“తెలంగాణ రైజింగ్ 2047 ” విజన్ లో సాధారణ ప్రజలున్నారా ?

నేడు హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమయిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందేశం ఏమిటి?

Update: 2025-12-08 04:02 GMT

సమాజ భవిష్యత్ గురించి పాలకులకు ఆలోచనలు, ఉండడం, తమ ప్రాంత అభివృద్ధి నమూనా గురించి తమదైన దృష్టి కోణంతో “రంగుల డాలర్ కలలు” కనడం తప్పు పట్ట డానికేమీ లేదు. మోడీ విరచిత “వికసిత్ భారత్ 2047” దారిలోనే “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” ను ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నిస్తున్నారు.

“వికసిత్ భారత్ నమూనా” ప్రజలను, పర్యావరణాన్ని, సామాజిక న్యాయాన్ని పట్టించు కోలేదని, ఒకటి, రెండు బడా కార్పొరేట్ సంస్థలకు దేశాన్నిదోచిపెట్టే అభివృద్ధి నమూనా ఇదని” కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చాలా కాలం క్రితమే ప్రకటించింది. కానీ నిత్యం ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక రంగాలలో బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే అభివృద్ధి నమూనాను ముందుకు తోయడం ఎలా సరైందో ప్రజలకు చెప్పాలి.

ఎస్.సి రిజర్వేషన్ ల వర్గీకరణ, పాలనలో వెనుకబడిన వర్గాలకు హక్కు కల్పించడానికి రిజర్వేషన్ ల పెంపు విషయాలపై సామాజిక న్యాయం వైపు కొన్ని ప్రగతిశీల అడుగులు వేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్ధిక విధానాల విషయంలో కేంద్రంలో బీజేపీ , రాష్ట్రంలో గత BRS ప్రభుత్వం దారిలోనే మరింత ముందుకు వెళ్లాలనుకోవడం, రాజకీయంగా తనను తాను పతనం అంచులకు నెట్టుకోవడమే.

ఈ సందర్భంగా కొన్ని ప్రాధమిక విషయాలను ఇక్కడ చర్చించుకోవాలి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ “ తెలంగాణ రైజింగ్ 2047” పేరుతో చేసిన ప్రెజెంటేషన్ రూపకల్పన కోసం ప్రాతిపదికగా పెట్టుకున్న అంశాలు ఏమిటి ?

1948 వరకూ ఉన్న ఉనికిలో ఉన్నహైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? 1956 లో ఉనికిలోకి వచ్చిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి పాలకులు అమలు చేసిన ఆర్ధిక విధానాల వల్ల తెలంగాణ ప్రాంత పరిధిలో జరిగిన నష్టం ఏమిటి ? అన్న దానిపై ఇప్పటికే బోలెడంత సాహిత్యం ప్రజలకు అందుబాటులో ఉంది.

కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఈ కొత్త విజన్ రూపొందించే ముందు, ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకంలో ప్రారంభమైన నూతన ఆర్ధిక ,పారిశ్రామిక విధానాలు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు నాయుడు, డాక్టర్ వై. ఎస్ . రాజశేఖర రెడ్డి, ఇతర ముఖ్యమంత్రులు అమలు చేసిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు, మరీ ముఖ్యంగా 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల వెలుగు లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2020 అమలు తీరు, ఫలితాలు, 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక, గత పదేళ్ళ పాటు KCR ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలపై సమీక్ష ఏమైనా జరిగిందా ? నడిచిన దారిలో ఏమైనా నేర్చుకున్నారా ?

ముప్పై మూడేళ్ళ పాటు వివిధ పార్టీల ప్రభుత్వాలు నడిచిన ఆ దారి ,తెలంగాణ ప్రాంతానికి నిజంగా మేలు చేసిందా? ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందా ? ప్రజల జీవితాలను బాగు చేసిందా ? ముఖ్యంగా ఈ విధానాల అమలు వల్ల లాభ పడిందెవరు? నష్ట పోయిందెవరు ? ఈ విధానాల అమలు వల్ల రాష్ట్ర సహజ వనరులపై పడిన ప్రభావం ఏమిటి ? వీటిని లోతుగా సమీక్షించుకుంటే, ఆ చర్చల సారాంశం నుండీ భవిష్యత్ మార్గానికి రూప కల్పన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి.

ఇప్పటి నుండీ మరో 22 ఏళ్ళకు, అంటే 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో చెబుతూ రూపొందించిన ఈ విజన్ రూపకల్పనలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం, రాష్ట్ర చట్ట సభల సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు సహా, సాధారణ ప్రజలు భాగస్వాము లయ్యారా ? తమ అభిప్రాయాలు వివిధ స్థాయిలలో సమగ్రంగా సమావేశాలలో చర్చించి ఆమోదించారా ? లేదా ఈ విజన్ ను వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూసే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించి ఇచ్చిందా? నాకు సమాచారం ఉన్నంత వరకూ, అలాంటి ప్రయత్నమేదీ రాష్టంలో జరగనేలేదు. గత చరిత్రను చూస్తే రెండవ దానికే ఎక్కువ అవకాశం ఉంది.

ఈ అరకొర విజన్ పై ఆన్ లైన్ లో నిర్వహించిన ఒక సర్వే ( ప్రభుత్వమే ప్రశ్నలు ఇచ్చి, జవాబులుగా నాలుగు ఆప్షన్ లు ఇచ్చి, వాటిలో ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పి, మొదటి ప్రశ్నలు నింపితేనే , రెండవ పేజీలోకి వెళ్ళగలిగే కండిషన్ పెట్టీ ) లో నాలుగు లక్షల మంది పాల్గొన్నారని ( రాష్ట్ర జనాభాలో ఒక శాతం) ప్రభుత్వం చెప్పుకుంటున్నది కానీ, అది నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు. డిసెంబర్ 8, 9 తేదీలలో ప్రభుత్వం అట్టహాసంగా ఫ్యూచర్ సిటీ లో ఆవిష్కరించబోయే విజన్ డాక్యుమెంట్ ఇప్పటికీ ప్రజల మధ్యకు రాలేదు. తాము చెప్పింది వినడం తప్ప, తమ కలలను ఆమోదించడం తప్ప, ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు లేదని ప్రభుత్వమే చెబుతోంది. ఎట్టి పరిస్థితుల లోనూ ఇది ప్రజా పాలన లక్షణం కాబోదని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరముంది.

2015 సమగ్ర కుటుంబ సర్వే , 2024-25 కుల గణన సర్వే నివేదికలతో పాటు, పై ప్రశ్నలకు జవాబులను కూడా ప్రజల ముందు బహిరంగంగా ఉంచితే, దానిపై చర్చలకు అవకాశమిస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ చిత్ర పటాన్ని మరింత అందంగా తీర్చి దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే, కేంద్రంలో మోడీ తరహా ఏకపక్ష పాలన, రాష్ట్రంలో రేవంత్ కూడా సాగిస్తున్నాడని ప్రజలు అనుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విలువలకు పూర్తిగా భిన్నమైనది.

నిజానికి రాష్ట్రంలో ఐదేళ్ల పాలనకు అవకాశం పొందిన ఏ ప్రభుత్వానికైనా, తనకు తోచిన పద్ధతిలో దశాబ్ధాల కాలానికి ప్రణాళికలు వేయడానికి అవకాశం ఉంటుందా? వ్యక్తిగత నిజాయితీ, రాజకీయ నిబద్ధత కలిగిన అలాంటి నాయకులు ఉంటే అలాంటి ప్రణాళికలు మంచివే. కానీ ప్రజల పక్షాన, పర్యావరణ స్పృహతో ఆలోచించే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉనికిలో లేవు. మన నాయకులకు అలాంటి స్వభావమే లేదు.

ఈ స్థితిలో ఏ కారణం చేతనైనా, ప్రభుత్వ పాలనా పగ్గాలు వేరే పార్టీ నాయకుల చేతుల్లోకి పోతే, ఆ పార్టీ ఈ విజన్ ను అనుసరించి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతుందని గ్యారంటీ ఏమిటి ? “ఈ విజన్ పనికి రాదు, తాము ఇంకా మరింత అందమైన కలలను కంటామని , కాకపోతే, రేవంత్ కలగంటు న్న ఫ్యూచర్ సిటీ కాకుండా, మరో చోట ఇలాంటి మహా నగరాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని” అంటే, ప్రస్తుతం రేవంత్ కంటున్న ఈ గ్లోబల్ డాలర్ కల ఏమవుతుంది ? పాలకుల గత చరిత్ర అంతా ఇదే కదా ?

ఇప్పటికే పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పట్టా రైతుల నుండీ, అసైన్డ్ రైతుల నుండీ లక్షలాది ఎకరాల భూములు లాక్కున్నారు. గ్రామీణ ప్రజలను గోస పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆ లక్షలాది ఎకరాలు ఏమయ్యాయి? మళ్ళీ కొత్తగా భూ సేకరణకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకుంటున్నాయి ?

సమగ్ర దృక్పథం లేని ఈ విజన్ ల వల్లా, వర్తమాన వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని పాలకుల ఈ భవిష్యత్ కలల వల్లా, లాభాల వేటలో ఉండే కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, కంపనీలు, కమిషన్ లకు ఆశపడే రాజకీయ నాయకులు, అధికారులు లాభ పడతున్నారు కానీ, గత మూడు దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ అభివృద్ధి నమూనాలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులు, కూలీలు ఏమై పోయారు ? ఆర్ధికంగా, సామాజికంగా ధ్వంసమైపోయిన గ్రామీణ ప్రజల జీవితాలు ఎలా కోలుకుంటాయి ? విష కాలుష్యంతో నిండిపోయిన ఆయా పారిశ్రామిక ప్రాంతాల ప్రజల భవిష్యత్ ఏమిటి ?

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆయన్ని చోట్లా అనుకున్న వృద్ధి జరగడం లేదు. ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి. అన్ని దేశాలలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా ఉంది . ఇటీవల ముందుకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా ఈ నిరుద్యోగం మరింతగా పెరగడానికి కారణమవుతున్నది. ఆకలి, దారిద్ర్యం, వలసలు పెరుగుతున్నాయి, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, పర్యావరణ సంక్షోభం బాగా పెరుగుతున్నది. అన్ని ప్రాంతాలలో రకరకాల ప్రకృతి వైపరీత్యాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కారణంగా తీవ్ర ఆర్ధిక అసమానతలు, వివక్ష ప్రజల మధ్య విద్వేషాలకు కారణమవుతున్నాయి. అమెరికా, యూరప్ సహా, అన్ని చోట్లా, తమ జీవనోపాధుల రక్షణ, ఆదాయ బద్రత కోసం ప్రజల పోరాటాలు పెరుగుతున్నాయి. ప్రజలలో పెరుగుతున్న ఈ అసంతృప్తిని , ప్రజల ఈ పోరాటాలను అణచివేయడానికి ప్రభుత్వాలు రోజు రోజుకూ నిరంకుశంగా తయారవుతున్నాయి. ప్రజల హక్కులను హరిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో సహజ వనరులకు, ఆర్ధిక వనరులకు పరిమితులు ఉండే ఒక రాష్ట్రం తన భవిష్యత్ అభివృద్ధి నమూనాను రూపొందించుకునే సమయంలో మరింత మెలకువగా ఉండాలి. అందరితో కలసి చర్చలకు సిద్దమయ్యే విశాల హృదయంతో ఉండాలి. ప్రజలకు జవాబు దారీగా ఉంటూ అత్యంత పారదర్శకంగా ఉండాలి. అలా కాకుండా , ఏకపక్షంగా తమ నిర్ణయాలతో ముందుకు పోవాలని అనుకుంటే , ప్రజలు కూడా తమ జీవితాలు, వనరులు, హక్కుల రక్షణ కోసం తమ నిర్ణయాలు తాము తీసుకుంటారని గుర్తించాలి.

Tags:    

Similar News