'నునాక్కుళి’ OTT మూవీ రివ్యూ

దృశ్యం, నెరు, 12th మ్యాన్ వంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇచ్చిన దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి కామెడీ సినిమా ఊహిస్తామా. కానీ తియ్యగలను, తీసి మెప్పించగలను అంటున్నారు ఆయన.

Update: 2024-09-17 12:40 GMT

దృశ్యం, నెరు, 12th మ్యాన్ వంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇచ్చిన దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి కామెడీ సినిమా ఊహిస్తామా. కానీ తియ్యగలను, తీసి మెప్పించగలను అంటున్నారు ఆయన. తాజాగా 'నునాక్కుళి' (Nuna kkuzhi) అనే చిత్రంతో ఆ విషయం ప్రూవ్ చేసారు. రెగ్యులర్ కామెడీ లా కాకుండా కొన్ని పాత్రలు, చిత్రమైన సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి ఆడుకున్నారు. ఈ సినిమాలో కామెడీ ఎక్కువ శాతం పాత్రలు, వాటి బిహేవియర్స్ చుట్టూనే తిరుగుతుంది. చాలా టెన్స్ సిట్యువేషన్ లో అసలు ఏం జరుగుతుందో తెరపై అని ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఓ జోక్ పేలుస్తాడీ డైరక్టర్. మిస్ అండర్ స్టాండింగ్ సిట్యుయేషన్స్, ప్రాణాపాయంలో పడే పాత్రలే అన్నీ. టెన్షన్ పడుతూనే నవ్వుకునే చిత్రం ఇది. అసలు ఈ చిత్రం కథ ఏంటి

స్టోరీ లైన్

ఎబీ జకరియా(బసిల్ జోసెఫ్), రష్మిత(గ్రేస్ ఆంటోని) కొత్తగా పెళ్లైన జంట. జకరియా కోటీశ్వరుడు కావటంతో ఆర్దికంగా ఇబ్బంది లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తూంటారు‌. అయితే అనుకోకుండా వారి జీవితంలో లో ఓ ప్రాబ్లమ్ వస్తుంది. అత్యుత్సాహంతో భార్య వద్దని వారిస్తున్నా వినకుండా తమ పర్సనల్ పడకగది వ్యవహారాన్ని రికార్డ్ చేసి, వీడియోగా తన ల్యాప్‌టాప్‌లో పెట్టుకుంటాడు ఎబి. రోజూ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ చూసుకుని మురిసిపోతూంటాడు. అయితే అతని జీవితంలో అదే పెద్ద సమస్యగా మారుతుందని ఊహించదు. ఆ సమస్య ని ఇన్‌కమ్ టాక్స్ రైడ్ తీసుకు వస్తుంది.

రైడ్ కు వచ్చిన వాళ్లు రొటీన్ గానే కంపెనిలో ఎక్కౌంట్స్ మొత్తం చెక్ చేస్తూ , పనిలో పనిగా వద్దని మొత్తుకుంటున్నా ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ (సిద్దిఖి) ఎబీ టేబుల్ పై ఉన్న అతని పర్సనల్ ల్యాప్ టాప్‌ని పట్టుకెళ్లిపోతాడు. ఈ విషయం ఎబీ భార్యకు తెలిసి కంగారుపడి, ఆపై మండిపడుతుంది. వేరే వాళ్లు తన పర్సనల్ లైఫ్ వీడియో చూసేస్తారని భయపడుతుంది. దాంతో తన భర్తపై విపరీతమైన ప్రెజర్ పెడుతుంది. ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ తేకపోతే తనతో కటీఫ్ అంటుంది. దాంతో జకాయరా భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని రాత్రికి రాత్రే తేవాలని బయలుదేరతాడు. అక్కడ నుంచి ఎబీ తిప్పలు మొదలవుతాయి. ఆ క్రమంలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ నెంబర్, అడ్రస్ తీసుకుని ఆ ప్లాట్ కు దొంగతనంగా వెళ్ళి ఎత్తుకొద్దామని గోడ దూకుతాడు.

ఎబి అలికిడికి ఆ అపార్టమెంట్‌లలో వాళ్లు దొంగ అనుకుని వెతకడం మొదలెడతారు. ఆ కంగారులో పారిపోయి వచ్చి రష్మిత రంజిత్ (గ్రేస్ ఆంటోనీ) అనే ఓ గృహిణి ప్లాట్‌లోకి దూరుతాడు. అయితే అప్పుడే ఆమె ఓ డిప్రెషన్‌లో ఉండి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగటానికి రెడీ అయ్యి ప్రక్కకు వెళ్తుంది. అయితే ఆ గదిలోకి వచ్చిన ఎబీ ఆ విషయం తెలియకుండా ఓ పెగ్గు వేస్తే ధైర్యం వస్తుందని గ్లాస్ ఎత్తి తాగేస్తాడు. అక్కడ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఎబీకు ప్రాణాపాయం వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు రష్మిత రంజిత్ కు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈ కథలో మరో కీలకమైన పాత్ర డెంటిస్ట్ జయదేవన్ ఎవరు? ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ ని తిరిగి తెచ్చుకోగలిగాడా వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది మిగతా కథ.

విశ్లేషణ

ఇదేమీ హీరో కథ కాదు. హీరోయిజం ఉన్న కథనం అసలే కాదు. క్రైమ్ సన్నివేశంలోకి కొన్ని పాత్రలను తోసి వాళ్ల నుంచి జనరేట్ అయ్యే భయాలు, వాళ్లు ఆడే అబద్దాలు, సమాజ పరిస్థితులు వంటివాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అల్లిన డార్క్ కామెడీ ఇది. అన్ని పాత్రలను బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సీరియస్ సబ్జెక్ట్ సెన్సార్ హ్యూమర్ తో ముడిపెట్టాలనుకోవటమే కలిసి వచ్చింది. అలాగే ఈ సినిమా మొత్తం ఓ రాత్రిలో జరుగుతుంది. జీతూ జోసెఫ్ ట్విస్ట్ లు కన్నా ఫన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే కోర్ట్ సీన్స్ , అక్కడ వ్యవహారాలు, పోలీసుల ఇంట్రాగేషన్, హీరోల కథలపై జడ్జ్‌మెంట్, ఫ్యాన్స్ వంటివాటని కామెడీ చేసారు. మనకు తెలిసిన విషయాలకు కామెడీ రంగరించటంతో ఫన్ బాగానే పండింది.

ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే...ఫాస్ట్ పేసెడ్ ఎడిటింగ్ తో కొన్ని ప్యారలల్ ట్రాక్‌లు ఒక చోట నుంచి మరో చోటకు మార్చుతూ కథను నడపడం. సీనియర్స్ ,జూనియర్స్ నుంచి కూడా అదే స్థాయి ఫన్ ఫెరఫార్మెన్స్ తీసుకున్నారు. ప్రతి జోక్ నవ్వు అందరికీ రాకపోవచ్చు. కొన్ని జోక్స్ మాత్రమే బాగా నవ్విస్తాయి. కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా అక్కడక్కడా వచ్చి పోతుంటాయి. కొన్ని సంబంధం లేని ట్రాక్‌లను ఇంటర్ లింక్ చేసిన తీరు ముచ్చటేస్తుంది.

నటీనటులలో బసిల్ జోసెఫ్ అదరకొట్టాడు. రష్మిత రంజిత్ గా గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, వి.ఎస్ వినాయక్ ఎడిటింగ్ బాగుంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కాస్త లోగానే ఉన్నాయని చెప్పాలి.

చూడచ్చా

ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు . అడల్ట్ కంటెంట్ ఏం లేదు.

ఎక్కడుంది

జీ5 లో తెలుగులో ఉంది

Tags:    

Similar News