మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీని టార్గెట్ చేసిన శరత్ పవార్..

‘‘జీవన ప్రమాణాల విషయంలో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆరో స్థానానికి పడిపోయింది’ - శరత్ పవార్ .

Update: 2024-11-07 13:16 GMT

మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమైందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందాని విమర్శించారు. ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన నాగ్‌పూర్ తూర్పు అభ్యర్థి దునేశ్వర్ పేఠే ప్రచార ర్యాలీలో పవార్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీని తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.

"నాగ్‌పూర్‌కు కాంగ్రెస్, దాని భావజాలంతో లోతైన సంబంధం ఉంది, వసంతరావు నాయక్, సుధాకరరావు నాయక్‌ సహా విదర్భ నాయకులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి సాధికారత తెచ్చిపెట్టారని" అని అన్నారు.

‘రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి’

నేడు అధికారంలో ఉన్నవారు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. విదర్భలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించనందునే రైతులు ఆత్మహత్యల బాట పట్టారు’’ అని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అన్నారు. కొద్దిరోజుల క్రితమే ప్రజల జీవన ప్రమాణాలపై నివేదిక వచ్చిందని తెలిపారు.

మొదటి నుంచి ఆరో స్థానానికి..

జీవన ప్రమాణాల విషయంలో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని.. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరో స్థానానికి పడిపోయిందని పవార్ అన్నారు.

మహిళలకు రక్షణేది?

మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో నాగ్‌పూర్‌, సమీప ప్రాంతాల నుంచి బాలికలతో సహా 630 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రైతుల ప్రయోజనాలను కాపాడలేని, మహిళలకు రక్షణ కల్పించలేని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని అధికారంలో ఉన్న నాయకులకు మళ్లీ అధికారం ఇవ్వకూడదన్నారు. అధికార మార్పిడికి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని పవార్ ఓటర్లను కోరారు.

పరిశ్రమలను తరలిస్తున్నారు?

గతంలో రాజకీయ నాయకులు విదర్భ పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని భావించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు వారు నాగ్‌పూర్‌లోని బుటిబోరి, ఇతర ప్రాంతాలలో పరిశ్రమలను తీసుకువచ్చారు.

కానీ నేడు విదర్భకు పరిశ్రమలు రావడం లేదు. వచ్చినా రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లిపోవడం మనం చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిపోయిన వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌ అందుకు ఉదాహరణ.’’ అని అన్నారు.

ఫాక్స్‌కాన్ ప్లాంట్‌ మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సింది. వేలాది మందికి ఉద్యోగాలు కూడా దొరికేవి. కానీ దాన్ని గుజరాత్‌కు తరలించారు. గుజరాత్‌కు మార్చాలని ఫాక్స్‌కాన్‌ యాజమాన్యంపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలు నాగ్‌పూర్‌లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయవలసి ఉండగా..వాటిని కూడా గుజరాత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు.

“ఈరోజు దేశ ప్రధానమంత్రి ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి అధిపతి. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఆ పదవిలో కొనసాగే హక్కు ఆయనకు ఉందా? అని ప్రశ్నించే అధికారం మనమందరికి ఉంది.’’ అని అన్నారు.

విజ్ఞతతో ఓటు వేయాలి..

"మనం మహారాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలి. ప్రజలకు ఉపాధి కల్పించాలి. వ్యవసాయాన్ని మెరుగుపరచాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. అధికారంలో ఉన్నవారు ఇవి చేయలేదు. వారి నుండి అధికారాన్ని లాక్కోవాలి. మీరు, నేను ఆ పని చేయాలి. ఈ పరిస్థితిని మార్చడానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి ”అని పేర్కొన్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), సీపీఐ(ఎం), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఇతర మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మిత్రపక్షాలు కలిసి ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి వచ్చాయని చెప్పారు.

"మేము మహారాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. అభివృద్ధి ద్వారా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే వరకు మేము విశ్రమించబోం." అని పవార్ జోడించారు. కూటమి ప్రకటించిన ఐదు హామీలను నెరవేర్చే బాధ్యత ఎంవీఏపై ఉందన్నారు. నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News