'గోరి తేరా గావ్ బడా ప్యారా'ని ఏసుదాసు కంఠాన పలికించిందెవరో గుర్తుందా?
కనిపించని కనులతో.. కమనీయమైన సంగీతం వినిపించిన బాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్, గేయరచయిత రవీంద్ర జైన్ జయంతి. కొన్ని జ్ఞాపకాలు
By : Saleem Basha
Update: 2024-02-28 11:20 GMT
" గోరి తేరా గావ్ బడా ప్యారా" అని ఏసుదాసు కంఠం లోంచి జాలువారిన తేనెలూరే ఈ పాట గురించి తెలియని వారు ఉండరు.. వినని వారు కూడా ఉండరు. అంత ప్రాచుర్యం పొందిన పాట ఇది. ఈ పాటని స్వరపరిచిన సంగీత దర్శకుడు మాత్రం చాలా మందికి తెలియదు. కనిపించకుండా అద్భుతమైన పాటలను కళ్ళ ముందు సాక్షాత్కరించేలా చేయడం ఈ సంగీత దర్శకుడికి వెన్నతో పెట్టిన విద్య. కనిపించని కన్నులతో, కమనీయమైన సంగీతం అందించిన మెలోడీ మాస్టరే రవీంద్ర జైన్ .
"జబ్ దీప్ జలే అనా" అని ఏసుదాసు పాడుతుంటే అదో లోకంలో ఉన్నట్టుంటుంది.
అత్యంత ప్రఖ్యాతి చెందిన "చిత్ చోర్" సినిమాలోని పాటలు రవీంద్ర జైన్ సృష్టి. పాటలు స్వరపరచడమే కాకుండా, స్వయంగా వాటిని రాయడం కూడా రవీంద్ర జైన్ ని ఒక ప్రత్యేకమైన సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచం భావిస్తుంది.
వాయిద్య పరికరాలతోనే కాకుండా.. పదాలతో కూడా ఆడుకున్న అరుదైన సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ దర్శకుడు. దాదాపు తాను సంగీతం సమకూర్చిన అన్ని పాటలకు సంగీతంతో పాటు, సాహిత్యం కూడా సమకూర్చిన ప్రజ్ఞాశాలి. సంగీతంలో ఎన్ని ప్రయోగాలు చేశాడో, పాటల సాహిత్యంలో కూడా అంతే ఎత్తుకు ఎదిగాడు.
"అఖియోంకే ఝరోకోన్ సే, మైనే దేఖాజో సావరే"(సినిమా పేరు కూడా అదే) పాట సాహిత్యం వింటే ఎవరో గొప్ప పాటల రచయిత రాశాడు అనుకుంటారు. కానీ అది కూడా రవీంద్ర జైన్ మాయాజాలమే. హేమలత పడిన ఈ పాట ఆ కాలం యువతను సంగీత సాగరంలో ఓలల్లాడించింది ఈ పాట బినాక గీత్ మాల లో 1978 సంవత్సరానికి మొదటి స్థానంలో నిలిచింది. క్యాన్సర్ తో బాధపడుతున్న అమ్మాయి కి సరైన పాట రాశాడు రవీంద్ర జైన్ అని సంగీత ప్రియులతో పాటు, సంగీత దర్శకులు కూడా ఏమాత్రం బేషజం లేకుండా ప్రశంసించిన అరుదైన పాట ఇది. కళ్ళు మూసుకుని ఈ పాట వినాలి. ఆ పాటలోని పదాలకు ఆర్ద్రత ను అందంగా అద్దినట్లు ఉంటుంది. ఈ పాట కూడా బ్లాక్ బస్టరే!రాజశ్రీ పిక్చర్ సంస్థ తీసిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలకు రవీంద్ర జైనే సంగీత దర్శకుడు. 974 లో వచ్చిన సౌధాగర్ సినిమా నుండి ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ పిక్చర్స్ తో మొదలుపెట్టిన ప్రయాణంలో దాదాపు 20 ఆల్బమ్స్ చేశాడు రవీంద్రజైన్. దాదాపు అన్ని సూపర్ హిట్టే!
పదాల తో నాట్యం చేయించిన సంగీతం
పుట్టగానే ప్రపంచాన్ని చూడలేకపోయినా, ప్రపంచానికి అద్భుతమైన సంగీతాన్ని చూపించాడు. మనసు కాన్వాస్ పై గీసిన అందమైన చిత్రాలు రవీంద్ర జైన్ పాటలు. కేవలం పాటల వల్లే ఆ సినిమాలు బాగా ఆడాయి అన్నది అందరూ ఒప్పుకునే విషయమే. పాటలోని ప్రతి పదాన్ని తన సంగీతంతో నాట్యం చేయించిన అసమాన ప్రతిభావంతుడు రవీంద్ర జైన్.
ప్రాణం కన్నా పాటనే ఎక్కువ
1974లో వచ్చిన సౌదాగర్ సినిమా లోని " సజ్ నా హే ముజే సజ నా కే లియే" అనే పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు, తండ్రి చనిపోయాడు అన్న వార్త వచ్చినా రికార్డింగ్ పూర్తయ్యాకే ఇంటికి వెళ్లిన వాడు. 150 సినిమాలకు రసగుళిక లాంటి పాటలతో పాటు సాహిత్యం అందించిన జైన్, సంగీతమే ప్రాణంగా బతికాడు.
"రెండు కళ్ళు లేకపోవడం, నీ సంగీతాన్ని ఏమైనా ప్రభావితం చేసిందా" అన్న ప్రశ్నకు " శరీరంలో రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి, కానీ మనసుకు వెయ్యి కళ్ళు ఉంటాయి." అని చెప్పాడు.
జైన్ మతస్తుల కుటుంబంలో పుట్టిన రవీంద్ర లోని ప్రతిభను గుర్తించిన తండ్రి సంగీతంలో ఓనమాలు దిద్దించాడు. పాటలు రాయడం సంగీతం చేయడం మాత్రమే కాకుండా పాటలు పాడిన ఘనత కూడా రవీంద్ర జైన్ సొంతం. చిన్నప్పుడే ఆలయాల దగ్గర భజనలు పాడేవాడు. సినిమాలలో కూడా కొన్ని పాటలు పాడాడు.
గాయకుడు ఏసుదాస్ ను హిందీ సినీ రంగానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాగే హేమలత అనే గాయని ని కూడా పరిచయం చేశాడు. సినిమాలతో పాటు టీవీ సీరియల్ "రామాయణ్"కి కూడా నేపథ్య సంగీతం అందించాడు.
సంగీతం తో పాటు సాహిత్యం మీద కూడా మంచి పట్టు ఉన్న రవీంద్ర జైన్ ముస్లింల మత గ్రంథం
"ఖురానే షరీఫ్" ను సులభమైన సాహిత్య పద్దతిలో ఉర్దూ భాషలోకి అనువదించాడు.
40 సంవత్సరాల సంగీత సాహిత్య ప్రస్థానంలో అజరామరమై సాహిత్య పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఎన్నో రసగుళికలైన పాటల ను అందించిన రవీంద్ర జైన్ జయంతి(28.2.24) ఈరోజు.