మృత్యువుని ఏమార్చటం ఎలా? ‘Final Destination: Bloodlines’ సినిమా రివ్యూ
ఒక్కసారి తప్పించుకున్నా… చావు వెనక్కి తిరగదు.;
అది చిరునవ్వుతో ఎదురుగా వచ్చి నిలబడుతుంది — ఎందుకంటే ఇది ప్రమాదం కాదు… వారసత్వం."
అవును ఈసారి మరణం ఒక యాక్సిడెంట్ లా రాలేదు… ఒక పర్సనల్ మిషన్‌తో వచ్చింది — తరతరాలను బలిగా తీసుకోవాలని.
ఇది ఇక సమూహాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఆట కాదు. ఇది ఒక కుటుంబానికి వ్యతిరేకంగా రాసిన శాపనార్థ కథ. ప్లాన్లు మనవి కావచ్చు… కానీ చివరి నిర్ణయం మాత్రం, ఎప్పటికీ... మృత్యువుదే.
తొంభైలు హారర్ సినిమాలకు స్వర్ణయుగం. ప్రతి సంవత్సరం ఓ కొత్త దెయ్యం, ఓ కొత్త కిల్లర్... స్క్రీన్ మీద రక్తపు జాడలు వేస్తూ అలజడి సృష్టించేవారు. అయితే అన్నీ దాదాపు ఒకేలా ఉండేవి. కానీ ఒక ఫ్రాంచైజ్ మాత్రం ఆ దారి పట్టలేదు .2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తనకంటూ కొత్తదారిని వేసుకుంది. అందులో విలన్ ఒక మనిషి కాదు... స్వయంగా “మరణం”! ఇంతకు మించిన కాంప్లిక్ట్స్ ఏ సినిమాలో ఉంటుంది. అందుకే ఆ ప్రాంఛైజ్ ప్రపంచ వ్యాప్తంగా హై సక్సెస్ అయ్యింది. ఆ ఫ్రాంఛైజే Final Destination.
Final Destination ఓ అలజడి లాంటి సిరీస్. ఇందులో మనం చూసేది చనిపోయే వ్యక్తులును కాదు, చనిపోవడానికి సిద్దంగా వేచి ఉన్న శ్వాసలని. అయితే ఈ సీరిస్ కొన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు, దాదాపు పద్నాలుగేళ్ల నిశ్శబ్దం తర్వాత, మళ్ళీ తెరపైకి వచ్చింది — Final Destination: Bloodlines రూపంలో. ఈ కొత్త సినిమా ఎలా ఉంది, కథేంటి,ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది?
స్టోరీ లైన్
1968లో, ఓ స్కై వ్యూ హోటల్‌లో భారీ ప్రమాదాన్ని ముందే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (గాబ్రియల్ రోజ్). ఆమెను అందరూ "ఓ దేవదూత" అనుకున్నారు. కానీ ఆమెకు ఆ తర్వాత అర్దమైంది "ఒక్కసారి తెలివితో చావు నుంచి తప్పించుకున్నా... అది నిన్ను వదిలేస్తుందనుకోకు " అని. తాను దేవదూత కాదు… చావును కొద్దికాలం మోసగించిన మనిషిని మాత్రమే అని.
కాలక్రమంలో, అక్కడ బ్రతికిన వాళ్లు ఒక్కొక్కరుగా విచిత్రమైన రీతిలో చనిపోతుంటారు. ప్రమాదాలుగా కనిపించే మరణాల్లో పైకి ఒక మామూలు లాజిక్ కనిపించినా వెనక అసలైన ఓ మృత్యువు లాజిక్ కూడా ఉంది. చావు పథకం వేసుకుంటుంది. తన పని తాను చేసుకుపోతోంది. విరమించటం లేదు. ఈ క్రమంలో తనని చంపేస్తుందని అర్దం చేసుకున్న ఐరిస్...ఆ చావుని సాధ్యమైనంతవరకూ ఏమార్చేందుకు,తనదగ్గరి దాకా రాకుండా ఉంచేందుకు ఓ రీసెర్చ్ లాంటిది చేసి కొన్ని ఉపాయాలు కనుక్కుంటుంది. వాటిన్నంటిని ఓ డైరీలో రాస్తుంది.
ఎందుకుంటే ఐరిస్ కు తెలుసు... మృత్యువు తనతోనే ఆగదు...ఇది ఒక ప్రమాదం కాదు... ఇది వారసత్వం. తన చనిపోయిన తర్వాత
తన బిడ్డలు, మనవాళ్లని తీసుకెళ్లిపోతుందని. మృత్యువు నుంచి దూరంగా పరుగు పెట్టడం కాదు. ప్లాన్ చేయాలి. ముందుగా అంచనా వేయాలి. మరణాన్ని మోసం చెయ్యాలి అనే కాన్సెప్టుతో రీసెర్చ్ చేస్తుంది.
మొదట్లో , ఆమె ప్లాన్ మొత్తం వర్కవుట్ అయ్యినట్లు కనిపించినా… చావు ఏదో విధంగా మరోసారి తలెత్తుతుంది. ఇప్పుడు అది తన కుటుంబం వైపు చాలా బలంగా చూస్తోంది. అప్పుడు ఐరిస్ ఏం చేసింది. తన పిల్లలని, మనవలను, తన రక్త సంభందం ఉన్నవాళ్ళను రక్షించుకోగలిగిందా లేదా అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
ఈ సినిమాలో అసలైన బ్యూటీ ఏమిటంటే... "Death" as a Character – స్క్రీన్‌ప్లేలో కనిపించని పాత్ర. మృత్యువు సినిమాకు నిజమైన విలన్ . స్క్రీన్‌ప్లేలో ఇది “నారేటివ్ గాడ్”గా పనిచేస్తుంది. ఇది ఎదుటివాళ్ల తప్పులకు శిక్ష విధించదు. ఇది తనకంటూ పెట్టుకున్న రూల్స్ తో ముందుకువెళ్లి ప్రాణాలు హరిస్తుంది. దాన్ని ఇంట్రస్టింగ్ గానే చెప్పటానికి ప్రయత్నించారు.
అయితే అందుకోసం క్యారక్టర్స్, క్యారక్టరైజేషన్స్ మీద కన్నా, ప్రతీ పాత్ర ఎలా కొత్తగా చచ్చిపోతుంది అనేదాని మీద దర్శకరచయితలు దృష్టిపెట్టారు. “The unknown is where the horror lies.” అంటారు కదా. అదే ఈ సినిమాని చివరిదాకా కూర్చోబెట్టినా, స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమాలోవచ్చే చాలా మరణాలను ముందే ఊహిస్తాం. ఆ ప్రెడిక్టబిలిటీ కారణంగా సినిమా పెద్దగా ఎగ్జైట్ చేయదు.
సినిమా మంచి ఉత్కంఠతో మొదలవుతుంది. మొదటి 20 నిమిషాలు – ఎట్మాస్మియర్, టోన్ ఫెరఫెక్ట్ గా క్రియేట్ చేసారు. అలాగే కథకు కావాల్సిన బ్యాక్‌స్టోరీ, క్యూరియాసిటీ — ఇవన్నీ బలంగా రాసుకున్నారు. కానీ, కథ మెకానిక్ గా మారిపోతోందని గమనించుకోలేదు. ప్రధాన పాత్రలు కేవలం చనిపోవడానికే రాసినట్టుగా కనిపిస్తారు. ఎమోషనల్ స్టేక్స్ లోపిస్తాయి. కథలో వచ్చే మలుపులు ఇంటిలిజెంట్ గా కాక, కథను ముందుకు నెడిపించే మెకానిక్స్ లా కనిపిస్తాయి.
ఇక ఈ సిరీస్ USP ఏమిటంటే — "How will Death strike next?" అన్న ప్రశ్న. ఈ సినిమాలోనూ అది ఆఫ్ కోర్స్ ఉంది. ఉత్కంఠ, హఠాత్ మరణాలు, గ్రాఫిక్ విజువల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఓ గ్రాండ్ హారర్ “విజువల్” మైండ్‌సెట్‌తోనే వినిపిస్తుంది. మరణం అనేది ఒక మానసిక ఆక్రోశంగా కనిపించాలి గానీ, అది మరీ మెకానికల్‌గా అనిపిస్తే మనం ఆ నొప్పితో ముందుకెళ్ళలేం.
ముఖ్యంగా ఇలాంటి కథల్లో ఉండాల్సిన స్పిరిచువల్ ఇంటెన్సిటీ లేదు, సింపులైజ్డ్ క్లైమాక్స్ కూడా తేలిపోయింది. ఇవన్నీ కలిసి “మరణం” అనే గొప్ప కాన్సెప్ట్‌ని తిరిగి ఒక ట్రాప్‌గా మలిచాయి. ఈ సినిమా ట్రాన్సెండెంటల్ (మానవాతీత) మిస్టరీగా ఉండాల్సిందని అర్దమవుతుంది. కానీ అప్పటికే సినిమా చూడటం పూర్తైపోతై ఇంటిదారి పడతాం.
టెక్నికల్ గా
సాంకేతికంగా ఈ చిత్రం హై స్టాండర్డ్స్ లో ఉంది. హారర్ సినిమాకు కావల్సిన రిఫ్లెక్షన్స్, ఫోర్‌షాడోయింగ్, హారర్ స్కోర్ ఉన్నాయి. అలాగే విజువల్ స్టైల్ ఉన్నా... నరేషన్ వైపు మాత్రం పూర్తి ఖాళీ.
ప్రముఖ హారర్ చిత్రాల దర్శకుడు రోబర్ట్ ఎగర్స్ ఓ ఇంటర్వూలో అన్నట్టు: “Visual horror only works when there's a soul behind the camera.” అనేది నిజం. కథాత్మ లేని హారర్ ఎప్పుడూ వర్కవుట్ కాదు.
ఫైనల్ థాట్
ఈ సినిమాలో ఫస్ట్ ఓపినింగ్ స్కై వ్యూ హోటల్ సీన్ అద్బుతంగా డిజైన్ చేసారు. అదే సినిమాని చివరిదాకా లీడ్ చేస్తుంది. థియేటర్ నుంచి బయిటకు వచ్చినా మన మనస్సు ని వెంబడిస్తుంది. అలాగే కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎక్సపీరియన్స్ ని వదులుకోవటం ఎందుకు, ఓ సారి చూసేయండి, అయితే ఫ్యామిలీలతో వెళ్లే ముందు ఆలోచించండి..వాళ్లు రక్తపాతాలు తట్టుకునే శక్తి ఉన్న వాళ్లేనా అని?