హీస్ట్ థ్రిల్లర్ : 'కొల్లా' మూవీ రివ్యూ!
ఈ చిత్రం కథేంటి, ఈ సినిమా మనవాళ్లకు నచ్చేదేనా చూద్దాం.;
నిజంగా జరిగిన క్రైమ్ ని తీసుకుని దాని చుట్టూ కథ, సీన్స్ అల్లి తీసిన సినిమాలు అరుదుగా వస్తూంటాయి. అయితే అవి ఆ క్రైమ్ గురించి తెలిసిన వాళ్లకు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అలా కేరళలలో 2007లో జరిగిన చేలెంబ్రా బ్యాంక్ దోపిడీ కేసు ఆధారంగా తీర్చిదిద్దిన కథే ఇది. అసలు ఘటనలో "రెస్టారెంట్", ఇక్కడ "బ్యూటీ పార్లర్" గా మార్చి చేసారు. ఈ సినిమా మళయాళంలో 2023లో వచ్చింది. ఇన్నాళ్ళకు మనకు తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటిటిలో దర్శనమిచ్చింది. ఈ చిత్రం కథేంటి, ఈ సినిమా మనవాళ్లకు నచ్చేదేనా చూద్దాం.
స్టోరీ లైన్
అనీ (రజీషా విజయన్) మరియు శిల్ప (ప్రియా ప్రకాశ్ వారియర్)… ఇద్దరూ మధ్యతరగతి జీవితాల్లోనుంచి తప్పించుకుని, ఓ సాఫిస్టికేటెడ్ జీవితాన్ని కలలు కన్న అమ్మాయిలు. కానీ వారి కలలు తీరటానికి ఓ మార్గం ఎంచుకుంటారు. అయితే అది నీతిమార్గం కాదు… చెరలో పడకుండా, చోరీ చేసి సుఖంగా బ్రతకడం!
ఓ చిన్న గ్రామానికి వచ్చి, బ్యాంకు పక్కనే ఉన్న షెట్టర్‌ను అద్దెకు తీసుకుని బ్యూటీ పార్లర్ పెడతారు. బాహ్య ప్రపంచానికి ఇది బ్యూటీ పార్లర్. కానీ అంతర్ముఖంగా చూస్తే… ఒక హీస్ట్ పాయింట్! షెట్టర్ అంతర్గత గోడల్ని తవ్వుతూ… బ్యాంక్ సేఫ్ రూమ్‌ని చేరుతారు. 26 కేజీల బంగారం… షట్ డీల్!
ఈ బ్యాంకు దొంగతనం కు 'స్టీఫెన్' సాయిం తీసుకుంటారు. స్టీఫెన్ ..గతంలోనూ నేరాలకు పాల్పడ్డవాడే. చోరీ పూర్తయ్యాక... అనీ, శిల్ప ఊర్లోనే ఉండిపోతారు — అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా. బంగారాన్ని స్టీఫెన్ స్వగ్రామానికి తరలించి, ఓ పాడుబడిన ఇంట్లో దాచి పెడతాడు. ఇక ఈ కేసుని ఇన్విస్టిగేట్ చేయటానికి వస్తాడు పోలీస్ ఆఫీసర్ ఫరూక్ (వినయ్ ఫోర్ట్). క్లూలు విప్పుతూ ముందుకు వెళ్తాడు. స్టీఫెన్‌ను పట్టుకుంటాడు కూడా.
అయితే ఊహించని విధంగా స్టీఫెన్ గుండెపోటుతో చనిపోతాడు. అనీ – శిల్ప ఇద్దరూ గందరగోళంలో పడతారు, అప్పుడు ఏమైంది. చివరకు వాళ్లు పట్టుబడ్డారా అనేది మిగతా కథ.
ఎనాలసిస్:
“ఒక మంచి ఐడియాను ఎలా వృథా చేయాలి అనేది నేర్పే తరహా రచన” అని చెప్పాలి ఈ సినిమా గురించి. సీన్లు వున్నాయ్... కానీ వాటిని నేర్పుగా కలిపే కథనమే తేలిపోయింది. బలమైన థ్రిల్లర్ కావాల్సింది. కానీ ఆ స్ట్రాంగ్ సెటప్ ని తెరమీద చాలా బేసిక్, చాలా తేలికగా చూపారు. ఇద్దరు మహిళలు భారీ దోపిడీకి తెగబడితే... ఆన్ స్క్రీన్ ఎలివేషన్, ఎమోషనల్ స్టేక్స్, సస్పెన్స్ వర్కౌట్ కావాలి. కానీ ఈ సినిమాలో దానికి అవకాశం లేదు. ఈ కథలో ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే ఇంట్రెస్టింగ్, కానీ వాటిని కలిపిన నేరేషన్ కనెక్ట్ కాలేదు.
మిడ్ పాయింట్ కూడా ఆశ్చర్యంగా కాక, “ఇది ఏంటి ఇప్పుడా?” అనే ఫీల్ ఇచ్చింది. అంతే కాదు, హీస్ట్ జానర్లో రిపీట్ అవుతూ వచ్చే మూసలు — వేషాల మార్పు, తప్పించుకునే లూప్‌లు — ఇక్కడ చాలా ఫ్లాట్ గా, బేసిక్ లెవిల్ లో వాడారు. హీస్ట్ సినిమాల్లో ఆడియన్స్‌ను మానసికంగా ఆలోచింపజేసి, వాళ్లు ఊహించిన దానికన్నా స్మార్ట్‌గా మలుపులు తిరగాలి. కానీ ‘కొల్లా’ మాత్రం “ఎక్కువగా ఎమోషన్ అయిపోయిన ప్లాట్ గా అనిపిస్తుంది. ఫినిషింగ్ షాట్ — సీక్వెల్ టీజింగ్... కానీ అసలు సినిమా పూర్తి కాకుండా ఉండిపోయినట్లు అనిపించింది!
టెక్నికల్ గా ...
సూరజ్ వర్మ దర్శకత్వం ఓ థ్రిల్లర్ కథను తెరపైకి ఆసక్తిగా తీసుకురావటంలో విఫలమయ్యారు. జాసిమ్ జమాల్ – నెల్సన్ జోసఫ్ లు రాసిన స్క్రిప్ట్ కొన్ని ఆసక్తికరమైన "పాయింట్లు" కలిగి ఉన్నా… వాటిని జాయినింగ్ డాట్స్ తేడాతో బలహీనంగా మలిచారు. దాంతో కొంత సాగతీత కనిపిస్తుంది. కాకపోతే నీట్ గా ఉంది సినిమా ఫ్యామిలీలతో కలిసి చూడదగేటట్లు ఉంది. డైలాగులు నీట్ గా ఉన్నాయి. లెంగ్త్ రెండు గంటల లోపే కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఇక నటీ నటులు కాన్సెప్టు కు తగినట్టు చేశారు… కానీ స్క్రిప్టే వారికి కలిసి రాలేదు.
ఫైనల్ థాట్
థ్రిల్లర్ కథలుకి ఇంటెన్స్ రైటింగ్ ఎంత ప్రధానమో అంతే ఇంట్రస్టింగ్ డైరక్షన్ అంతే అవసరం. ఈ సినిమాలో ఆ రెండు మిస్సయ్యాయి. ఒరిజినల్ గా జరిగిన కథలోని "లేయర్స్" స్క్రిప్ట్‌లోకి రాలేదు. ఇది ఒక మిడిల్-డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ని తెరమీద పెట్టిన ఫీల్ ఇస్తుంది. కాన్సెప్ట్ ఉంది, కాని కన్విక్షన్ లేదు.
చూడచ్చా
కాలక్షేపానికి ఓ లుక్కేయవచ్చు. థ్రిల్లర్ అనుకుంటూ ఎక్కువ ఊహిస్తే మాత్రం నిరాశపడతాం.
ఎక్కడుంది
ఈటీవి విన్ ఓటిటి లో తెలుగులో ఉంది