మహారాష్ట్రలో వేట మొదలైంది.. రెబల్స్, స్వతంత్రులతో టచ్‌లో కూటములు.

మహారాష్ట్రలో రేపు ఫలితాలు వెలువడతాయి. దీంతో రెండూ కూటముల్లో ఉత్కంఠ నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ దాటేస్తామా? దాటకపోతే పరిస్థితి ఏమిటని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.

Update: 2024-11-22 07:20 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి. గెలుపు అవకాశాలపై రెండు రాజకీయ కూటములు లెక్కలేసుకుంటారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే స్వంత్రత్రుల మద్దతు తప్పనిసరి. అయితే కొంతమంది గెలిచిన అభ్యర్థులు కూడా పార్టీలో మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు రాజకీయ ప్రత్యర్థులు ఎరవేసే ఛాన్స్ ఇవ్వకూడదని వారిని దూరంగా తీసుకెళ్లే యోచనలో ఉన్నాయి. అందులో భాగంగానే..

బీజేపీ, శివసేన (షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి)ల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) రెండూ హెలికాప్టర్లు, హోటల్‌లను బుక్ చేసుకుంటున్నాయి. మహాయుతి కూటమికి ఎడ్జ్ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు సాధించడం రెండు కూటములకు కష్టంగానే కనిపిస్తుంది.

స్వతంత్రులు, తిరుగుబాటుదారులు కీలకమవుతారా?

హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే రెండు కూటములు వారితో టచ్‌లో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. బీజేపీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే మహాయుతి కూటమి మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు. తమ బలాన్ని మరింత పెంచుకోడానికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కోరుతామని అంటున్నారు. స్వతంత్రులు తమ నియోజకవర్గాల ప్రయోజనాల కోసం అధికార కూటమికి మద్దతు ఇవ్వడం శుభ పరిణామయని ఆయన పేర్కొన్నారు.

MVAకి సవాళ్లు..

ఇటు MVA ద్వంద్వ సవాళ్లు ఎదుర్కొంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ స్థానాలు సాధించాలి. అదే సమయంలో బీజేపీ చేసే "ఆపరేషన్ లోటస్" వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే తమ కూటమి ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెబుతున్నారు కాంగ్రెస్‌కు చెందిన బాలాసాహెబ్ థోరట్. స్వతంత్రులు, చిన్న పార్టీల బయటి మద్దతు అవసరం కూడా ఉండదంటున్నారు.

కౌంటింగ్ ఏజంట్లు చివరి దాకా ఉండాలి..

శనివారం కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని థోరట్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరి ఓటు లెక్కించి, ఫలితాలు అధికారికంగా ప్రకటించే వరకు తమ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాల వద్దే ఉండాలని సూచించారు.

అలా కూడా జరగొచ్చు...

మహాయుత కూటమికి అసెంబ్లీలో మెజారిటీ రాకపోయినా..అతి పెద్ద పార్టీగా అవతరిస్తే..బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉందని ఓ నేత చెప్పారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న భయం కూడా ఉందని మరో నేత అన్నారు. 2019లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే మద్దతు లేఖ కోసం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినప్పుడు ఏం జరిగిందో ఆయన వివరించాడు. శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్ ఎంవీఏకు 160 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంగా ఉన్నారు.  

Tags:    

Similar News