మహారాష్ట్ర ఎన్నికలు: ఆధిక్యంలో మహాయుతి కూటమి..

మహారాష్ట్రలో అధికార కూటమి మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా ఫలితాలు వస్తున్నాయి. తొలిరౌండ్‌లోనే మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Update: 2024-11-23 07:05 GMT

మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం.. 288 అసెంబ్లీ స్థానాల్లో 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే

విపక్ష మహా వికాస్ అఘాడి చతికిలపడింది. ఆ కూటమి అభ్యర్థులు కేవలం 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవంబర్ 20న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈసీ లెక్కల ప్రకారం.. మహాయుతిలో బీజేపీ అభ్యర్థులు 126, శివసేన 56, ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎంవీఏలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అభ్యర్థులు 15 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ముందంజలో సీఎం, ఆయన డిప్యూటీలు..

ఇంకా షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యతను చాటుకున్నారు.

తొలి రౌండ్ ముగిసే సమయానికి...

మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి షిండే కోప్రి-పచ్‌పఖాడి అసెంబ్లీ స్థానం నుంచి తన సమీప ప్రత్యర్థిపై 4,053 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్‌లో ఫడ్నవీస్ 2,246 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా.. బారామతి సీటులో పవార్ 3,759 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఆయన తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌తో తలపడిన విషయం తెలిసింది.

ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సకోలి నియోజకవర్గం నుంచి తొలి రౌండ్ ముగిసే సమయానికి 344 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముంబైలోని వర్లీ అసెంబ్లీ స్థానంలో శివసేన (యుబీటీ) నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే 495 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ సంగమ్‌నేర్ అసెంబ్లీ స్థానంలో 1,831 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ కూడా కరద్ సౌత్ అసెంబ్లీ స్థానంలో తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి 1,590 ఓట్లతో వెనకబడి పోయారు.

ఈ సారి కాస్త పెరిగిన పోలింగ్..

నవంబర్ 20న జరిగిన పోలింగ్‌లో చివరిగా 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో 61.1 శాతంగా రికార్డయ్యింది. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 149 అసెంబ్లీ స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇటు ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను, శివసేన (యూబీటీ) 95 మంది, ఎన్సీపీ (ఎస్పీ) 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.

Tags:    

Similar News