ఎన్జీరంగా పార్టీని గెలిపించిన ’ఓటుపాట’!

డబ్బుకి ఓటు అమ్ముకోవద్దని, ఒక్కపూట విందు కోసం ఓటును పాడు చేసుకోవద్దని, రైతుల తరఫున పోరాడే వారికే ఓటు వేయాలని సాగే పాట అది

Update: 2024-04-02 02:20 GMT

1932లో రైతు నాయకుడు గోగినేని రంగనాయకులు ఎలియాస్‌ ఆచార్య ఎన్జీ రంగా జైలు నుంచి విడుదలయ్యారు. గోదావరి, గుంటూరు, నెల్లూరు మొదలు అటు విశాఖపట్నం వరకు రైతులంతా కేరింతలు కొట్టారు. జమీందారులే అటవీ ప్రాంతంపై హక్కుదారులన్న విశ్వాసాన్ని పారదోలడానికి ఆచార్య ఎన్జీ రంగా లాంటి వాళ్లు నడిపిన ఉద్యమమే ఈ రైతులు కేరింతలు కొట్టడానికి ఓ కారణం. కృషీకార్‌ లోక్‌పార్టీని ప్రారంభించి ఆంధ్రదేశమంతటా తిరిగారు. ఆయన చేపట్టిన ఉద్యమానికి నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట రామానాయుడు పెట్టిన జమీన్‌ రైతు పత్రిక పూర్తి మద్దతు పలికింది. ఆ తర్వాత తాలూకా, జిల్లా బోర్డులకు ఆనాటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఎన్నికలు పెట్టుకోమని చెప్పింది. దాంతో కృషీకార్‌ లోక్‌పార్టీ నాయకుడిగా ఎన్జీ రంగా పోటీకి తమ అభ్యర్థుల్ని నిలిపి పలు చోట్ల గెలిచారు. జమీందారుల అధికారం, డబ్బు అక్కడ పని చేయలేదు. పలు ప్రాంతాల్లో రంగా పార్టీకి తాలుగా బోర్డులు దక్కాయి. రైతులే అధ్యక్ష ఉపాధ్యక్షులు అయ్యారు. ఆ సందర్భంలో పాడిన పాట కృషీకార్‌ లోక్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లు పడేటట్టు చేసింది. ఆ పాటనే తిరిగి 1951–1952 సాధారణ ఎన్నికల్లో కృషీకార్‌ లోక్‌పార్టీ అభ్యర్థులు తమ ప్రచార గీతంగా వాడుకున్నారు.


ఎంతో అర్థవంతంగా సాగే ఆ పాట ఇప్పటికీ చెల్లుబాటే. డబ్బు దస్కానికి ఓటు అమ్ముకోవద్దని, ఒక్కపూట విందు కోసం ఓటును పాడు చేసుకోవద్దని, రైతుల తరఫున పోరాడే వారికే ఓటు వేయాలని సాగే పాట అది.

ఇప్పుడు 2024. సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం మోగింది. ఓటును అమ్ముకోవద్దని ఇప్పటికీ ఎన్నికల సంఘం మొదలు పెద్ద పెద్ద నాయకుల వరకు ఎందరెందరో చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలంటే సారా, బిర్యానీ, అంతో ఇంతో నగదు తప్ప మరేమీ కాదని చాలామంది మేధావులు ఆఖరికి అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా శీతారామన్‌ సైతం ఇటీవల తన మనసులో మాట బయటపెట్టారు. ఆ పాటను ది ఫెడరల్‌ పాఠకుల కోసం ఇక్కడ యధాతథంగా ప్రచురిస్తున్నాం. ఆ పాటమేటిటో చదివి ఆస్వాదించండి.
ఓటు పాట
..............
రైతుకే ఓటు ఇవ్వవలెనన్నా! నీ కష్టసుఖములు
రైతు ప్రతిని«ధే చెప్పగలడన్నా!!
రైతునని ఓట్లడిగి తీసుక
రైతు కొంపల కూల్చుపట్లను
నీతి గాధను జ్ఞానమున నిన్‌
గోతి లోపల ద్రోయకుండడు!!
రైతుకే ఓటు ఇవ్వవలెనన్నా! నీ కష్టసుఖములు
రైతు ప్రతిని«ధే చెప్పగలడన్నా!!
విందు తిండికి లొంగ వలదన్నా!
ముందు ఆకలి తీరుటెట్లన్నా
విందు తిండితో మోసపోయి
మందమతులకు ఓట్లనిచ్చి
అందు లోభము తెలిసి వెనుకను
కొంత లాభము లేదు నిజముగ!
రైతుకే ఓటు ఇవ్వవలెనన్నా! నీ కష్టసుఖములు
రైతు ప్రతిని«ధే చెప్పగలడన్నా!
ఓటు విలువ తెలుసుకొనరన్నా! ఓ
పూట తిండికి ఓటు నిచ్చుట సిగ్గుచేటన్నా
ఓటుతోనే ముందు స్వేచ్ఛా–
కోట కట్టగ వలసి యున్నది
నైటికైనను నిదుర మేల్కొని
దాటు స్వార్థం పౌరుషముతో
నరైతుకే ఓటు ఇవ్వవలెనన్నా! నీ కష్టసుఖములు
రైతు ప్రతిని«ధే చెప్పగలడన్నా!!
(గేయ రచయిత వెంకట రామానాయుడు, జమీన్‌ రైతు పత్రికా సంపాదకులు)


Tags:    

Similar News