12 ఏళ్ల తర్వాత ధనుష్ సినిమాకి కొత్త AI క్లైమాక్స్…

ఇది కళావిధ్వంసమా? లేక కథా విప్లవమా?;

Update: 2025-08-04 12:11 GMT

సినిమా అనే కళా ప్రక్రియకి సృష్టిలో మానవ భావోద్వేగాలే కేంద్రమైతే, ఇప్పుడు ఆ మనోభావాలను కృత్రిమ మేధస్సు (AI) వాడుతూ, కొత్తగా పునఃనిర్మిస్తోంది. గతంలో మనం విన్న ప్రతీ కథ – ఓ దర్శకుడి చూపు, రచయితల తలంపు, నటుడి మనస్సు మీదే ఆధారపడినది. ఇప్పుడు, ఒక క్లిక్‌తో సినిమాల ముగింపులు మార్చే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి వచ్చేసింది.

ఇది విప్లవమా? లేక… ఒక ప్రమాదకర ఆరంభమా?

"Cinema is truth 24 frames per second" అని Jean-Luc Godard చెప్పిన మాట... అయితే ఇక 24 కోడింగ్ లైన్లతో మిషన్ రాసిన క‌థలు నిజం అవుతాయా?

ధనుష్‌, బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ జంటగా దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2013లో విడుదలై, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ‘రీ-రిలీజ్‌’ ట్రెండ్‌లో భాగంగా ఆగస్టు 1న మరోసారి బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

అయితే ఈసారి కారణం సినిమా కథో లేక మరొకటతో కాదు, దానికి కలిపిన కొత్త క్లైమాక్స్.ఒరిజినల్‌ క్లైమాక్స్‌ను మార్చి, ఏఐ సాయంతో రూపొందించిన క్లైమాక్స్‌ను యాడ్‌ చేయడం. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా రూపొందించిన ఈ హ్యాపీ ఎండింగ్, తమిళంలో ‘అంబికాపతి’ పేరుతో రీరిలీజ్ అయ్యింది.

ఈ విషయమై ధనుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘రాంఝనా సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా మార్చి తిరిగి విడుదల చేయడం నన్ను భాద పెట్టింది. ఈ అసందర్భ ముగింపు సినిమా ఆత్మనే కోల్పోయింది. క్లైమాక్స్ ను మారుస్తున్నామని మేకర్స్ నాకు చెప్పారు. కానీ నేను వద్దని వారించాను అయిన వారు వినాలేదు.

ఇది 12 సంవత్సరాల క్రితం నేను కమిట్ అయిన సినిమా కాదు.సినిమాలను లేదా కంటెంట్‌ను మార్చడానికి AI ( Artificial Intelligence ) ను ఉపయోగించడం కళని కళాకారులకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానాన్ని సినిమా రూపురేఖలను మారుస్తోంది ఇది ఎప్పటికి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలులోకి వస్తాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను’ అని లెటర్ రిలీజ్ చేసారు.

అయితే AI టూల్స్ సహాయంతో కుందన్ మరణం లేకుండా సరికొత్త ముగింపుతో వచ్చిన ఈ వెర్షన్ పట్ల ప్రేక్షకులు థియేటర్లలో చప్పట్లు, కేకలతో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా అంతా:

"చూస్తుంటే కన్నీళ్లు ఆగలేకపోయాయి",

"ధనుష్ అభిమాని గా, కుందన్ బతికినట్టుగా చూసి మేము హ్యాపీ",

"ఈ AI ముగింపు మనం ఎప్పటి నుంచో కోరుకున్నది"...

అనే పోస్టుల్తో నిండిపోయింది. భావోద్వేగాలకు ముగింపు దొరికిందనే ఓ క్లోజర్‌ను అభిమానులు పొందారు. అయితే అదే సమస్యలో సినిమా పరిశ్రమ ముందు అనేక ప్రశ్నలు వచ్చి నిలబడ్డాయి.

AI వల్ల కలిగే సృజనాత్మక సంక్షోభం – భవిష్యత్తు ఏమైపోతోంది?

ఇక్కడ అసలైన చర్చ మొదలవుతుంది – ఒక చిత్రానికి కథ చెప్పిన వారి అనుమతి లేకుండా మార్చే హక్కు ఎవరిది? AI టూల్స్ సహాయంతో ఒక కథకు కొత్త ముగింపు ఇవ్వవచ్చు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఎమోషనల్ క్లోజర్ తేవచ్చు. కానీ ఇది ఒక నిర్మాతల చేతిలో ఉన్న పవర్‌ని, రచయితలు, దర్శకుల చేతులనుండి గుంజేస్తోందా?అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

భవిష్యత్‌లో, ఒక కథ యొక్క తాత్వికతను, భావోద్వేగం గల ముగింపును మార్కెట్ కోసం మార్చడం పరిపాటిగా మారితే, ఆర్టిస్ట్ స్వేచ్ఛకు అర్థవంతమైన భవిష్యత్తు ఉండదనే ఆందోళన కలుగుతోంది.

హీరో ప్రమేయం లేకుండానే కథలు మారితే..?

ఈ కేసులో మేకర్స్, హీరోకి పూర్తి సమాచారం ఇవ్వకుండా, అతను నిరాకరించినప్పటికీ కొత్త వెర్షన్ విడుదల చేశారు. ఇది కేవలం ఒక్క సినిమా మాత్రమే కాదు – ఇది ఇండస్ట్రీలో ఓ ప్రమాదకర ధోరణికి నాంది కావచ్చు. భవిష్యత్తులో నటులు, దర్శకులు ఒక కథలో ఇచ్చిన తమ శ్రమ, భావం, తాత్వికత అన్నీ AI వల్ల పునర్నిర్మితమై, అవాంఛిత రీతిలో మార్చబడే ప్రమాదం ఉంది.

సినిమా = కలలు కాదు, బాధ్యత

"Stories belong to those who live them, not to those who rewrite them." సినిమా అంటే కేవలం కాసుల వర్షం కాదు. అది భావాల సమాహారం, కళా వ్యక్తీకరణ. AI ఒక సాధనం మాత్రమే. అయితే అది సినిమాలో విషయాన్ని మొత్తంగా మార్చి వేయగలదు, అదే సమయంలో అది ఆత్మను తిరిగి సృష్టించలేదని, ధనుష్ లెటర్ స్పష్టం చేస్తోంది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, సినిమా కంటెంట్ మార్పులకు సంబంధించి కఠినమైన నిబంధనలు, నియంత్రణలు అవసరమని ప్రశ్నించాల్సిన సమయం.

"AI ఉన్నంత వరకూ ఏదైనా సాధ్యం. కానీ కళకు అర్థం మానవత"

ఫ్యాన్ కంటెంట్ తో సరిపెట్టుకోవచ్చు, ఫన్ ఎడిట్స్ తో నవ్వుకోవచ్చు. కానీ ఒక కథ తెరపై ఏదైతే చెప్తామని కమిట్ అవుతారో అదే కథ చెప్పే వారితోనే, వారిని గౌరవిస్తూ జరిగాలి. AI కథలు రాసినంత ఈజీ కాదు, కథల వెనుక ఉన్న హృదయాన్ని గుర్తించడం అంతకంటే కష్టం.

"మన కథను మనం రాస్తున్నామా, లేక మనకోసం AI రాస్తుందా?"

Tags:    

Similar News