చరిత్రను వక్రీకరించారా? పవన్ సినిమా పై మత పెద్దల అభ్యంతరం ఏమిటీ?

'హరిహర వీరమల్లు' బాయ్ కట్ కు ముస్లిం మైనారిటీలు పిలుపిచ్చారా?;

Update: 2025-07-24 13:43 GMT
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాపై వివాదం రాజుకుంది. ఓపక్క ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు- ఈ సినిమాను బాయ్ కట్ చేయమని పిలుపివ్వగా తాజాగా ముస్లిం పెద్దల పేరిట కొందరు గొంతుకలిపారు. దీంతో ఇప్పుడిది రాజకీయ వివాదానికి తెరలేపినట్టయింది.
ఈ సినిమా సక్సెస్ కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు బీజేపీ నేతల వరకు పలువురు ట్వీట్లు చేశారు. సరిగ్గా ఈ నేపథ్యంలో వైసీపీ బాయ్ కట్ పిలుపు ఇచ్చింది.
వైసీపీ స్ధాపించినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ముస్లిం సమాజంలో ఎక్కువ ఓట్లు వైసీపీకే పడ్డాయనే వాదన ఉంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తలకెత్తుకున్న సనాతన ధర్మాన్ని అటు వైసీపీ బాహాటంగా వ్యతిరేకించకపోయినా ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించారు. కొందరైతే ఓపెన్ గానే ప్రకటనలూ ఇచ్చారు.
సరిగ్గా ఈ తరుణంలో ఈ సినిమా విడుదలైంది. ముస్లింలు హిందువులకు వ్యతిరేకం అనే అర్థం వచ్చేలా ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయని, అందుకే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నా ఈ బాయ్ కాట్ పిలుపు వెనుక వైసీపీ ఉండవచ్చునన్న అనుమానాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా కథపై ముస్లిం పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు చనిపోయింది 1355వ సంవత్సరం కాగా ఔరంగజేబు పుట్టింది 1618 అని, చార్మినార్ నిర్మించింది 1591వ సంవత్సరమని, అందువల్ల ఈ సినిమా తలాతోకా లేకుండా నిర్మించారని, ఇన్ని తప్పులున్న ఈ సినిమా లక్ష్యం మత విద్వేషం తప్ప మరొకటి కాదంటూ పోస్టర్లు వెలిశాయి. దానికి తగ్గట్టుగానే ముస్లిం పెద్దల వాయిస్ లతో ఆడియోలూ సర్కులేట్ అవుతున్నాయి.
వాటి సారాంశం ఇలా ఉంది...
నేనో పోస్టర్ ఫోర్వర్డ్ చేశాను. ఇదెందుకు పంపానని ప్రశ్నించవచ్చు. అసలు సమస్య సినిమా గురించి కాదు. ఈ సినిమాలో ముస్లిం రాజులను హిందువుల శత్రువులుగా చూపిస్తున్నారు. అక్బర్ కాలంనాటి ముస్లిం రాజులను హిందువుల శ్రతువులుగా చూపిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముస్లింలను హిందువుల శ్రతులువుగా చూపిస్తున్నారు. ఇదొక తప్పుడు కథ. దీనిని ప్రజల ముందుకు తీసుకొచ్చి హిందు, ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. వీళ్లు ఇప్పుడూ కూడా ఇలాంటి గొడవలు పెట్టడానికే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. హిందూ రాజులు సాటి హిందూ రాజులపై యుద్ధాలు చేశారు.. ఆక్రమణలు చేశారు. వేల మందిని చంపారు. ఇలాంటి హిందుస్థాన్‌లోని మహారాజుల కథలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పక్కనబెట్టి కేవలం హిందూ, ముస్లిం అన్న వివాదాన్ని లేవనెత్తడం కోసం ప్రతిసారి అక్బర్ కాలం నాటి ముస్లిం మహారాజులను హిందువుల శత్రువులుగా చూపిస్తున్నారు. కాబట్టి నేను ముస్లిం యువత, సినిమా చూసే వారందరిని కోరుకునేది ఒకటే.. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయండి. మనమంతా కూడా ఇండియా సంస్కృతిలో, చరిత్రలో భాగమే. మనం వేర్వేరు కాదు. మనమంతా ఒక్కటే.
హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లు అందరూ సమానమే. మనమంతా ఒకటే అంటూనే హరిహర వీరమల్లు సినిమాను బహిష్కరించమంటూ ముస్లిం పెద్దల పేరిట విడుదల పేరిట విడుదలైన ఓ ఆడియో టేపు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఆడుతుందనే మాట ఎలా ఉన్నా సమాజంలో చీలికలు తెచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది
చారిత్రక అంశాల ఆధారంగా కల్పిత కథనాలతో తెరకెక్కిన సినిమాలు మతఘర్షణలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు తలెత్తినప్పటికీ, రాజకీయ ప్రేరణలతో ఈ వివాదం ముదరుతుందన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక సినిమాపై చర్చ ప్రజాస్వామ్య బలమే అయినా, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఈ దిశగా రాజకీయాలు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
Tags:    

Similar News