వయనాడ్ ప్రజలకు ప్రియాంక భావోద్వేగ లేఖ..

కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-26 10:29 GMT

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 24న ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నియోజకవర్గంలోనూ గెలుపొందారు. దాంతో వయనాడ్‌ను వీడి రాయ్‌బరేలి నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ తర్వాత ఒక రోజు విరామం అనంతరం వయనాడ్ వాసులకు ప్రియాంక భావోద్వేక లేఖ రాశారు. మీ కష్టాలను పార్లమెంటులో వినిపించే అవకాశం కల్పించాలని వయనాడ్ వాసులను కోరారు.

లేఖ సారాంశం..

‘‘కొన్ని నెలల క్రితం నేను నా సోదరుడితో కలిసి చూరమల, ముండక్కై వచ్చాను. ప్రకృతి ప్రకోపానికి కొండచరియలు విరిగిపడడంతో చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. వారి మనోవేదనను కళ్లారా చూశా. వారి రోదనలతో నా హృదయం బరువెక్కింది. వైద్యులు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, నర్సులు శ్రమించడం చూశాను.

ఇంటికి తిరిగి వెళ్తున్నపుడు ఒకటి నిర్ణయించుకున్నా. మీకు జరిగిన నష్టం పూడ్చలేనిది. ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మీ తరుపున మీ కోసం పార్లమెంటులో గళం విప్పాలనుకుంటున్నా.

మీరు నా సోదరుడిపై ఎంతో ప్రేమ చూపారు. ఆయన హృదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మీతో నా బంధాన్ని పెంచుకుని, మీ సమస్యలు పార్లమెంటులో వినిపించేందుకు నన్ను వయనాడ్‌కు కాంగ్రెస్ అభ్యర్థిని చేయమని రాహుల్‌ను అడిగాను. మీ పోరాటాలను రాహుల్ నాకు వివరంగా వివరించాడు. రైతులు, గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. మీకు అండగా నిలిచేందుకు మీ సహకారం నాకు అవసరం. మీ మద్దతుతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీరు నన్ను ఎంపీగా ఎంచుకుంటే మీకు రుణపడి ఉంటాను.’’ అని లేఖలో కోరారు.

Tags:    

Similar News