తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ఎన్నిక
కోల్‌బెల్ట్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈసారి ఎలాగైనా గుర్తింపు హోదా సాధించాలనే లక్ష్యంతో జాతీయ కార్మిక సంఘాలు హోరాహోరీ తలపడుతున్నాయి.
తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ఎన్నికకు తెర లేచింది. సార్వత్రిక ఎన్నికల స్థాయిలో జరుగబోతున్నాయి. ఆరు జిల్లాలు.. 18 ఓపెన్ కాస్ట్ మైన్లు, 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 13 కార్మిక సంఘాలు.. లక్షకు పైగా కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 42,733 మంది ఓటర్లున్న ఎన్నికలివి. అవే సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. నిజానికి ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలకంటే ముందే జరగాల్సినవి. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. కోర్టు కేసులు, వాయిదాల తర్వాత ఇప్పుడు జరగబోతున్నాయి.
కోల్ బెల్ట్ ఎన్నికల కోలాహలం...
కోల్‌బెల్ట్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈసారి ఎలాగైనా గుర్తింపు హోదా సాధించాలనే లక్ష్యంతో జాతీయ సంఘాలతో పాటుగా రిజిస్టర్డ్ సంఘాలు బొగ్గు గనుల్లో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ప్రధాన పార్టీలన్నీ సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని కార్మిక వర్గానికి గాలం వేసేందుకు మ్యానిఫెస్టోను రెడీ చేస్తున్నాయి. అయితే సాధారణ ఎన్నికల్లో కుదిరిన రాజకీయ పొత్తులు... సింగరేణి ఎన్నికల్లో ఉంటాయా అనే చర్చ సాగుతోంది.
ఎట్టకేలకు జరగబోతున్న ఎన్నికలు...
“ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అవతరించాలని మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం. తొలి నుంచి సింగరేణి కాలరీస్ లో మాకు బలం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో సీపీఐకి కాంగ్రెస్ కి మధ్య పొత్తు ఉన్నా ఈ ఎన్నికల్లో అలా ఉండబోదనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్ టీయూసీ ఇప్పటికే బరిలో నిలిచింది. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం” అంటున్నారు ఏఐటీయూసీ నాయకుడు షమీర్ భాషా. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల్లో ఈసారి 13 సంఘాలు హోరాహోరీ తలపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఐఎన్టీయూసీ నేతల అభిప్రాయం.
డిసెంబర్ 27న ఎన్నిక...
ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న సింగరేణి ఎన్నికలకు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. ఈ నెల 27న సింగరేణిలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కార్మిక సంఘాలు బొగ్గు గనులపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటికి అర్హత సాధించగా...39 వేల 832 మంది కార్మికులు ఓటు హక్కు వినియెగించుకోనున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా...ప్రస్తుతం ఏడోసారి ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమైంది.
25 ఏళ్ల కిందట తొలిసారి ఎన్నికలు...
1998లో సింగరేణిలో తొలిసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించడం మొదలు పెట్టారు. అంతకుముందు 76 కార్మిక సంఘాలు కార్యకలాపాలు నిర్వహించడంతో పారిశ్రామిక వివాదాలు తలెత్తి ప్రతి విషయానికి సమ్మెల వరకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సింగరేణిలో తొలిసారి 1998 జూన్‌లో ఎన్నికలను నిర్వహించింది. అప్పటి నుంచి రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించగా...2003 నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరుగుతున్నాయి. 2017 అక్టోబర్ 5 జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. 2021 నాటికి దాని కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి కోర్టు వివాదాలు, ఉత్పత్తి ఆటంకాలు కలుగుతాయనే కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే సాధారణ ఎన్నికలు ముగియడంతో...ఇప్పుడు కార్మిక శాఖ సింగరేణి ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.
6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణి...
ఆరు జిల్లాల్లో వ్యాప్తంగా విస్తరించి ఉన్న సింగరేణి పరిధిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే...ఆ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ గుర్తింపు హోదాను దక్కించుకుంది. అయితే వరుసగా రెండుసార్లు విజయం సాధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో గెలుపోందడంతో... ఆ పార్టీ అనుబంధ INTUC గుర్తింపు హోదాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ,సిపిఐ పొత్తుతో ముందుకెళ్లగా...మరి సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయుసి,ఎఐటియుసి పొత్తు విషయంపై క్లారిటి మాత్రం లేదు. ఇక బిజెపి అనుబంధ బిఎంఎస్, సిఐటియు, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలతో పాటుగా మిగితా ట్రేడ్ యూనియన్లను గుర్తింపు కార్మిక వర్గ సమస్యల పరిష్కార ఎజెండాగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
గనుల్లో ప్రచార చేసిన రాహుల్..
సింగరేణి ఎన్నికల ప్రచారానికి పొలిటికల్ పార్టీల ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సింగరేణి గనుల్లో ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ యూనియాన్ నేతలు. ఇక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపున ఎమ్మెల్సీ కవిత ప్రచారం చేయనుంది. సీపీఐ, బీజేపీ తరపున ఆ పార్టీ లీడర్లు రంగంలోకి దిగారు. మొత్తానికి కోల్ బెల్ట్‌లో సాధారణ ఎన్నికలను తలపించేలా సింగరేణి ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఏ సంఘం గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.