మహారాష్ట్రలో నాయకత్వ మార్పిడి తథ్యమా?

లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ చతికిలపడింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం ఏం చేయబోతుంది? నాయకత్వ బదిలీకి రంగం సిద్ధమైందా? అగ్రనేతల ఏమంటున్నారు?

Update: 2024-06-19 10:31 GMT

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలలో మహాయుతి కూటమి హోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కంటే తక్కువ స్థానాలు రావడంపై కాషాయ నేతలు నిరాశకు లోనయ్యారు. ఇక నాయకత్వ బదిలీ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆ ఊహాగానాలను తెరపడింది. నాయకత్వ మార్పు ఉండబోదని పార్టీ సీనియర్లు క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన మహారాష్ట్ర బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ-ఎన్‌సీపీ కూటమి విజయం సాధించేందుకు బ్లూప్రింట్‌పై కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు బీఎల్ సంతోష్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర బీజేపీ నేత చంద్రశేఖర్ బవాన్‌కులే, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, పంకజా ముండే, రావుసాహెబ్ దాన్వే, వినోద్ తావ్డే పాల్గొన్నారు.

మహారాష్ట్రలో నాయకత్వ మార్పు ఉండబోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేఖరులతో అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుత కూటమి గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించినట్లు గోయల్ తెలిపారు.

ఊహాగానాలకు తెర..

"రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మేం బ్లూప్రింట్‌ సిద్ధం చేశాం. మహాయుతి కూటమి భాగస్వామ్యాలతో కలిసి ఎలక్షన్లలో ఎలా గెలవాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాం’’ అని సమావేశం తరువాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. మహాయుతి కూటమి - బిజెపి, శివసేన (ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో), ఎన్‌సిపి (అజిత్ పవార్ నేతృత్వంలో) ప్రభుత్వానికి రాజీనామా చేసి సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఆలోచించాలని కోరారు.

అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓట్ల శాతం మధ్య తేడా కేవలం 0.3 శాతం మాత్రమే ఉందని, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లోపాలను, బలాబలాలను నేతలు కూలంకషంగా చర్చించారని ఫడ్నవీస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై బీజేపీ నేతలు శివసేన, ఎన్సీపీలతో కూడా మాట్లాడతారని ఆయన తెలిపారు.

2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ-శివసేన కూటమి 41 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ 23, అవిభక్త శివసేనకు 18 సీట్లు వచ్చాయి.

2024 ఎన్నికలలో బీజేపీకి కేవలం 9 సీట్లు రాగా, శివసేన 7 సీట్లు, ఎన్సీపీ కేవలం ఒక సీటు మాత్రమే వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే మహాయుతి కూటమి బలం 17కి పడిపోయింది.

ఫడ్నవీస్ వల్లే..

మహారాష్ట్రలో బీజేపీ దుస్థితికి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని శివసేన (యుబిటి) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రౌత్ ఇటీవల ఆరోపించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.   

Tags:    

Similar News