‘భారత’ కూటమి సమావేశానికి రాలేను: టీఎంసీ చీఫ్ మమత

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 1న ఏర్పాటు చేసిన సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడం లేదు. ఆమె చెప్పిన కారణాలేంటి?

Update: 2024-05-28 08:07 GMT

భారత కూటమి సమావేశానికి హాజరుకావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ 1న కూటమి నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకోవడం, తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండడం వల్ల సమావేశానికి రాలేనని టిఎంసి అధినేత మమత తెలిపారు.

“ఇండియా బ్లాక్ మీటింగ్ జూన్ 1న ఫిక్స్ అయ్యింది. కానీ మా రాష్ట్రంలో ఆ రోజున ఎన్నికలు. అందుకు రాలేనని ముందే చెప్పా. పైగా తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నా. వారికి సాయం చేయడం నా బాధ్యత ’’ అన్నారు మమత.

రెమల్ తుఫానుకు పశ్చిమ బెంగాల్‌లో నలుగురు చనిపోయారు. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.

1న ఎన్నికలు..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన కోల్‌కతా సౌత్ , కోల్‌కతా నార్త్‌తో పాటు తొమ్మిది స్థానాలైన జాదవ్‌పూర్, డమ్ డమ్, బరాసత్, బసిర్‌హట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్‌ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. TMC అధినేత మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఇతర అగ్రనేతలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) మొదటి సమావేశం గత ఏడాది జూన్ 23న పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగళూరులో జూలై 17,18 తేదీలలో, ముంబైలో మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న నిర్వహించారు. డిసెంబరు 19న ఢిల్లీలో నాలుగోసారి కూటమి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో అధికార పార్టీ బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా నేతలు నిర్ణయాలు తీసుకున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించుకుని అంగీకారానికి వచ్చారు.

TMC జనవరిలో పశ్చిమ బెంగాల్‌లోని ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉండటానికి అంగీకరించింది.

ఇరవై ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడ్డాయి. అయితే, నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) వంటి కొన్ని పార్టీలు తర్వాత ఎన్‌డిఎలోకి మారాయి.

Tags:    

Similar News