ఉపాధ్యాయులు లేని విద్యాలయం -అక్షరవనం
ఏ ఒత్తిడి లేకుండా తమకు నచ్చిన రీతిలో, తమకు చేతనయిన వేగంతో విద్యను అభ్యసించొచ్చు.
ఆ స్కూలు లో ఉపాధ్యాయులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అక్కడి విద్యార్ధులకు నియమిత తరగతులూ లేవు. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసు గల ఆ విద్యార్ధులందరూ ఏ చెట్టుకిందనో, ఏ పూల పొదరిళ్ల పక్కనో కూర్చుని చదువుకుంటూ వుంటారు. పరస్పరం చర్చించుకుంటూ వుంటారు. దాదాపు 80 మంది విద్యార్ధు లు ఒక నూతన పద్దతిలో విద్యార్జన కొనసాగిస్తున్న వనం వైనం ఇది.
అలాగని అది ఏమీ సౌకర్యాలు లేని, గాలికి వదిలేసిన, వానాకాలం చదువులు చదివే నిర్లక్ష్యo చేయబడ్డ పిల్లల సమూహమేమీ కాదు. పన్నెండు ఎకరాల విశాలమైన ప్రాంగణంలో, ప్రకృతి ఒడిలో ఒదిగిన అందమైన పూలవనం మధ్య వెలిసిన మనోహర మైన పాఠశాల. అన్ని సదుపాయాలు గల ఆధునిక వసతి గృహమూ, పరిశుభ్రమైన వంటశాల, విశాలమైన భోజన శాల, అనువైన గ్రంథాలను చేర్చుకున్న పుస్తకశాల, ఆధునిక డిజిటల్ సాధనాలు వున్న ప్రయోగశాల… ఇలా అన్నీవున్నాయి. చక్కని క్రమశిక్షణ, స్వయం శిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన లతో తమ పనులు తాము చక్కదిద్దు కునే నిపుణతను నేర్పుతున్న ఒక కొత్త దృక్పథం గల విద్యాలయం అది. అంతే శ్రద్ధాసక్తులతో, ఏ ఒత్తిడి లేకుండా తమకు నచ్చిన రీతిలో, తమకు చేతనయిన వేగంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు వాళ్ళు.
ఇది చదువుతుంటే ఏదో ఊహా లోకం అనిపిస్తోందా? కాదు. నిజమే. ఈ మధ్య నేను కల్వకుర్తి [నాగర్ కర్నూల్ జిల్లా-తెలంగాణ] వెళ్లినప్పుడు ఒక మిత్రుని సూచన పై చూసిన ఒక విద్యాలయం- పిల్లవాని వికాసమే కేంద్రంగా అల్లుకున్న విద్యాబోధనను అనుసరిస్తున్న“అక్షర వనం”. కొన్ని గంటలు ఆ ప్రాంగణంలో గడిపి కొందరు విద్యార్ధులతో సంభాషించిన తరువాత నేను తెలుసుకున్న విషయాలు ఇవి.
ఈ సంస్థ విద్యాబోధనలో ఒక పరిశోధనా కేంద్రం.“నేర్చుకోవడం ఒక విహంగం లాంటిది. అది పుస్తకాల పుటల్లోనూ, తరగతిగదుల గోడలమధ్య బంధించి వుంచితే స్వేచ్చగా ఎగురలేదు” అనే దృక్పధం ఈ విద్యాలయ నిర్వాహ కులను కొత్త బోధన పద్దతుల వైపు ప్రేరేపించింది. తలిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు కలిసి సాధించ వలసింది “పిల్లలని నిత్య విద్యార్ధులుగా [నిరంతరం నేర్చుకునేవారిగా] తయారు చేయడమే”. అంటే పిల్లలలో చదువుకునే ఆసక్తిని, జిజ్ఞాసను రగిలించడమే. జ్ఞాన సముపార్జనా చింతనను మేల్కొల్పడమే. ఒక్క ఉదయకిరణం మనం వెలిగిస్తే సమయం గడుస్తున్న కొద్దీ ఆ పగటి వెలుగు ఇక ఎంత దూరమైనా వ్యాపిస్తుంది మరి. ఇదే ప్రకృతి లక్షణం..
నేర్చుకోవటం ప్రకృతి సహజం. ఏమి చదివి పక్షులు పై కెగురుతున్నాయి? ఎవరునేర్పితే చేపలు ఈదగలుగు తున్నాయి. ఎవరు నేర్పితే శిశువు మాతృభాష నేర్చుకుంటున్నాడు. నేర్పేవాడు కొన్నికోట్ల మాత్రమే అవసరం. తప్పులు, తప్పటడుగులు వేస్తూనే మనిషి నడక నేర్చుకుంటాడు. తప్పులు చేయటం సహజం. ఆ తప్పుల ద్వారానే పొరపాట్ల ద్వారానే సరైనది ఏమిటో ఎవరైనా నేర్చుకుంటారు. ప్రతివాళ్ళకి ఆలోచించే సమయం కావాలి. ఆ ఆలోచనల నుంచి తప్పొప్పులు సవరించుకునే వివేకం ఉద్భవిస్తుంది. ఈ ప్రక్రియ అందరిలో ఒకేలాగా వుండదు. ప్రతి బాలుడు, బాలిక ఒకే నిర్ణీత సమయంలో చెప్పిన అన్ని విషయాలు గ్రహించలేరు. అభ్యసించ లేరు, ఎవరి వేగం వారికుంటుంది.
ఒకే వయసులో వున్న పిల్లలయినప్పటికి ఒకరు త్వరగా, మరొకరు నెమ్మదిగా, ఇంకొకరు మందకొడిగా నేర్చు కుంటారు. దీనికి వారు పుట్టిపెరిగిన వాతావరణం, శారీరక పోషణ, ఎదుగుదల, మానసిక దృఢత్వం, దౌర్బల్యం , వీటిద్వారా ఏర్పడిన ఆసక్తులు, ఇష్టాయిష్టాలు అనేక కారణాలు వున్నాయి. వీటిని పరిగణన లోకి తీసుకోకుండా ఒక వయసు వారిని ఒక క్లాసు గా వర్గీకరించి , అందరికీ ఒక సిలబస్ నిర్ణయించి, అందరికీ ఒకేలా, ఒకే సమయంలో ఒక పాఠం చెప్పి చదువుకోమంటే వారి గ్రహణ శక్తి ఒక్కలా విప్పుకోదు. పిల్లవానికి ఆసక్తి గల విషయాన్ని అతనికి ఆసక్తి వున్న సమయంలో చెబితే సూదంటురాయిలా తక్షణమే ఆకట్టుకుంటుంది. వాడి మనసు ఎక్కడో వున్న టైములో చెబితే అది చెవిటివాని ముందు శంఖారావమే. ఏమీ బోధపడదు. ఇది అందరికీ తెలిసిన సాధారణ జ్ఞానమే.
కానీ పాఠ శాలలు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఒక మూస పద్దతిని, నిర్వహణా సౌలభ్యం గల కాలానుక్రమణికను అనుసరిస్తాయి. ఇక పోతే తల్లిదండ్రుల కోరికలకు అనుగుణంగా , వారి అభిలాషలను పూర్తి చేసేవారిగా పిల్లలను తయారు చేయటమే ప్రధానంగా అనేక విద్యాలయాలు పిల్లలను ‘బహుముఖ ప్రజ్ఞావంతులు గా’ తీర్చిదిద్ద టానికి పూనుకుంటున్నాయి. ఈ విధానం లో పిల్లలపై ఎంతటి ఒత్తిడి పడుతున్నదో, వాళ్ళు మోసే పుస్తకాల బరువు ఎంత పెరిగి పోతున్నదో ఎవరూ పట్టించుకోవడం లేదు. శిక్షణాలయాలు పిల్లలకు శిక్షాలయాలు గా మారిపోయిన సంగతిని అందరూ కావాలని విస్మరిస్తున్నారు. ఈనాటి పోటీ ప్రపంచంలో [కాంపిటిటివ్ సమాజం] పిల్లలు ఇలా పెరగవలసిందే అని పెద్దలు, తల్లిదండ్రులు నిర్ణయించేశారు. విద్యాహింస అనివార్యమని తేల్చేశారు. ఈ స్థితిలో నేర్చుకునే వాడి మీద దృష్టి పెట్టి , వాడి ప్రత్యేక, విశిష్ట లక్షణాలను గమనించి వాడికి అనువైన రీతిలో విద్య నొసగే విద్యార్థి కేంద్రిత [ చైల్డ్ సెంటర్డ్] విద్యాలయమనేది దాదాపుగా ఎక్కడా కనిపించటం లేదు. ఎన్ని లక్షల ఫీజు తీసుకున్నా సంస్థలు ఆడంబరాలు, విలాస వంతమైన పరిసరాలు కల్పిస్తున్నాయి కానీ విద్యార్ది మానసిక స్థితి కి అనువుగా విద్యగరపటంలేదు. ఇలాంటి నేపధ్యంలో నేను చూసిన అక్షర వనం కొంత ఉపశమనం గా కనిపించింది. అది కొత్త బోధన పద్దతులకు పురుడు పోస్తున్నట్లు కనిపించింది.
నిశితమైన ఆలోచనలు, సహేతుకమైన విశ్లేషణాశక్తి గల స్వతంత్ర చదువరులను తయారు చేసే విద్యను అందించ టం లక్ష్యంగా విద్యార్ధిని పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఈసంస్థను కొందరు ఉత్సాహవంతులు, విద్యాసంస్థల నిర్వహణ లో అనుభవం గడించిన ఆలోచనాపరులు 2016 లో ప్రారంభించారు. ఇక్కడి విద్యార్ధులు వివిధ సామాజిక వర్గాలకు, ఆర్ధిక స్థాయీ భేదాలకు, విభిన్నమైన సాంస్కృతిక నేపథ్యాలకు చెందినవారు. వీరి విద్యా ప్రవేశ పరీక్షలో ఉత్తర్ణులైన వారికి మరో మానసిక స్థాయి పరీక్ష కూడ నిర్వహిస్తారు. అలా సంస్థలో ప్రవేశం పొందినవారికి బస, భోజనం, బోధన, శిక్షణ అంతా ఉచితమే. పిల్లల స్థాయిని బట్టి వారికి శిక్షణ వుంటుంది.
వారు చేరిన స్థాయినుండి పైస్థాయికి [హయ్యర్ లెవెల్] వెళ్ళటానికి వయసు, టైమ్ ప్రతిబంధకం కాదు. త్వరగా నేర్చుకున్నవాళ్ళు త్వరగా పై స్థాయికి వెళతారు. ఒకే స్థాయిలో వివిధ వయసుల వాళ్ళు కలిసి అధ్యయనం చేస్తుంటారు. ఇక వీళ్ళ ప్రణాళిక లో 3-L; లాంగ్వేజ్ [భాష] లాజిక్ [తర్కం, వివేచన] లైఫ్ స్కిల్ [జీవన నైపుణ్యం] అనేవి ముఖ్యమైనవి. విద్యార్ధులకు వీళ్ళు అందించే సాధనాలు సహజసిద్ధమైనవి, స్వాభావికమైనవి, వ్యక్తిగతమైన వి, అతని సామర్ధ్యాల కు సరితూగగలిగినవి. స్వావలంబనను పెంచేవి, ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసేవి. స్వయం అంచనాలకు, స్వంత మదింపుకు ఆస్కార మిచ్చేవి. పక్క విద్యార్ధి తో పోల్చి చూసుకొనవసరం లేనివి. మరొకరితో పోటీ పడనవసరం లేనివి. అయితే వీటి ముఖ్య ఉద్దేశo స్వీయ వృద్ధి. తాను క్రమంగా ఎంతగా ఎదుగుతున్నదీ, తనకున్న లోపాలు ఏమిటి, తన బలం ఏది అని తెలిపేవి. బలాన్ని ఉపయోగించుకుని బలహీనతలను అధిగ మించటం ఎలానో నేర్పేవి. దీనివల్ల నేర్చుకోవటం ఒక భారం కాక ఒక ఇష్టంగా, జీవిత కాలపు ఆపేక్షగా మారుతుం దని వీరి విశ్వాసం.
ఒకటి నేర్చుకోవటానికి దాని గురించి కొంత తెలిసి వుండాలి. దాని గురించి పదె పదే విని వుండాలి. అప్పుడు నేర్చుకోవటం సహజంగాను, అపయత్నంగాను జరిగిపోతుంది. ఉదాహరణకి తెలుగు ఇంటిలో పుట్టిన శిశువు నిరంతరం తెలుగు వింటూ వుండటం తో అప్రయత్నంగానే తెలుగు మాట్లాడటం, కాలక్రమంలో అందులో ప్రావీణ్యత సంపాదించటం జరుగుతుంది. అలాగే ఏ ఇతర భాషనయినా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. అక్షర వనంలో లాంగ్వేజ్ ల్యాబ్ ద్వారా ఇంగ్లీష్, హిందీ, లేక మరే భాషనయినా ఒక విద్యార్ధీ వింటూ, వింటూ, సంభాషిస్తూ నేర్చు కుంటాడు. ‘విన్నవాడు మాట్లాడతాడు, చదివినవాడు రాయగలుగుతాడు’ అన్న సూత్రం ప్రకారం ఇక్కడ పిల్ల వాడు భాషలు నేర్చుకుంటున్నాడు. రాయటం అంటే అక్షరాలు రాయటం మాత్రమే కాడు. తనలోని భావాలను, భావోద్రేకాలను అక్షరాలలో పొదగటం. అక్షరవనం అలా రాయటాన్ని నేర్పుతున్నది. వివిధ భాషల వార్తాపత్రిక లు, వారపత్రికలు, సాహిత్య సంచికల నుండి ఇంటర్నెట్, చాట్ జీపిటి వరకు వారి స్థాయిని బట్టి పిల్లలకు అందుబాటు లో వుంచారు. నిత్య జీవితంలో ఉపయోగించే, కనిపించే శాస్త్రీయ విషయాలను విశదీకరించటం తో పిల్లలకు శాస్త్ర జ్ఞానం అవగతమవుతున్నది. అనేక చిన్న చిన్న ప్రయోగాల ద్వారా, నిత్యజీవిత కార్యక్రమాలలో భాగ స్వాములు కావటం ద్వారా, వాటి లోతుల గురించి ఆలోచింప జేయటం ద్వారా, ఆచారణతో శాస్త్ర పరిజ్ఞానాన్నిపరిచయం చేస్తున్నారు, దానితో వారికి పుస్తకాలలోని సైన్సు చాలా తేలికగా బోధ పడుతుంది.
జీవన కౌశలాలు పెంపొందించటం ఈ విధానంలో తలమానిక అంశం. అందుకు ప్రతి పిల్లవానికి, మొక్కల పెంపకం, ఉద్యాన వన సంరక్షణ, వ్యవసాయం, పశువుల పెంపకం, గోశాల నిర్వహణ, కోళ్ళు, బాతుల వంటి పక్షుల బాగోగు లు చూడటం వాటితో కలిసి మెలసి తిరగటం - ప్రకృతి తో జీవించటం నిత్య జీవితంలో విడదీయరాని భాగం చేయటం జరిగింది. అలాగే లలిత కళల లో ఆటపాటలలో అందరూ పాల్గొనటం తో సామూహిక జీవనం అలవోకగా అలవడుతున్నది. తప్పనిసరిగా వంటశాల లో పనిచేయటం, పాత్రలు శుభ్రం చేసుకోవటం, కావలసిన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు నిలవ చేయటం, పంపిణీ చేయటం వంటివి పిల్లల బాధ్యతలె కావటం తోవాళ్ళు లింగ భేదం లేకుండా అన్ని పనులు నేర్చుకుంటున్నారు. ఒక విధంగా భావి జీవితాన్ని ఏ ఆందోళనా లేకుండా సమస్యలు పరిష్కరించుకుంటూ సమర్ధవంతంగా జీవించటానికి తర్ఫీదు పొందుతున్నారు. ఇంకా అనేక చేతిపను లు, వడ్రంగం, ఫౌండరీ పనులు కూడా నియమిత సమయం లో విద్యార్ధులు నేర్చుకుంటారు. అలాగని విద్యార్ధులె అన్ని పనులు చేస్తున్నారను కోవద్దు. ఈ అన్ని రంగాలలో బాధ్యులు, నిపుణులైన పనివారు వున్నారు. వారి ఆధ్వర్యంలో పిల్లలు ఈ పనులలో భాగస్వాములవుతారు.
టీచర్లుగా సీనియర్ విద్యార్ధులె వ్యవహరిస్తున్నారు. విద్యార్ధులె తమ శిక్షణా బాధ్యతను తమకు తాముగా నిర్వహించుకుంటున్నారు. వారి తోటిపిల్లలే వాళ్ళకు టీచర్లు. వాళ్ళను అన్న, అక్క అని పిలుస్తూ, జూనియర్ విద్యార్దులు ఏ జంకు గొంకు, భయమూ, భీతి లేకుండా తమకున్న అన్ని సందేహాలను, అనుమానాలను, బోధ పడని అంశాలను చర్చించుకుంటూ వుంటారు. పిడికెడు మందిగా వున్న నిర్వాహకులు ఈ మొత్తం కార్యక్రమానికి కావలసిన సూచనలు అందిస్తూ, పర్యవేక్షిస్తూ పిల్లలకు పెదనాన్న, పెద్దమ్మ, బాబాయిలాగా వ్యవహరిస్తున్నారు పిల్లలు వాళ్ళను అలాగే పిలుస్తారు. సారు, హెడ్మాస్టారు అనే పదాలు ఆ ప్రాంగణంలో వినపడలేదు.
ఇది ఎక్కడో రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్ లోనో, కలకత్తా విశ్వభారతి విశ్వవిద్యాలయం లోనో మాత్రమే సాధ్యమని కొట్టిపారేయకండి. హైదరాబాదుకు 120 కి. మి. దూరంలో ఆ అక్షర వనం వికసిస్తున్నది. ఇదంతా చదివాక ఎన్నో అనుమానాలు, ఆ పిల్లలు బయటకు వచ్చాక ఏమవుతారు, మధ్యలో వెళ్లిపోవలసి వస్తే బయట ఏ క్లాస్ లో చేర్చుకుంటారు అని ఎన్నో శంకలు మీలో తలెత్తుతాయి. వీటన్నoటికి నిర్వాహకుల వద్ద సవ్యమైన, అనుభవపూర్వకమైన సమాధానాలు వున్నాయి. ఇక్కడి నుండి బయటకు వచ్చాక మరే ఇతర లాంగ్ టర్మ్ శిక్షణ లేకుండా ఐఐటీ లలో ప్రవేశం పొందిన వాళ్ళను, సివిల్ సర్వీస్ రాస్తున్న విద్యార్ధులను అడగండి చెబుతారు.
ఇదో పరివర్తనా ప్రయాణం. మనకళ్ళముందు జరుగుతున్న ఒక మంచి ప్రయోగం. విద్యారంగం లో ఏ కొన్ని మంచి మార్పులకైనా ఇది దారి తీయాలనుకోవటం అత్యాశ కాదు.