’ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌కు ప్రత్యామ్నాయం చూడాలి’

ఎలక్టోరల్ బాండ్ స్కీం ఎందుకు రద్దయ్యింది. ప్రత్యామ్నాయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఏం సమాధానమిచ్చారు? అసలు ఈ స్కీం ఎందుకు తీసుకొచ్చారు?

Update: 2024-05-28 06:48 GMT
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌కు ప్రత్యామ్నాయం తీసుకురావాల్సిన అవసరం ఉందని షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్కీమ్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికలలో నల్లధనం ప్రభావం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఇతర యంత్రాంగాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఎస్‌బిఐ ద్వారా బాండ్ల రూపంలో దాతలు నుంచి రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని లోక్‌సభ ఎన్నికలకు నెల ముందు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
పార్లమెంటులో చర్చ..
ఎలక్టోరల్ బాండ్ల గురించి ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు.. "ఎన్నికలు, రాజకీయాల్లో నల్లధనం ప్రభావం పెరుగుతుందని నా అంచనా. రాజకీయ పార్టీలు ఈ ఆర్థిక సంవత్సరానికి తమ ఖాతా వివరాలు సమర్పించినపుడు..వారి వద్ద ఎంత డబ్బు ఉందన్న విషయం తెలుస్తుంది. అందులో నగదు ఎంత? చెక్కుల రూపంలో వచ్చిదెంతో బయటపడుతుంది.’’ అని సమాధానమిచ్చారు.
నల్లధనం ప్రభావం పెరిగితే ప్రత్యామ్నాయం వెతకాలి. పార్లమెంట్‌లో చర్చ జరగాలి. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేయడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నల్లధనం ప్రభావం పెరుగుతుందని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు షా “నేను అలా అనుకుంటున్నాను” అని అన్నారు.
బాండ్ స్కీమ్‌కు ప్రత్యామ్నాయం ఏమిటని అడిగినప్పుడు.. ఈ సమస్య గురించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దీనిపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని.. దీనిపై అన్ని పార్టీల‌తో చ‌ర్చించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అటార్నీ జ‌న‌ర‌ల్, సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ల‌ను కూడా సంప్ర‌దించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీల నేతలంతా సమిష్టిగా చర్చించి కొత్త ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలి"  అని పేర్కొన్నారు.
అయితే ఈ పథకం రాజకీయాల్లో నల్లధనం ప్రభావాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకొచ్చిందని చెబుతుండగా.. వ్యాపార ప్రయోజనాల ద్వారా లంచాన్ని "చట్టబద్ధం" చేయడానికి బిజెపి ఈ పథకాన్ని ఉపయోగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
అసలు ఎలక్టోరల్ బాండ్ అంటే?
ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రామిసరీ నోటు లాంటిది. ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి భారతీయ పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేసిన కంపెనీ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అలా కొన్న బాండ్లను గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను ఫైనాన్స్ బిల్లు (2017)తో ప్రవేశపెట్టారు. జనవరి 29, 2018న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 2018ని నోటిఫై చేసింది. ఈ ఎలక్టోరల్ బాండ్లను ఎప్పుడుపడితే అప్పుడు కొనేందుకు వీలుండదు. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు కోసం ప్రభుత్వం జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్‌లలో మొదటి 10 రోజులను నిర్దేశించింది.
ఎలక్టోరల్ బాండ్‌ల మీద పేరు ఉండకపోవడం వల్ల దాతను తెలుసుకునే అవకాశం రాజకీయ పార్టీకి ఉండకపోవచ్చు.
అభ్యంతరాలేంటి?
ఈ పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. విరాళాలు అందించే వారి వివరాలు గోప్యంగా ఉండడం వలన నల్లధనానికి ఆస్కారం ఉంటుందని, కార్పొరేట్ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందజేయడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలొచ్చాయి.
ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి.
మొదటి పిటిషన్‌ను 2017లో రాజ్యాంగ సంస్కరణల రంగంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), కామన్ కాజ్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా దాఖలు చేస్తే, రెండో పిటీషన్‌ను 2018లో సీపీఐ(ఎం) దాఖలు చేసింది.
ఈ పథకం రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు, దేశీయ, విదేశీ సంస్థల నుంచి గోప్యతతో, భారీగా నిధుల ప్రవాహానికి గేట్లు తెరిచేలా ఉందని, దీని వలన భారీ స్థాయిలో ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేసినట్లు అవుతుందని పిటీషన్లలో పేర్కొన్నారు.
ఏ పార్టీకి ఎక్కువ నిధులు వచ్చాయి?
అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, ఇరవై నాలుగు ప్రాంతీయ పార్టీలు 2016-16 నుంచి 2021-22 మధ్య ఉన్న ఐదేళ్ల కాలంలో మొత్తంగా రూ.9,188 కోట్ల రూపాయలను ఈ బాండ్ల ద్వారా పొందాయి.
ఈ నిధుల్లో బీజేపీకి రూ.5272 కోట్ల నిధులు వచ్చాయి. అంటే మొత్తం నిధుల్లో 58% ఈ ఒక్క పార్టీకే అందాయి.
ఇదే సమయానికి కాంగ్రెస్‌కు రూ.952 కోట్లు, తృణముల్ కాంగ్రెస్ రూ.767 కోట్లు విరాళాలుగా బాండ్ల రూపంలో పొందాయి.
Tags:    

Similar News