ఆ విషయం ఓటర్లే నిర్ణయిస్తారు? : వయనాడ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి అభ్యర్థుల వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. తమతోనే ఉండాలా? లేక ఢిల్లీలో ఉండాలన్న విషయాన్ని వయనాడ్ ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు.

Update: 2024-11-05 11:58 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ వయనాడ్ నియోజకవర్గం ఉపఎన్నికలో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇప్పటికే నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు. మూడోసారి పర్యటనలో తన ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమతోనే ఉండాలా? లేక ఢిల్లీలో ఉండాలన్న విషయాన్ని వయనాడ్ ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు.

అసలు ప్రత్యర్థులు ప్రియాంకను ఏమన్నారు?

ప్రియాంకను గెలిపించుకుంటే తన సోదరుడు రాహుల్‌లాగా ఆమె కూడా వయనాడ్‌లో ఉండరని, అతిథిగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకేరి ఇటీవల ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేశారు. బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ ప్రియాంక రాక, రోడ్‌షోను సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే "సీజనల్ ఫెస్టివల్"తో పోల్చారు.

రాజకీయాలే కారణం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రియాంక వయనాడ్ జిల్లా తిరువంబాడీ నియోజకవర్గంలో కొడెంచెరీ కార్నర్ మీట్‌లో ప్రసంగించారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘విభజన రాజకీయాలకు’ పాల్పడుతోందని ఆరోపించారు. మెడికల్ కాలేజీ లేకపోవడం, రాత్రిపూట ప్రయాణాలపై ఆంక్షలతో పాటు స్థానిక సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటి పరిష్కారానికి తన సోదరుడు రాహుల్ కృషిని ప్రియాంక అభినందించారు.

రాహుల్ ఒత్తిడి వల్లే..

"రాజకీయ కారణాల" కారణంగా ఇప్పటికీ కొన్ని సౌకర్యాలు లేకున్నా..రాహుల్ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం వయనాడ్‌లోని ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేశారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి స్థానికులు ఒత్తిడి తీసుకురావాలని ప్రియాంక కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కొంతమేర నిరుద్యోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

మొత్తం 7 నియోజకవర్గాలు..

వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వయనాడ్ జిల్లాలో మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), కల్పేట నియోజకవర్గాలున్నాయి. కోజికోడ్ జిల్లాలో ఒక నియోజకవర్గం (తిరువంబాడి) ఉండగా.. మలప్పురం జిల్లాలో మరో మూడు నియోజకవర్గాలు (ఎరనాడ్, నిలంబూర్, వండూర్) ఉన్నాయి.

బహిరంగ సభలు, కార్నర్ మీటింగులతో బిజీ అయిన ప్రియాంక నవంబర్ 7 వరకు కేరళలోనే ఉంటారని సమాచారం. నవంబర్ 13న ఓటింగ్ జరగనుంది.

ఉప ఎన్నిక ఎందుకు?

వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలుపొందారు. అయితే పార్లమెంట్‌కు ఒక స్థానం నుంచి మాత్రమే ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది.

Tags:    

Similar News