చాలా మంది కన్నేసారని అందుకోసం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆయనకు ఇప్పటివరకు కల్పించకపోగా వై కేటగిరీ కల్పించారు. కానీ నారా లోకేష్‌కు మాత్రం రిక్వెస్ట్ పెట్టుకున్న వారంలోనే జెడ్ కేటగిరీని కల్పించారు. ఇదెక్కడి న్యాయం’ అన్నారు జనసేన నాయకుడు యడ్ల నరసింహారావు.
వై క్యాటగిరీ అంటే ...
వై క్యాటగిరీలో 11 మంది సిబ్బంది ఉంటారు. వారిలో ఇద్దరు కమాండోలు, పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఎవరైతే ఇతరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటారో వారికి ఈ వై సెక్యూరిటీని కేంద్రం కల్పిస్తుంది. ఇక జెడ్ సెక్యూరిటీ ఖరీదు విషయానికొస్తే.. ఈ సెక్యూరిటీకి కేంద్రం నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే వై సెక్యూరిటీకి అయితే.. 12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
కూటమితో తొలి లబ్ధి చంద్రబాబుకేనా?
రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు కోసం రోజుల తరబడి వేచి ఉన్నారు. చివరికి సక్సెస్ అయ్యారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు మరోసారి కూడా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయనకు ఉంది. అందుకే భవిష్యత్తు ప్రయోజనాలు, వ్యవస్థల సహాకారం కోసం చంద్రబాబు బీజేపీతో చెలిమి కోసం తాపత్రయపడ్డారు అన్నారు సీపీఐ నాయకుడు జి.ఓబులేసు. బీజేపీతో చెలిమి కారణంగా టీడీపీకి ఇప్పుడు తొలి ప్రయోజనం చేకూరింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నారా లోకేష్ కు జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు లేఖలు రాసుకున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం పొత్తు కుదిరాక నారా లోకేశ్‌కి జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించడమే ఇందుకు కారణం. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కావడంతోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు నారా లోకేశ్ భద్రత విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. జడ్ క్యాటరిగీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ విధంగా చూసినా బీజేపీ చెలిమి వల్ల వనగూడిన ప్రయోజనంగా భావించాల్సి వస్తుంది.