మహారాష్ట్రలో సీఎం అభ్యర్థి ఎవరు? సందిగ్ధానానికి కారణాలేంటి?

మహారాష్ట్రలో గందరగోళం నెలకొంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది తేల్చకుండానే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Update: 2024-09-26 06:50 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తేల్చకుండానే ఎన్‌డిఎ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అధికార కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. సీట్ల పంపిణీలో ఎన్‌డిఎ మిత్రపక్షాలు ఒక నిర్ణయానికి రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీయే సీనియర్ నేతలు చెబుతున్నారు.

సీట్ల సర్దుబాటుపై కుదరని ఏకాభిప్రాయం..

ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా అనౌన్స్ చేయకపోవడం వల్ల సీట్ల సర్దుబాటుపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని శివసేన సీనియర్ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డే ధృవీకరించారు. ‘‘ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ మొదటి వారంలో తేదీని ఖరారు చేయవచ్చని భావిస్తున్నాం. నవంబర్‌లో పోలింగ్ జరగవచ్చు. అయితే ఇప్పటికే కూటమిలోని భాగస్వాములు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచారం మొదలుపెట్టారు.’’ అని ఆయన వివరించారు.

అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు..

బీజేపీ సీనియర్ లీడర్లు కూడా ఈ సారి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 150 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మిగిలిన 138 స్థానాలను ఇద్దరూ కలిసి పంచుకోవాలని ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనా, అజిత్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సూచించినట్లు సమాచారం.

సీఎం పీఠం బీజేపీకేనా?

ఈ సారి ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండడం, కూటమిలో అతిపెద్ద భాగస్వామి ఆ పార్టీనే కావడంతో గెలిచిన కాషాయ పార్టీ అభ్యర్థుల్లో ఎవరోఒకరు సీఎం అవుతారని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇది కూడా సీఎం అభ్యర్థి ప్రకటించకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థుల్లో సీనియర్ కే ముఖ్యమంత్రి పీఠం కట్టబెడతారన్న వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన పోటీచేస్తున్న బీజేపీ సీనియర్లలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. ఒకవేళ బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకోగలిగితే ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అయితే సీఎం ఎవరన్నది మాత్రం నిర్ణయించేది మాత్రం కేంద్రమేనని మరికొందరు చెబుతున్నారు.

మిత్రపక్షాల మాటేమిటి?

మహారాష్ట్రలో ఎన్‌డిఎ మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి బిజెపి నేతలకే వెళ్తుందన్న వార్తలను మిత్రపక్షాలు జీర్ణించుకోలేపోతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సీనియర్ నాయకులు మాత్రం సీఎం సీటు తమ పార్టీ నేతలకు దక్కాలని భావిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే కూడా ఇదే కోరుకుంటున్నట్టు సమాచారం.

ఈ సారి మెరుగైన ఫలితాలొస్తాయా?

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్‌డిఎలో సమస్యలు మొదలయ్యాయి. అనుకున్నని స్థానాలను కూటమి గెలుచుకోలేకపోయింది. 48 స్థానాలకు 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. దీంతో రాబోయే ఎన్నికలలో తమ సత్తా చాటుకునేందుకు మూడు కూటమి భాగస్వాములు తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది.

అతిపెద్ద ఏకైక పార్టీ బీజేపీ?

ఈ సారి బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి కావచ్చని మధ్యప్రదేశ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ యతీంద్ర సింగ్ సిసోడియా ఫెడరల్‌తో పేర్కొన్నారు. “ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ కూటమిలో జూనియర్ భాగస్వాములు. గతంలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బిజెపి సీఎం సీటును వదులుకుని దాన్ని ఏక్ నాథ్ షిండేకు కేటాయించింది. ఈ సారి బీజేపీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఆ పార్టీ నుంచే సీఎం అభ్యర్థి ఉంటాడు. మహారాష్ట్రలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించే అవకాశం కూడా ఉంది’’ అని చెప్పారు. 

Tags:    

Similar News