మహారాష్ట్ర పోల్స్ 2024: కూటముల బలాబలాలేంటి?

మహారాష్ట్ర ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి.MVA, మాయాహుతి కూటములు పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అంతర్గత విభేదాలు, పార్టీ ఫిరాయింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

Update: 2024-11-08 12:50 GMT

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ మరికొన్ని రోజుల్లో రాజకీయ సమరం జరగబోతుంది. రెండు ప్రధాన కూటముల మధ్య భీకర పోరు ఉండబోతుంది. ది ఫెడరల్ ప్రత్యేక YouTube ప్రోగ్రాం ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ ఎపిసోడ్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్ S శ్రీనివాసన్ మహారాష్ట్రలో సంక్లిష్ట రాజకీయాలు, ఎన్నికలను ప్రభావితం చేసే పలు అంశాలను విశ్లేషించారు.

రెండు కూటముల్లో విభేదాలు..

‘‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ప్రధానంగా రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ ఉండబోతుంది. మహా వికాస్ అఘాడి (MVA), BJP నేతృత్వంలోని మహాయుతి కూటమితో తలపడుతోంది. MVAలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) ఉండగా.. మహాయుతి కూటమిలో బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గం ఉన్నాయి. ప్రస్తుతం రెండు కూటముల్లోని పార్టీల మధ్య సఖ్యత కొరవడింది. ఇరుపక్షాలు తమ భాగస్వామ్యులను కాపాడుకునే పనిలో పడ్డాయి. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు ప్రయత్నించాయి’’ అని చెప్పారు శ్రీనివాసన్.

మరాఠాల ప్రభావం..

‘‘హర్యానాలో ఇటీవల బీజేపీ విజయం సాధించింది. అక్కడ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే మహారాష్ట్రలో అలా జరగకపోవచ్చు. వివిధ అంశాలను బట్టి ఓటింగ్ మారుతుంది. ఈ సారి ఎన్నికలలో మరాఠా సమాజం ఎన్నికలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారు. వీరు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చాలా కాలంగా పట్టుబడుతున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఇటీవల ఎన్నికల బరి నుంచి మరాఠా నేత మనోజ్ జరంగే-పాటిల్ వైదొలిగారు. అయితే మరాఠా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరి ఓట్లు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది’’ అని చెప్పారు.

లడ్కీ బహెన్ యోజన పథకం ఆకట్టుకుంటుందా?

‘‘మహిళలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సంక్షేమ పథకాలు కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలలో విజయవంతమైన పథకాల మాదిరిగానే షిండే నేతృత్వంలోని ప్రభుత్వం "లడ్కీ బహెన్ యోజన"పై మహిళలు ఆశలు పెంచుకున్నారు. ఈ పథకం అధికార వ్యతిరేకను తగ్గించవచ్చు.’’ అని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

వారసత్వ రాజకీయాలకు ఈ ఎన్నికలు కీలకం..

‘‘ఎన్సీపీలో చీలిక వచ్చినప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ బలమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పవార్ రాజకీయ వారసత్వానికి ఈ ఎన్నికలు చాలా కీలకం. తన మేనల్లుడు అజిత్ పవార్‌ మహాయుతి కూటమితో జతకట్టడంతో రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది. శరద్ పవార్ అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యాలు MVAకి ఎంతో ఉపయోగపడతాయి. తన వర్గం ఓటర్లను తనవైపు తిప్పుకోగలిగితే విజయం సాధించినట్లే. మహారాష్ట్రలో పెట్టుబడులు, వనరులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తీసుకెళ్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆరోపిస్తున్నారు. ఇది కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

కూటమి భాగస్వామ్య పక్షాలపై బీజేపీ ఆధారపడటం, మరాఠా రిజర్వేషన్ల అంశం, మహిళా ఓటర్లకు సంక్షేమ పథకాలు మహారాష్ట్ర ఎన్నికలలో నిర్ణయాత్మక అంశాలు కానున్నాయి. ఎంవీఏ, మహాయుతి కూటముల్లో అంతర్గత విభేదాలున్నా.. ఐక్యతగానే ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. తుది ఫలితం ఎలా ఉండబోతుందో నవంబర్ 23న తేలిపోతుంది.  

Tags:    

Similar News