డబ్బు కొట్టు - పదవి పట్టు

తెలంగాణ పల్లెల్లో ఏకగ్రీవం బేరసారాలు

Update: 2025-12-06 06:33 GMT

 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో వినిపిస్తున్న పదం ఏకగ్రీవం . ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కోసం కాకుండా డబ్బున్న బాబుకే సర్పంచ్ పదవి అన్నరీతిలో బేరసారాలు, వేలం పాటలు సాగడం ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి.

పంచాయతీ పదవుల కోసం రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైసల బేరసారాలు నడుస్తున్నాయి. ఏకగ్రీవమనే ముసుగులో రూ.లక్షలు ఆశచూపి సర్పంచి, ఉప సర్పంచి స్థానాల్ని కొందరు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉత్తర్వులిచ్చినా బేరసారాలు మాత్రం ఆగడం లేదు.

ఇప్పటి వరకు దాఖలు చేసిన నామినేషన్లలో కొందరిని ఒప్పించి, ఎలాగైనా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు ఊరిని ఆదర్శంగా నిలిపేందుకు గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడి మంచి అభ్యర్థిని సర్పంచిగా ఏకగ్రీవం చేసుకునే వారు. గ్రామానికి అవసరమైన అన్ని రకాల వసతులను చేపట్టే బాధ్యతను కలిసికట్టుగా ఎంచుకున్న పాలకవర్గానికి అప్పగించే వారు. కానీ ఇప్పుడు ధన ప్రభావంతో ఏకగ్రీవానికి అర్థమే మారిపోయే పరిస్థితి ఏర్పడింది. డబ్బున్న వారే సర్పంచి పదవుల్ని కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి. వారిచ్చే నిధులతో ఊరి అవసరాల్ని తీర్చుకోవచ్చంటూ గ్రామ పెద్దలు కూడా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే పదవులను కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్థికంగా బలం ఉన్నవారు సులభంగా డబ్బును ఎరవేస్తూ సర్పంచి పీఠంపై కూర్చుంటున్నారు.రాష్ట్రంలో అక్కడక్కడా నిజాయతీగా ఏకగ్రీవాల్ని చేపడుతున్న గ్రామ పంచాయతీలు కూడా ఉన్నా, వాటి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో వుంది.


గ్రామ పెద్దలు, డెవలప్ మెంట్ కమిటీలే కీలకం

గ్రామాల్లో సర్పంచ్,ఉప సర్పంచ్ పదవులు ఏకగ్రీవం లో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు, విలేజ్ డెవలప్ మెంట్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఈ విషయంపై సూర్యాపేట సమీప గ్రామానికి చెందిన శ్రీరాం అనే రైతు ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ " సర్పంచ్ పదవుల రేసులో వుండే వారిని ఒకచోటకు కూర్చోబెట్టి ,గ్రామ అవసరాలకు ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో వారితోనే చెప్పించి, అతగాడికి అనుకూలంగా ఏకగ్రీవం కావడానికి గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. మిగతా వారిని ఒప్పిస్తారు " అని చెప్పారు. అయితే ఏకగ్రీవం చేయడానికి కొన్నిసార్లు విభేదాలు కూడా తప్పవన్నారు. ఇలా పదవులను కొనుకొన్నే క్రమంలో గ్రామానికి మంచి జరగడం కన్నా కొందరికే లబ్ధి చేకూరే వ్యవహారాలే ఎక్కువవుతున్నాయన్నారు.

ఏకగ్రీవాలలో వికారాబాద్ ఫస్ట్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మొదటి విడత కింద బరిలో నిలిచిన అభ్యర్థులను వివరాలను ఈసీ తాజాగా ప్రకటించింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 39 స్థానాలతో వికారాబాద్ జిల్లా ముందు వరుసలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఆదిలాబాద్ జిల్లా వుంది.బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తప్పవని ఒకవైపు ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరిస్తున్నా, పల్లెల్లో బేరసారాలు భారీగానే సాగుతున్నాయి.

ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్‌ వేసిన పక్షంలో స్వీయ ధ్రువీకరణ పత్రాలు రాయించుకునే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా, వేలం పాటల పంచాయితీ మాత్రం కొనసాగుతూనే ఉంది.

విచిత్ర హామీలు... వార్డులో అందరికీ ఫ్రీ షేవింగ్


సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు.. ములుగు జిల్లా ఏటూరునాగారం లో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై, టీవీ చానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. వట్టి మాట కాదు.. ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు.ఈ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపద్యంలో పోటీ రసవత్తరంగా మారింది.

ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుడ్ల శ్రీలత, BRS పార్టీ బలపరిచిన కాకులమర్రి శ్రీలత హోరీగా పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు.

BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి వినూత్న హామీలతో కూడిన బాండ్ పేపర్ రాసిచ్చారు . పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు.. గ్రామస్థులకు తెలియజేస్తానని కూడా అందులో పేర్కొన్నారు..గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు. ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మరోచోట చిత్ర‌మైన హామీ ఒక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండ‌లం రఘోత్తంపల్లిలో వార్డు మెంబర్ స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు విచిత్ర హామీ ఇచ్చారు. ‘నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నా వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్లపాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తా. అలాగే వార్డును అభివృద్ధి చేస్తా’ అని చెప్పారు.

ఇలా హామీలు పర్వాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా రామ్ ఘర్ గ్రామ పంచాయతీ లో ఏకగ్రీవంగా ఎన్నికైన లక్ష్మణ్ ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన తమ గ్రామ పంచాయతీ లో తాను రెండవ సర్పంచ్ గా ఎన్నికవుతున్నానని, తనతో పాటు ఉప సర్పంచ్ , 6గురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఆదివాసీలు ఎక్కువగా వున్న తమ గ్రామంలో ఉన్నత విద్యావంతుడు ఇంపుగా తనను ఎన్నుకున్నారని గ్రామ సమస్యలపై దృష్టి పెడతానని తెలిపారు. కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవులను డబ్బుతో కొంటున్నారని,అలాంటిది మంచి పద్దతి కాదన్నారు. గిరిజన కొర్పొరేషన్ లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయిగా వున్న లక్ష్మణ్ ఉద్యోగాన్ని వదులుకొని, తన ఊరు బాగుకోసం ఇప్పుడు సర్పంచ్ గా మారారు.

అసలు ఏకగ్రీవం ఎందుకు?

గ్రామ పంచాయతీ లలో అసలు ఏకగ్రీవం ఎందుకు చేయాలి.. చేస్తే లాభం వుందా ? మంచిదేకదా ? ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. అభ్యర్థుల ప్రచార ఆర్భాటం, ఖర్చులు వుండవు. అందుకే ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరులా కాకుండా హోదా కోసం డబ్బున్న వ్యక్తులు, పదవులను వేలంపాటగా మార్చడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు ప్రొఫెసర్ మోహన్ రావు ఫెడరల్ తో మాట్లాడుతూ " గ్రామానికి సేవ చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పు లేదు, అయితే ఇప్పుడు పరిస్థితులు పదవులు కాసులున్నోడి జేబు పర్సుగా మారాయి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు " అన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. డబ్బిచ్చి పదవి కొన్నవాడు, తన డబ్బు కోసమే గడ్డి తింటాడు తప్ప, గ్రామ సమస్యలు ఎందుకు తీరుస్తాడని, ఆ ఆలోచన కూడా చేయరన్నారు. ఏకగ్రీవానికి ప్రభుత్వాలు ప్రకటించిన సొమ్ములు కూడా విడుదల చేయకపోతే , ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్లతాయని ప్రొఫెసర్ మోహన్ రావు ప్రశ్నించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించే కార్యక్రమం మొట్టమొదటి సారి 1960లో రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలు దీనిని అమలు చేశాయి. ప్రస్తుతం తెలంగాణ, హరియాణ, గుజరాత్ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం గ్రామాలకు ప్రకటించిన నజరాలను విడుదల చేయక పోవడం పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలు అయితే విలేజ్ డెవలప్ మెంట్ జరిగితే బాగుంటుంది గాని, విచ్చల విడిగా పదవులను వేలం పాటలో పాడుకొని హోదా అనుభవిస్తే గ్రామాలు అభివృద్ధి మాట ఏమిటన్నది సందేహమే మరి.....

Tags:    

Similar News