సైక్లాజికల్ హారర్ థ్రిల్లర్ : " ఘటికాచలం" రివ్యూ

మరి ఈ సినిమా ఒక 'సైలెంట్ స్క్రీమ్'లా మనను షేక్ చేసిందా? లేక ఒక 'ఇంటెన్స్ ఎఫర్ట్ వితౌట్ ఇంపాక్ట్'గా మిగిలిందా? రివ్యూ లో చూద్దాం;

Update: 2025-07-03 02:30 GMT

 తెలుగు సినీ ప్రపంచంలో థ్రిల్లర్ అంటే ఎక్కువగా హత్యలు, రహస్యాలు, పోలీస్ కేసులే గుర్తుకు వస్తాయి. కానీ మన లోపలే నిత్యం జరిగే మౌన సంగ్రామాల్ని తెరపై చూపించగలిగే థ్రిల్లర్లు మాత్రం చాలా అరుదు. ‘ఘటికాచలం’ అనే చిత్రం ఆ ఖాళీని నిశ్శబ్దంగా, కానీ ప్రభావవంతంగా భర్తీ చేయాలని ప్రయత్నించింది. మానసిక ఒత్తిడితో తల్లడిల్లే పిల్లల మనస్తత్వం, సమాజపు నిర్లక్ష్యం, కుటుంబాల అజాగ్రత్త వీటిపై దృష్టి పెట్టింది. మరి ఈ సినిమా ఒక 'సైలెంట్ స్క్రీమ్'లా మనను షేక్ చేసిందా? లేక ఒక 'ఇంటెన్స్ ఎఫర్ట్ వితౌట్ ఇంపాక్ట్'గా మిగిలిందా?

స్టోరీ లైన్

మెడిసిన్‌ చదువుతున్న కౌశిక్ (నిఖిల్ దేవాదుల) బయటకు కనిపించేది మామూలు కుర్రాడిగానే. కానీ లోపల… అర్ధం కాని భయాల, ఒత్తిడుల అగాధంలో మునిగిపోతున్నాడు. ఇంట్రోవర్ట్‌. తాను కోరని జీవితాన్ని గెలవాలని వాళ్ల నాన్న పరుశురామ్ (ఈటీవీ ప్రభాకర్) ఆశిస్తున్నాడు. అతని పరిస్దితి ఎలా అయ్యిపోతుందంటే.... మిగతా ప్రపంచానికి దూరంగా ఉండిపోతూంటాడు. తనదైన ప్రపంచంలో కూరుకుపోతూంటాడు. మనుస్సు విప్పి మాట్లాడలేడు. చివరకు తనకిష్టమైన కూర చెయ్యమని కూడా తల్లిని అడగలేడు. తను ప్రేమించే అమ్మాయి తన క్లాస్‌మెట్ (సంయుక్త రెడ్డి)ని విషయం లోనూ నిశ్శబ్దంగా మిగిలిపోతూంటాడు.

అలా జరిగిపోతూండగా అతని జీవితంలో ఓ పెద్ద కుదుపు. ఒక్కసారిగా… అతనికే వినిపించే ఓ భీకరమైన వాయిస్‌ వినిపించటం మొదలవుతుంది. చదువుకోనివ్వదు. తిరుగుబాటుగా మలుస్తుంది. అతడి ప్రవర్తనలో మార్పులు మొదలవుతాయి. సైకాలజిస్ట్ ఒకరు దీనిని మానసిక రుగ్మతగా చెబుతాడు. కానీ ఓ మంత్రగాడు మాత్రం… ఇది decades క్రితం మరణించిన "ఘటికాచలం" అనే దెయ్యం చేష్టగా తేలుస్తాడు.

ఇంతకీ కౌశిక్ నిజంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? లేక ఘటికాచలం ఆత్మ అతన్ని ఆవహించిందా? ఇంతకీ ఘటికాచలం ఎవరు ? చివరకు కౌశిక్ పరిస్దితి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

'పిల్లలని వేరొకరి కలలు కనాలని బలవంతం చేసినప్పుడు, పీడకలలు పుడతాయి" అనే కాన్సెప్టు తో వచ్చిన ఘటికాచలం కథ, పైకి చూస్తే ఓ రెగ్యులర్ "పిజెస్డ్ పోసెషన్" హారర్ లా అనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే... ఇది ఒత్తిడితో కొట్టుమిట్టాడే మన కలల్ని తినేసే సామాజిక పరిస్దితులపై ఓ ప్రశ్న లా కనిపిస్తుంది. అయితే కాన్సెప్టు స్దాయిలో సినిమాలేదనిపిస్తుంది.

“Horror isn’t always about what haunts us outside. Sometimes, the loudest screams are heard inside our heads.”

కౌశిక్ పాత్ర — ఓ ఇంట్రోవర్ట్, ఓ రెబెల్, ఓ బాధితుడు. వాడి మౌనం వెనుక యాతన, మనతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. అతని వేదనను దెయ్యం రూపంలో చూపించాలనే ప్రయత్నం చేసిన పాయింట్, రచనలోనే ఓ విలక్షణతను చూపిస్తుంది అక్కడదాకా దర్శకుడు..రచయితగా సక్సెస్ అయ్యారు. ప్రధాన పాత్ర ప్రయాణాన్ని మానసిక స్థాయిలో మరింత లోతుగా ఆవిష్కరించగలిగితే, ఇది ఒక ట్రాన్స్‌ఫార్మేటివ్ పర్ఫార్మెన్స్ అయ్యేదే. కానీ కథ కొన్ని చోట్ల ఊహించదగ్గ మలుపులతో, కొన్ని ట్రోప్స్‌పై ఆధారపడటంతో, ప్రేక్షకుడిని పూర్తిగా తనలోకి లాగలేకపోయింది.

సైకలాజికల్ థ్రిల్లర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదు. ఇది చూసే వారిని ఆ ప్రశ్నలు అడగ గలగాలి. ఘటికాచలం పేరే భయానికి కారణం. కానీ ఆ భయం నుంచి వచ్చే filmic unease — దెయ్యం నిజమా? భ్రమల ఫలితమా? అనే దానికి ట్రీట్‌మెంట్ కావాల్సిన స్దాయిలో లేకపోవడంతో మనం నెమ్మదిగా సినిమాపై ఉత్సాహాన్ని కోల్పోతాం. ముఖ్యంగా సైకలాజికల్ టెన్షన్ ఎక్కువగా ఉండాల్సిన చోట, కొన్ని బాబాలు, మంత్రగాళ్ళు వచ్చి కథను డైల్యూట్ చేశారు.

టెక్నికల్ గా ...

“ఘటికాచలం” ఒక చిన్న బడ్జెట్ సినిమాలో కంటెంట్ మీద ఆధారపడుతూ, టెక్నికల్ గా విజన్‌ తో చేసిన సినిమా. దర్శకుడు ఉన్నంతలో బెస్ట్ అవుట్ ఫుట్ అన్ని విభాగాల నుంచి తీసుకున్నారు. కెమెరామెన్ ఎస్‌.ఎస్‌. మనోజ్ వర్క్ బాగుంది. ముఖ్యంగా కథలోని మానసిక ఉద్వేగాలకి తగినట్టు లైటింగ్ టోన్‌ మారుస్తూ, కొన్ని సన్నివేశాల్లో మంచి మూడ్ తీసుకురాగలిగాడు. ఫ్లావియో సంగీతం సందర్భానుసారంగా పని చేసింది.

బీజీఎం కొన్నిచోట్ల మంచి వర్క్ ఇచ్చింది. ఎడిటింగ్, డైలాగ్స్, ఆర్ట్ డైరెక్షన్ వంటి విభాగాలు సినిమా స్థాయికి తగినట్టే ఉన్నాయి. అయితే ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మరికొంచెం ఖర్చుపెట్టించి ఉంటే విజువల్‌గా సినిమా ఇంపాక్ట్ ఇంకా బాగా ఉండేది. ముఖ్యంగా కౌశిక్ పాత్రలోని మానసిక వేదనను బలంగా చూపించే సన్నివేశాల్లో లైటింగ్, DI వర్క్ బాగా కుదిరింది.

నటీనటుల్లో ..కౌశిక్ గా చేసిన నిఖిల్ దేవాదుల చాలా బాగా చేసాడు. అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకుంటాడనిపించింది. తండ్రి పాత్రలో ప్రభాకర్, చెల్లెలుగా తన్మయ్, స్నేహితురాలిగా సమ్యు రెడ్డిలు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఫైనల్ థాట్

“దెయ్యాలు ఎప్పుడూ బయట ఉండవు… కొన్ని మనలోనే పుట్టి, మనతో పాటే ఎదిగి, మననే వెంటాడతాయి.” అనే విషయం తెలిసిందే అయినా తెరపై చూడటం మంచి విషయమే. “ఘటికాచలం” ఓ సాధారణ దెయ్యం కథలా కనిపించినా… అసలు దెయ్యం మనలోనే ఉందని గుర్తు చేస్తుంది.

మానసిక రుగ్మతల పట్ల సమాజం చూపించే అపహాస్యం, అవగాహన లోపం. ఈ సినిమా ప్రయత్నం చేసింది. ఇది పరిపూర్ణమైన సినిమా కాదు. కానీ, ఇది సరైన దిశలో వేసిన ఓ మెంటల్-హెల్త్ కాన్షస్ స్టెప్. కథ, నటన, టెక్నికల్ ఎఫర్ట్‌లలో కొంత ఇబ్బంది ఉన్నా… కథ వెనకున్న సందేశం మాత్రం నిజంగా విలువైనది.

చూడచ్చా

ఓటిటిలో ఉంది కాబట్టి ఓ లుక్కేయచ్చు. మన ఇంట్లోనూ ఇలాంటి పిల్లలు తయారు అవుతున్నారేమో అని గమనించుకోవచ్చు. అయితే ఎంటర్నైన్మెంట్ మాత్రం వెతక్కండి.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News