‘ఆ ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయవు’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై హర్యానా ఫలితాల ప్రభావం ఉండదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.

Update: 2024-10-17 10:33 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై హర్యానా ఫలితాల ప్రభావం ఉండదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. హర్యానాలో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సతారా జిల్లాలోని కరాద్‌లో పవార్ విలేకరులతో మాట్లాడారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఇండియా కూటమి వ్యూహంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ రాష్ట్రాన్ని బీజేపీ పాలిస్తున్నదని, అధికారాన్ని నిలబెట్టుకోగలిగిందని సమాధానమిచ్చారు. "మేము హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం. అయితే ఆ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని నేను భావించడం లేదు.’’ అని పేర్కొన్నారు.

బీజేపీ హ్యాట్రిక్..

అక్టోబరు 5న జరిగిన హర్యానా ఎన్నికలలో 90 మంది సభ్యుల అసెంబ్లీలో 48 స్థానాలను గెలుచుకుని, బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

సీఎంగా ఒమర్..

జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక హోదా రద్దు అయిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన మొదటి ప్రభుత్వానికి ఒమర్ నాయకత్వం వహిస్తున్నారు.

ఎన్నికల సంఘానికి పవార్ వినతి..

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో లభ్యతలో ఉన్న గుర్తుల నుంచి ట్రంపెట్ (Trumpet) గుర్తును తొలగించాలని శరత్ పవార్ ఎన్నికల సంఘాన్ని కోరారు. గతంలో ఎన్‌సీపీ (ఎస్‌పీ)కి "మ్యాన్ బ్లోయింగ్ తుర్హా (man blowing turha)" గుర్తును కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే.

మహా వికాస్ అఘాడి కూటమి సీట్ల పంపకంలో భాగంగా సతారా జిల్లాలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎన్ని స్థానాల నుంచి పోటీచేస్తుంది అని అడిగిన ప్రశ్నకు.. సీట్లపై పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ జయంత్ పాటిల్ నిర్ణయం తీసుకుంటారని సమాధానమిచ్చారు. జయంత్ పాటిల్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందున ఆయనకు బాధ్యతలు కూడా పెరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News