శరత్ పవార్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా?

‘‘ఇప్పటివరకు 14 ఎన్నికల్లో పోటీ చేశాను. ప్రతిసారి మీరు నన్ను గెలిపించారు. ఇక నేను కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి పని మొదలుపెట్టా.” - శరత్ పవార్

Update: 2024-11-05 12:46 GMT

ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారా? ఆయన మాటల్లో అదే ధ్వనిస్తోంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని సుపాలో యుగేంద్ర ప్రచార ర్యాలీలో పవార్‌లో ప్రసంగించారు. తన రాజకీయ జీవితంలో 14 సార్లు ఎన్నికల్లో విజయం సాధించానని, ఇక కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు 83 ఏళ్ల పవార్.

ఆ పదవులన్నీ మీ మద్దతుతోనే ..

‘‘మీ సపోర్ట్‌తో మొదట అసెంబ్లీకి వెళ్లాను. రాష్ట్ర మంత్రిని ఆ తర్వాత కేబినెట్‌ మంత్రి అయ్యాను. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. కేంద్రంలో రక్షణ మంత్రిగా ఉన్నా. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా పది సంవత్సరాలు చేశా. ఈరోజు రాజ్యసభలో ఉన్నా. నేను స్థానిక రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నాను. నా అన్ని బాధ్యతలను ఇప్పటికే అజిత్ దాదా (మేనల్లుడు అజిత్ పవార్)కి ఇచ్చాను. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా అతను అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఇప్పుడు కొత్త నాయకత్వం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.’’ అని పేర్కొన్నారు శరత్ పవార్.

మామతో పోటీ..

నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతిలో తన మామ, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో యుగేంద్ర తలపడనున్నారు. ఈయనకు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. అజిత్ పవార్ 2023లో ఎన్సీపీని చీల్చి అధికార శివసేన-బీజేపీ కూటమితో చేతులు కలిపారు.

ప్రజలకు ఎంతో చేశా..

శరద్ పవార్ తన విజయాలను వివరిస్తూ.. తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ‘‘నేను చాలా పనులు చేశాను. రూ.70 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశాను. వ్యవసాయోత్పత్తుల ధరల పెంపునకు కృషి చేశాను. వ్యవసాయ ఎగుమతులను సులభతరం చేశాను. రక్షణ మంత్రిత్వ శాఖలో పని చేస్తూనే సాయుధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించాను.’’ అని పేర్కొన్నారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించారని చెప్పారు.

పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యను ప్రస్తుత బారామతి ఎమ్మెల్యే, మేనల్లుడు అజిత్ పట్టించుకోకపోవడాన్ని శరత్ పవార్ తప్పుబట్టారు.

‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బారామతిలో జనై శిర్సాయి (నీటి ఎత్తిపోతల) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపాను. ఆ పనిని తర్వాతి నాయకత్వానికి (అజిత్ పవార్) అప్పగించారు. కాని పని పూర్తి చేయలేదు. ఈ అసంపూర్త పనులను పూర్తి చేయడానికి కొత్త నాయకత్వం అవసరం." అని శరద్ పవార్ పేర్కొన్నారు.

ఒక్కటి మాత్రం చెప్పగలను..

‘‘నేను ఒక్క హామీ మాత్రమే ఇవ్వగలను. నేను అధికారంలో లేను. రాజ్యసభలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర పదవీకాలం మిగిలి ఉంది. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుుకుంటా. నేను లోక్‌సభకు పోటీ చేయను. ఇప్పటివరకు 14 ఎన్నికల్లో పోటీ చేశాను. ప్రతిసారి మీరు నన్ను గెలిపించారు. నేను కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి పని మొదలుపెట్టా.”అని చెప్పారు. దీన్ని మరోలా అర్థం చేసుకోకూడదని పవార్ సూచించారు.

"నేను అధికారంలో ఉండను. కానీ కరువు పీడిత ప్రాంతాలు, సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం పని చేస్తా." అని అన్నారు.  

Tags:    

Similar News