ముఖాముఖం: ఆదర్శాల డొల్లతనం, అందమైన అవకాశవాదానికి దృశ్యరూపం
నన్ను వెంటాడిన సినిమాలు-5 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);
మన సమాజంలో , కుటుంబంలో ,పార్టీల్లోనో, లేదా పని చేస్తున్న కార్యాలయాల్లో కానీ ఓ వ్యక్తికి ఎంతగానో ఆరాధిస్తుంటాం. వారిని స్ఫూర్తిగా తీసుకొంటుంటాం. వారి పనిని కీర్తిస్తుంటాం.వారి అడుగుజాడల్లో నడవాలని తీర్మానించుకొంటాం. ప్రతి సందర్భంలోను వారిని ఉటంకిస్తుంటాం. ఒక వేళ వారు మరణిస్తే గగ్గోలు పెడతాం, గుండెలు బాదుకొంటాం, పిల్లలకు వారి పెట్టుకొంటాం, వారి జన్మదిన, వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకొంటాం. వారికి ఊరురున విగ్రహాలు పెడతాం. ఎన్నో కార్యక్రమాలు జరుపుకొంటాం. వేడుకలు క్రమం తప్పకుండ జరిపిస్తాం. వీధులకు, విమానాశ్రమలకు, భవనాలకు, పథకాలకు వారి పేరు పెట్టుకొంటాము. పండుగ చేసుకొంటాం. భక్తి శ్రద్ధలతో ప్రస్తుతిస్తుంటాం.
ఒక వేళ వారు ఎదో కారణాన చావకుండా బతికున్నారనుకోండి. తిరిగొచ్చారనుకోండి అప్పుడు జరిగేదే ఆ అభిమానానికి అసలైన విషమ పరీక్ష మొదలు.ఓ తెలుగు సినిమా చూసి, తోటి మలయాళ మిత్రుడితో ‘సినిమా చాలా కర్కశంగా ఉంది ఎందుకో మింగుడుపడలేదు’ అంటూ చెప్పుకొస్తే, వాడు అది ఓ మలయాళ చిత్రస్ఫూర్తితో తీసినట్టున్నారు అంటూ ఆదూర్ గోపాలకృష్ణన్ (Adoor Gopalakrishnan)
‘ముఖాముఖం’ (Mukhamukham:1984) గూర్చి చెప్పాడు. తరువాతి కొద్దీ కాలానికి చూసాను.
ఇది ఒక లోతైన రాజకీయ చిత్రంగా నిలుస్తుంది, ఇది ఒక వ్యక్తి జీవితం ద్వారా ఒక ఉద్యమం, ఒక తరం, ఒక సమాజం ఎలా మారిపోతుందో తేటతెల్లం చేస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్ర శ్రీధరన్, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, తన గ్రామంలో విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించి, ఓ ఫాక్టరీ యజమాని హత్య తదనంతర విషయాల మూలాన,సంబంధం లేకున్నా, తలదాచుకోవలసి వస్తుంది. ఈ క్రమంలో తరువాత అనూహ్యంగా అదృశ్యం అవుతాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆయన ఒక ఆరాధ్య పురాణపురుషుడిగా, విప్లవ చైతన్యానికి ప్రతీకగా మారిపోతాడు. ప్రజలు ఆయనను నిజమైన మార్పును తీసుకువచ్చిన వ్యక్తిగా, ఒక యోధుడిగా గుర్తుంచుకుంటారు.
అయితే, అతను తిరిగి వస్తాడని ప్రజల ఊహించిందే కాదు. అతని చావు అనంతరం చాల మంది నాయకులూ అయన పేరు చెప్పుకొని పార్టీలో పదవులు దక్కించుకొనివుంటారు. మరికొందరు వారి పేరిటన యువ సంఘాలు స్థాపించి దండుకొంటుంటారు. విగ్రహాలు వెలిసుంటాయి. జయంతి, వర్ధంతులు జరుపుకొంటుంటారు. అలంటి సమయంలో తిరిగొచ్చిన ఇతను ఇంట్లోని వారికీ, పార్టీలోనూ, అందరికి కంట్లో నలుసులా తోచుతుంటాడు. అందరు ఇతని పేరున సంపాదించుకున్న అంతస్తులను, పదవులను కొంచం ఇబ్బంది పెడుతుంటాయి. రాను రాను ఇది కొంచం చర్చకు వస్తుంది. కొందరు బాహాటంగా ప్రస్తుతిస్తుంటారు.
ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా వెలుగొందిన శ్రీధరన్ ఇప్పుడు ఈ అవమానాలు తట్టుకోలేక తాగుడుకు అలవాటు పడతాడు. విరక్తి ఆవహిస్తుంది. తానే సృష్టించిన భావజాలానికి పూర్తిగా దూరంగా జరిగిపోయిన తన వాళ్ళందరిని చూసి సిగ్గుపడుతుంటాడు. మథనపడిపోతుంటారు. తనను అభిమానించిన వీరందరూ ఇలా మారిపోతారని ఊహించక దిగులుచెందుతుంటాడు. ఒకప్పుడు తాను ప్రజలు కలలు కన్న నాయకుడు, వాళ్ల ఊహల కోసం నిర్మించుకున్న ప్రతిమ కూలిపోవడం జీర్ణించుకోలేకపోతాడు. అతని పునరాగమనంతో ఊరు గందరగోళానికి గురవుతుంది. నిజంగా ఇదే మన నేతనా? లేక మనం ఒక ఊహామాత్రపు వ్యక్తిని ఆరాధించామా? అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
ఈ చిత్రం సాధారణ రాజకీయ నాటకాలను తలపించదు. దీని కథనంలో హీరో విజయవంతంగా తిరిగి రావడం లేదు, ఉద్యమం పునరుజ్జీవనం పొందడం లేదు. స్వార్థం స్వైర్యపు పార్శ్యాన్ని నిలువెత్తు చేసి చూపిస్తుంది. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది; శ్రీధరన్ తొలి పోరాటకాలంలో ప్రజలలో ఆశలు రేకెత్తించిన సమయం మరియు తర్వాత వచ్చిన విరక్తత, నిస్సహాయత, మారిపోయిన సమాజం. ఈ మార్పు కేవలం ఒక వ్యక్తిలో కాదు, ఒక ఉద్యమం, ఒక తరం ఎలా మారిపోయిందో కూడా సూచిస్తుంది. కేరళ కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభంలో ఆదర్శవంతమైనదిగా, మార్పుకు నాంది పలికేదిగా కనిపించినా, నాటకీయంగా దాని మార్గం తప్పినట్లే శ్రీధరన్ జీవిత ప్రయాణం కూడా ఒక ఆత్మన్యూనతకు, ఒక నిరాశకు దారి తీస్తుంది.
సమాజం గతాన్ని ఎలా మలచుకుంటుందో, ఒక వ్యక్తిని ఎలా దేవత చేసుకుంటుందో, అదే వ్యక్తి ఆ రూపానికి తుడిపేసుకొని మారిపోయినప్పుడు ఎలా విస్మరిస్తుందో ఈ సినిమా చాలా బలంగా చూపిస్తుంది. ప్రజలు శ్రీధరన్‌ను ఒక వ్యక్తిగా కాక, ఒక సిద్ధాంతంగా, ఒక ప్రతీకగా చూసినప్పుడు, అతని మానవీయ దోషాలను అంగీకరించలేకపోతారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత, అదే ప్రజలు తనను చూసేందుకు సిద్ధంగా ఉండరు. నాయకుడిని ఒక వ్యక్తిగా కాదు, ఒక ఐకానుగా మాత్రమే చూడాలనే సమాజపు నైజాన్ని ఈ సినిమా చర్చిస్తుంది.
ఆదూర్ గోపాలకృష్ణన్ సున్నితమైన కానీ తీవ్రమైన దృశ్యకల్పనను ఉపయోగించాడు. సినిమాటోగ్రఫీలో పరస్పర విరుద్ధమైన రెండు ప్రపంచాలను చూపించబడ్డాయి;శ్రీధరన్ యువకుడిగా గ్రామాన్ని మంటల్లో ముంచెత్తిన విప్లవ కాలం, అతను తిరిగి వచ్చినప్పుడు చూడబోయే నిశ్శబ్ద, చీకటి, విరక్తతతో నిండిన ప్రపంచం. మొదటి భాగంలో సమిష్టి భావజాలం, సమూహ చైతన్యం కనిపిస్తే, రెండో భాగంలో ఒంటరితనం, విరక్తత, అభ్యసించబడిన నిర్లిప్తత కనిపిస్తాయి. పెద్ద డైలాగులు లేకుండా, సినిమాటోగ్రఫీతోనే కథను ఆవిష్కరించటం ముఖాముఖంను మరింత శక్తివంతమైన అనుభూతిగా మార్చుతుంది.
చివర్లో వచ్చే ఘోరమైన పరిణామం రాజకీయ వ్యంగ్యానికి పరాకాష్ట. ప్రజలు శ్రీధరన్‌ను గౌరవించి, ఆదర్శంగా భావించిన వారే తిరిగి వచ్చినప్పుడు, అతను వారి ఊహల కోసం అనుకూలంగా మారకపోతే, అతన్ని పూర్తిగా తొలగించడమే సమాజానికి పరిష్కారం. అతని హత్య ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, ఒక విప్లవం, ఒక ఆశయం, ఒక తరం మార్పు కోసం చేసిన పోరాటం కూడా చనిపోయినట్లే. ఇది కేవలం కేరళ కమ్యూనిస్టు ఉద్యమంపై విమర్శ కాదు, ప్రపంచంలోని అన్ని విప్లవాలకూ, ప్రజల విశ్వాసాలకు సంబంధించిన వాస్తవిక దృశ్యం.
చివరగా, ముఖాముఖం ఒక రాజకీయ చిత్రం మాత్రమే కాదు, ఒక కాలపు ఆత్మను కళ్లకు కట్టిన దృశ్య కావ్యం. దుర్మార్గమైన నైజానికి, దుర్లభ లక్షణానికి ఇదో నిదర్శనం.సమాజం ఎంత తొందరగా ఒక వ్యక్తిని హీరోగా నిలబెట్టి, అదే వేగంతో అతన్ని విస్మరిస్తుందో ఇందులో చూస్తాం. ఆదూర్ గోపాలకృష్ణన్ ప్రశ్నలు వేస్తాడు, కానీ సమాధానాలు ఇవ్వడు. ఒక ఉద్యమం ఎంత కాలం కొనసాగాలి? ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి అవకాశం పొందాలా, లేక ప్రజల ఊహల్లో మిగిలిపోవడమే ఆయనకు మంచి తీరా? ముఖాముఖం ఈ ప్రశ్నల కోసం ఒక వేదిక, సమాధానాల కోసం ఒక అర్థరహిత అన్వేషణ.