రాయ్‌బరేలీ..వయనాడ్‌.. రాహుల్ దేన్ని వదులుకుంటున్నారు?

రాయ్‌బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్ రెండింటిలో దేన్ని వదులుకోబోతున్నారు? ఆ స్థానం నుంచి పోటీచేస్తున్నదెవరు? అధిష్టానం మాటేమిటి?

Update: 2024-06-17 16:27 GMT

కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠకు తెరదించింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పొటీ చేస్తారని ప్రకటించింది. రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ తో పాటుగా వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. పార్లమెంటుకు ఆయన ఒక నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రాయ్ బరేలీకే మొగ్గు చూపారు. దాంతో వయనాడ్ నుంచి పోటీకి ప్రియాంకను పోటీ చేయించనున్నట్లు సోమవారం (జూన్‌ 17) కాంగ్రెస్‌ ప్రకటించింది.

లోక్‌సభ సెక్రటేరియట్‌లో రాహుల్ ఏ స్థానాన్ని ఖాళీ చేస్తారో తెలియజేయడానికి గడువు నేటితో ముగుస్తుంది. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా హాజరై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారా? లేదా? అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

భావోద్వేగానికి లోనైన రాహుల్ ..

‘‘ఇది అంత తేలికగా తీసుకునే నిర్ణయం కాదు. కష్టకాలంలో వాయనాడ్ ప్రజలు నాకు మద్దతు ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. నియోజకవర్గాన్ని వీడినా వయనాడ్ వాసులకు అందుబాటులో ఉంటా’’నని రాహుల్ చెప్పారు.

‘‘వాయనాడ్ నియోజక వర్గాన్ని తరుచూ పర్యటిస్తాం. ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తా. ప్రియాంక విజయంపై నాకు నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు రాహుల్

రాహుల్ నిర్ణయంపై ప్రియాంక స్పందిస్తూ.. తనకు వాయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి ప్రతినిధిగా ఉండటానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. రాయ్‌బరేలీలో పనిచేసిన తనకు 20 ఏళ్ల చరిత్ర ఉందని, భవిష్యత్తులో కూడా రాయ్‌బరేలీలో ఉన్న తన సోదరుడికి సహాయం చేస్తూనే ఉంటానని తెలిపారు.


Tags:    

Similar News