తగ్గేదేలే: ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’టీమ్ పై గెలిచిన ఇళయరాజా

పాట నష్టపరిహారం కేసులో రాజీ కొచ్చిన సినిమా నిర్మాతలు

Update: 2024-08-04 03:42 GMT

ఈ రోజున పనిగట్టుకుని ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా(Ilayaraja) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన భారతీయ సినీ సంగీత శిఖరం అనేది అందరూ ఒప్పుకుని తీరేదే . ఇప్పటికి ఆయన పాటలకు ఓ రేంజి డిమాండ్ ఉంది. ఇక 80, 90 లలో అయితే అద్బుతాలు చేసారు తన సంగీతంతో ఆయన. సౌత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప పాటలని అందించాడు ఇళయరాజా. అయితే కొంత కాలంగా తనకు నచ్చే ప్రాజెక్టులను సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. అయితే అదే సమయంలో తన పాత పాటల రైట్స్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. వాటిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. తన ఫర్మిషన్ లేకుండా ఆయన పాటలను సినిమాల్లో వాడటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో నే ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ నిర్మాణ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపారు.


ఆ మధ్యన విడుదలై అన్ని భాషల్లోనూ ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ (Manjummel Boys movie) విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో గతంలో ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘గుణ’లోని పాటను వాడారు. ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఈ హిట్ సాంగ్‌ను వాడుకున్నారని ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరఫు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు.

తన అనుమతి లేకుండా ఓ పాటను ఆ సినిమాలో ఉపయోగించారని పేర్కొన్నారు. ఇది కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు. సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు. ఆ సమయంలో చాలా మంది ఇళయరాజాని ట్రోల్ చేసారు. యంగ్ టీమ్ ని ఎంకరేజ్ చేయకుండా ఎందుకు ఇలా లీగల్ నోటీస్ లు పంపుతున్నారని అని సోషల్ మీడియా జనం ఆడిపోసుకున్నారు.

అలాగే ఈ నోటీసులపై స్పందించిన చిత్ర నిర్మాత ఇళయరాజాకి కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. మేము ఆ సినిమా మ్యూజిక్ కంపెనీ నుండి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే మా సినిమాలో వాడుకున్నాం. ఈ పాటకు ఓనర్లు అయిన శ్రీదేవి సౌండ్స్, పిరమిడ్ సంస్థల నుండి మేము హక్కులు పొందాము.. అని క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత.

అయినా సరే తన వద్ద నుంచి మేధోపరమైన హక్కుల విషయంలో రైట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ లీగల్ సమస్య తేలకుండా ఉంటే టెక్నికల్ గా ఈ సినిమా బిజినెస్ విషయాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఓటిటి సంస్దల నుంచి అభ్యంతరాలు వస్తాయి. శాటిలైట్ బిజినెస్, రీమేక్ రైట్స్ అన్ని వరస పెట్టి సమస్యలు గా మారతాయి.

ఇవన్నీ ఆలోచించి కోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవటం కన్నా పర్శనల్ గా ఇళయరాజాని కలిసి సెటిల్ చేసుకోవటం మంచిదనే నిర్ణయానికి ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’నిర్మాతలు వచ్చారు. ఇళయరాజా 2 కోట్లు నష్టపరిహారంగా కోరారు. అయితే నెగోషియేషన్స్ తర్వాత 60 లక్షలకు దాన్ని ఫైనల్ చేసుకుని ఇళయరాజాకు ఆ ఎమౌంట్ పే చేసి సెటిల్ చేసుకున్నారని NOC తీసుకున్నారని తమిళ సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై సమాచారం లేదు.

ఇక తన పాటలను అనుమతిలేకుండా స్టేజ్‌ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. మరో ప్రక్క ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన 'కూలి' సినిమా టీజర్ లో తన పాటను వాడినందుకు చిత్ర యూనిట్ కూడా నోటీసులు పంపారు.


Tags:    

Similar News