‘రాంబో ఇన్ లవ్’ వెబ్ సిరీస్ రివ్యూ!

లవ్‌, రివెంజ్‌, స్టార్టప్ అన్నీ ఉన్నాయ్… కానీ...

Update: 2025-10-10 05:10 GMT

హైదరాబాద్‌లో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు రాంబాబు అలియాస్ రాంబో (అభినవ్ మణికంఠ). అతను ఓ స్టార్టప్ కంపెనీలో చేస్తూంటాడు.చిన్న జీవితం..ఆశలు, కలలు మాత్రం పెద్దవి! స్నేహితుడు ఆనంద్‌కి చెందిన స్టార్టప్‌ “సురా”ని నడిపిస్తూ, టీమ్‌తో కలిసి తన కంపెనీని టాప్ లెవెల్‌కి తీసుకెళ్లాలనుకుంటాడు. టీమ్ మేట్స్ తరుణ్, మేరీ, సాయి, సాత్విక్ — అందరూ “రాంబో ఉంటే ఏదైనా సాధ్యమే” అని నమ్మే లెజెండ్ లీడర్!

కానీ డబ్బు లేకపోతే కలలు కూడా కదలవు!

అప్పుడు రంగంలోకి వస్తుంది విదేశీ బిజినెస్ ఐకాన్ మిస్ యాంగ్. ఆమె రాంబో ఆలోచనను ఇష్టపడుతుంది… ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఒక ట్విస్ట్ — ఫైనల్ అప్రూవల్ ఇచ్చేది ఆమె స్పెషల్ డ్యూ డిలిజెన్స్ ఆఫీసర్.

ఆమె ఎవరంటే?

రాంబో మాజీ ప్రేమికురాలు సుకన్య (పాయల్ చెంగప్ప)!

మూడేళ్ల క్రితం స్టార్టప్ ఐడియాపై జరిగిన విభేదంతో ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఆమె చేతుల్లోనే రాంబో భవిష్యత్తు!

ఆమె పగ తీర్చుకుంటుందా? లేక పాత ప్రేమ మళ్లీ జ్వలిస్తుందా?

ఇది చాలదన్నట్లు ఫ్యామిలీ వైపునుంచి కూడా మరో షాక్ — రాంబో జీవితాన్ని తలకిందులు చేసే పరిస్దితులు సమీపిస్తున్నాయి!

రాంబో తన డ్రీమ్ స్టార్టప్‌ని కాపాడగలడా?

సుకన్య ప్రేమా లేక ప్రతీకారమా?

ఆమె రిపోర్ట్ “YES” అంటే విజయం… “NO” అంటే అంతం! చివరకి ఏమైందో తెలుసుకోవాలంటే, ఈ స్టార్టప్ ఎమోషనల్ వార్ డ్రామాని ఓటిటిలో చూడాల్సిందే.

విశ్లేషణ

“Rambo in Love”ని మొదట చూస్తే ఇది ఒక మోడర్న్ రొమాంటిక్ డ్రామా అనిపిస్తుంది — పాత ప్రేమికులు మళ్లీ కలుసుకునే ఒక ఆఫీస్ వాతావరణం, బిజినెస్ కాంటెక్స్ట్, ఎమోషన్‌తో కూడిన సెటప్‌. కానీ కేవలం ఆ బేసిక్ ఐడియా తప్ప, మిగతా ప్రతి లేయర్ స్క్రిప్ట్‌లో ఎక్కడో అరుదుగా లాజిక్ లేని రీతిలో నడుస్తుంది.

కాన్సెప్ట్‌లో పొటెన్షియల్ ఉంది — కానీ ఎక్సిక్యూషన్ శూన్యం

మాజీ ప్రేమికురాలు తిరిగి వస్తుంది, కానీ ఇప్పుడు ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కంపెనీకి ఫండింగ్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించబోయే అధికారం కలిగి ఉంది — ఇది స్క్రిప్ట్ స్థాయిలో ఒక మంచి కాన్ఫ్లిక్ట్ సెటప్. ఇందులో న్యాచురల్ టెన్షన్, సైలెంట్ ఎమోషన్, అహం, పగ, గిల్ట్ అన్నీ మిళితం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రైటర్/డైరెక్టర్ అజిత్ రెడ్డి “ఎమోషన్”కి బదులు “కామెడీ”ని ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి సీరియస్ సన్నివేశాన్ని హాస్యంగా మార్చడంతో, ప్రేక్షకుడికి ప్రధాన కాన్ఫ్లిక్ట్ పట్ల కనీస సింపతి కూడా కలగదు.

పాత్రల రాత (Character Writing)లో బేసిక్ క్లారిటీ లేదు

రాంబో (అభినవ్ మణికంఠ) పాత్ర ఒక బలమైన లీడర్‌గా, విజన్ కలిగిన యువకుడిగా మొదలవుతాడు. కానీ ఎపిసోడ్ రెండో నాటికే అతని క్యారెక్టర్ పూర్తిగా వేరే దిశలో వెళ్తుంది. ఒక సీన్లో మేధావిగా మాట్లాడి, మరో సీన్లో కార్టూన్‌లా ప్రవర్తిస్తాడు. ఈ “టోన్ ఇన్‌కన్సిస్టెన్సీ” ప్రేక్షకుడిని కనెక్ట్ కాకుండా చేస్తుంది. మిగతా క్యారక్టర్స్ ఇదే పరిస్దితి.

డ్రామా లేదు – కేవలం స్కిట్స్ మాత్రమే ఉన్నాయి

ప్రతి సన్నివేశం ఒక స్కిట్‌లా కనిపిస్తుంది. ఒక సీన్లో సీరియస్ ఇన్వెస్టర్ మీటింగ్, వెంటనే జోక్స్‌తో కట్ అవుతుంది. సీన్-టు-సీన్ ట్రాన్సిషన్‌లో ఎటువంటి ఎమోషనల్ లాజిక్ లేదు. ఈ విధంగా రైటింగ్ “సినిమాటిక్ కంటిన్యూయిటీ”ని పూర్తిగా నాశనం చేస్తుంది.

టెక్నికల్ గా..

ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాలే అయినా, ఎడిటింగ్ పేస్ సరిగా లేకపోవడం వల్ల అది డ్రాగ్‌గా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో “క్లైమాక్స్ పాయింట్” లేకపోవడంతో పెద్దగా ఆసక్తి అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సిరీస్‌ బాగానే కనిపిస్తుంది. విజువల్స్‌ డీసెంట్‌గా ఉన్నాయి. సంగీతం సగటు స్థాయిలోనే ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్‌ని మోసుకెళ్లాలసిన బదులు, అది సిరీస్‌ టోన్‌ని మరింత ఫ్లాట్‌గా చేస్తుంది.

ఫైనల్ థాట్

“Rambo in Love” వద్ద ఉన్న కాన్సెప్ట్‌లో చాలా పొటెన్షియల్ ఉంది. కానీ స్క్రిప్ట్ లెవెల్‌లో ఎమోషనల్ ఇంటెన్సిటీని పక్కనబెట్టి, ఫన్, ఫ్లఫీ టోన్ మీద నడిపించడంతో, సిరీస్ తన సొంత సొంత వైబ్‌ను కోల్పోయింది.

“Rambo in Love” ఒక స్టార్టప్ డ్రామా కాదు, ఒక స్క్రిప్ట్ డ్రాప్‌అవుట్ స్టోరీ. ఇది మోడర్న్ లవ్ అనేది ఎలా రాయకూడదో చెప్పే ఉదాహరణలా తయారైంది.

చూడచ్చా...

కొన్ని జోక్స్ బాగున్నాయి.. కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ చూడచ్చు

జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News