ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ
ఆ ఆశల్ని తీర్చే సినిమా నేనా సారంగపాణి జాతకం? ఈ సినిమా జాతకం ఎలా ఉందో చూద్దాం.;
ఒక పక్క నటనలో వేరియేషన్లతో మెప్పిస్తున్న ప్రియదర్శి... మరోపక్క, తెలుగు సినిమాకు సున్నితమైన కథనాలతో ఓ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి. ఈ ఇద్దరూ కలిసి తీసిన చిత్రం అంటే, అంచనాలు అదిరిపోయే స్దాయిలో కాకపోయినా... అందమైన చిన్న ఆశలు మాత్రం కలుగుతాయి. ఆ ఆశల్ని తీర్చే సినిమా నేనా సారంగపాణి జాతకం? ఈ సినిమా జాతకం ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ లైన్
సారంగపాణి (ప్రియదర్శి) కి జీవితం అంటే జాతకాలతో నడిచే తంత్రం. ఎప్పుడూ ఎక్కడో చోట చేయి చాచి తన జాతకం చూపించుకుంటూంటాడు. అతని జాతకంలో ఎలా రాసుందేమో కానీ ...అతను ఓ కార్ షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూంటాడు. సర్లే ఖాళీగా ఉండటం ఎందుకని తన మేనేజర్ మైథిలి (రూప కొడువాయూర్) తో ప్రేమలో పడతాడు. మొదట్లో ఆమెకు చెప్పే ధైర్యం లేకపోయినా రాను పోను, ఆమె అర్దం చేసుకుని ఐ లవ్యూ చెప్పేస్తుంది. దాంతో పెళ్లి చేసుకుని ఒకటైపోవాలనుకుంటారీ జంట.
ఆ క్రమంలో సారంగపాణికి ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక రోజు జిగ్నేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) అనే జ్యోతిష్కుడు అతని చేతి గీతలు చూసి ఓ బాంబే పేలుస్తాడు – "నీ చేతి మీదుగా ఓ హత్య జరుగుతుంది!" వింటాడో లేదో... సారంగపాణి భయంతో వణకిపోతాడు.
"నేను హత్య చేయను కానీ, ఈ జాతకం సత్యమైతే?" అనే సందేహం కలుగుతుంది. అదీ పెళ్లైన తర్వాత తాను హంతకుడు అవ్వటం కన్నా ముందే అదేదో ఆ పనేదో పూర్తి చేసేస్తే పోలా అనుకుంటాడు. అందుకు ఓ దుర్మార్గుడైన వ్యక్తిని ఎంచుకోవాలని అనుకుంటారు. తన చిన్ననాటి మిత్రుడు, తనతోపాటే పనిచేసే చందు (వెన్నెల కిశోర్)తో కలిసి మర్డర్‌కి ఓ ప్లాన్ చేస్తారు.
ఒక ముసలావిడను టార్గెట్ చేసినా, షోరూం హెడ్‌ని ప్లాన్ చేసినా... ఏది చేసినా సారంగపాణికి హత్య చేయడం కన్నా, హత్య ప్రయత్నాలే మిగిలిపోతాయి. చివరకు వీళ్లు ఆలోచనలు అహోబిల రావు (తనికెళ్ళ భరణి) దగ్గర ఆగుతాడు. ఆయన్ని హత్య చేయాలనుకుంటారు. ఇంతకీ అహోబిల రావు ఎవరు? అతన్ని హత్య చేశారా లేదా? ఈ గందరగోళంలో... ప్రేమను నిలుపుకుంటాడా? జిగ్నేశ్వర్ నిజమేనా? లేక ఇది అంతా ఓ అనుకోని వ్యంగ్య ప్రయాణమా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నవ్వుల మీదే సినిమా డిపాజిట్:
రీసెంట్ గా కామెడీ పేరుతో అసభ్యతలు ఎక్కువైన టైంలో, ఈ సినిమా మాత్రం శుభ్రమైన హాస్యానికి ముద్రగా నిలుస్తుందనే చెప్పాలి.
కథే కామెడీని మోస్తుంది. పాత్రలు వింతగా ఉన్నా, సన్నివేశాలు కాస్త ఓవర్ ద బోర్డ్ గా అనిపించినా – అవన్నీ కథలో భాగమేనని అనిపిస్తుంది.
ఇంద్రగంటి మార్క్ స్క్రీన్‌ప్లే:
హాస్యానికి లాజిక్ దొరకటం కష్టమే. కానీ ఇంద్రగంటి మోహనకృష్ణ దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కథ పాతదైనా, కథనం ఫ్రెష్‌గా ఉంటే బాగుంది అనిపిస్తుంది. తొలి అరగటం దాకా కథ, పాత్రలు సెటప్ కే సరిపోయింది. ఆ తర్వాతే సినిమా అసలైన గేర్ వేస్తుంది. బామ్మ ఎపిసోడ్, హత్య ప్లానింగ్‌ల్లో పడ్డ గందరగోళం – థియేటర్‌కి అసలైన ఫుల్ ఫన్ కావాలి. కానీ ఓ ఏజ్ గ్రూప్ కే కనెక్ట్ అయ్యింది. యూత్ అప్పీల్ మిస్సైంది.
కొత్తగా అనిపించాల్సిన కథను పాత ట్రీట్‌మెంట్‌తో చూపించి, సినిమా మొత్తాన్ని పాతకాలపు స్కెచ్‌లా మార్చేశారని యూత్ కంప్లైంట్ చేసేలా ఉంది. ఇంద్రగంటి USP – పాత్రల పిచ్చి మనస్తత్వాల్లో హాస్యం తేవడమే. ఈసారి అదే జరిగింది. కథ పాతదే – జాతక భయంతో బ్రతికే వ్యక్తి. సీన్స్ తీరు సిల్లీగా అనిపించినా, అవి నిజజీవితాన్ని ఎత్తి చూపినట్లే అనిపిస్తాయి. అయితే ఎక్కువ రీపీట్ అయ్యాయి.
అతిగా నమ్మే వ్యక్తుల జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో చూపించే ఈ కథ..ఐడియా లెవిల్లో మాత్రం చాలా బాగుంది. ట్రీట్మెంట్ కాస్త కొత్తగా ఉంటే ఇంకా అదిరిపోయేది. అయినా ఇప్పుడు కోసం కొన్ని ఆరోగ్యకరమైన నవ్వులు ఉన్నాయి.
అయితే సెకండ్ హఫ్ లో కూడా పూర్తి కామెడీనే నమ్ముకోవటంతో, ఎమోషనల్ డెప్త్ కోసం ఎదురు చూస్తే, కొద్దిగా లైట్‌గా అనిపించవచ్చు. కొన్ని సంభాషణలు సోషల్ మీడియా టోన్‌తో ఉండడంతో, అన్ని వయస్సుల వారికి ఎక్కకపోవచ్చు.
టెక్నికల్ గా...
వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సన్నివేశాల్లో కామెడీని ఇంకాస్త ఎలివేట్ చేస్తుంది. పీ.జీ. విందా కెమెరా వర్క్ – క్లారిటీతో కూడిన లైటింగ్‌తో కామెడీ విజువల్స్‌ని బాగా సపోర్ట్ చేసింది. ఎడిటింగ్ పకడ్బందీగా ఉంటుంది. ఫన్నీ మోమెంట్స్ ఓవర్ స్టే కాకుండా కట్ చేస్తూ, రీథమ్ మిస్ కాకుండా చూశారు.
ఫైనల్ థాట్
ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని చెప్పలేం, ఓ వర్గానికి ముఖ్యంగా యూత్ కు ఇది ఛాదస్తంతో కూడిన పాత కాలపు కామెడీ అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఫ్యామిలీలకు మాత్రం మొహమాటం లేకుండా వెళ్లదగ్గ సినిమా.