గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కాంగ్రెసుకు కొత్త తలనొప్పి

డి.సి.సి. అధ్యక్షుల ఎన్నికపై పార్టీ సీనియర్లలో అసంతృప్తి

Update: 2025-11-26 11:21 GMT

జిల్లా కాంగ్రెస్ కమిటీ (డి.సి.సి.) అధ్యక్షుల నియామకం తెలంగాణ కాంగ్రెస్ లో టీ కప్ లో తుఫానుగా మారింది. అనేక జల్లాలో జూనియర్ నాయకులకు, శాసన సభ్యులకు డి.సి.సి. అధ్యక్ష పదవి దక్కటంతో ఆ పదవికి పోటీపడిన జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులలో అసంతృప్తి నెలకొంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

కొత్తగా ఎన్నికైన డి.సి.సి. అధ్యక్షుల అర్హత, సీనియారిటీ, క్రింది స్థాయి పార్టీ కార్యకర్తలలో సంబంధాలపై ఆ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలలోపార్టీని నడిపించటానికి అర్హతకు అవే ప్రామాణికం అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డి.సి.సి. అధ్యక్ష పదవికి పార్టీలో డిమాండ్ పెరిగింది అనటంలో సందేహంలేదు. తెలంగాణాలో డి.సి.సి. అధ్యక్షుల నియామకం అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) భారీ కసరత్తు చేసిన అదే స్థాయిలో సొంత పార్టీ నాయకుల నుండి విమర్శలు ఎదురుకావడం విశేషం. కొత్తగా నియమించబడిన డి.సి.సి. అధ్యక్షులకు క్షేత్ర స్థాయిలో పెద్దగా పట్టు లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు కొందరు కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయం పడుతున్నారు.

ముఖ్యమంత్రి అనుచరుగా పేరు ఉన్న తెలంగాణ ఉద్యమ కారుడు పున్న కైలాష్ నేతను నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించటం జిల్లా పార్టీలో భిన్న వాదనలకు తెరలేపింది. ఈ పదవికోసం రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్మాల మోహన్ రెడ్డి పోటీపడ్డారు. ప్రత్యక్షంగా వెంకట్ రెడ్డి రంగంలోకి దిగి మోహన్ రెడ్డికి నల్గొండ డి.సి.సి. అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ పరిశీలకుని సైతం కోరారు. అయినా ఫలితం లేకపోయింది.

గుమ్మాల మోహన్ రెడ్డి కూడా మంత్రి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి కైలాష్ నేత ఎన్నికపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నాయకులకులను తిట్టినా వారికే పదవులు వస్తాయని తనకు అర్ధం అయ్యిందని అయన అన్నారు. అతను ఆ ప్రకటన చేసిన కొన్ని గంటలలోనే మూడు సంవత్సరాల క్రితం కైలాష్ నేత వెంకట్ రెడ్డి వ్యతిరేకంగా చేసిన కొన్ని వాక్యాలు సామజిక మాధ్యమాలలో కొందరు వైరల్ చేసారు. వీటిని ఆధారంగా చేసుకొని వెంకట్ రెడ్డి నూతన డి. సి. సి. అధ్యక్షుని నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డికి లేఖ వ్రాసారు. కైలాష్ నేతకు డి సి సి అధ్యక్ష పదవినుంచి తొలగించి మరొకరిని నియమించాలని అయన ముఖ్య మంత్రిని కోరారు.

ఇదంతా ఒక పథకం జరిగిందని కైలాష్ నేత అనుచరులు భావిస్తున్నారు. వారు సైతం వెంకట్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నాయకుల పై పరుష పదజాలంతో చేసిన చేసిన వాక్యాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసి మంత్రిని ఇరుకున పెట్టె ప్రయత్నం చేసున్నారు. వెంకట్ రెడ్డి ముఖ్య మంత్రికి వ్రాసిన లేఖ బయటకు వచ్చిన కొన్ని గంటలలోనే అతని సోదరుడు, మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కైలాష్ నేత కలిసి ఆశీర్వాదం పొందటం విశేషం. కైలాష్ నేత మునుగోడు నియోజకవర్గం కు చెందిన కాంగ్రెస్ నాయకులు.

డి. సి. సి. అధ్యక్షుని నియామకంలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య ను యాదాద్రి-భువనగిరి జిల్లా డి. సి. సి. అధ్యక్షునిగా నియమించటం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొత్నిక్ ప్రమోద్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఒకరికి మూడు పదవులు కల్పించటం ఏంటని పార్టీ నాయకత్వంను ప్రశ్నిచారు. కొత్తగా పార్టీలో చేరిన వారికీ అవకాశాలు కల్పించటం, మొదటినుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారని అయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.

హైదరాబాద్ జిల్లా డి.సి.సి.సి. అధ్యక్షునిగా ఖలీద్ సైఫుల్లా సయ్యద్ నియమించటం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీతో ఐదు సంవత్సరాలకు పైగా అనుబంధం ఉన్న నాయకులను మాత్రమే డిసిసి అధ్యక్షులుగా నియమిస్తామని పార్టీ పేర్కొందని, దాన్ని ఆచరించకపోవటం బాధాకరమని కాంగ్రెస్ నాయకులు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులను డి. సి. సి అధ్యక్షునిగా నియమించటం పట్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక కుటుంబంలో రెండు పదవులు లేదా ఒక వ్యక్తికి రెండు పదవులపై పరిమితులు సైతం డి. సి. సి. అధ్యక్షుల నియామకంలో పార్టీ ఉల్లంగించిందనే అభిప్రాయంలో వారు ఉన్నారు.

కామారెడ్డి మరియు ఆసిఫాబాద్ డి.సి.సి అధ్యక్షులుగా రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిని నియమించటం పట్లకూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మల్లికార్జున్ ఆలే ను కామారెడ్డి డి. సి. సి అధ్యక్షునిగా, ఆత్రం సుగుణ ను ఆసిఫాబాద్ డి. సి. సి అధక్షురాలిగా నియమించటం తెలిసిన విషయమే.

నాయకుల కుటుంబ సభ్యులకు డి. సి.సి. అధ్యక్షులుగా నియమించటం పట్లకూడా పార్టీలో కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మెదక్ డీసీసీ అధ్యక్షుడు తుమ్మకుంట నర్సారెడ్డి స్థానంలో ఆయన కుమార్తె తుమ్మకుంట అంక్షారెడ్డిని నియమించటం, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ భార్య కు కట్టబెట్టడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.

డి.సి.సి. అధ్యక్షుల నియామకం పై పార్టీ నాయకులు, కార్యకర్తలలో నెలకొన్న అసంతృప్తి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉంది. పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పదు అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News