ఒక అవసరమైన పాఠం: 'అనగనగా' సినిమా రివ్యూ
ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
సామాజిక నేపధ్యం ఉన్న సినిమాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వచ్చే సినిమాలు మనకు బాగా తక్కువే. వచ్చినా వాటిని మనం చూసేది తక్కువే. అవి మనవి కాదు అనే చిన్న చూపు. కానీ ఇలాంటి సినిమాల అవసరం ఉంది. ఒక సమాజం మెరుగుపడాలంటే, ముందుగా దాని లోపాలను అర్థం చేసుకుని, వాటిపై చర్చలు జరగాలి. ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ వంటి నేరుగా మన జీవితాలపై ప్రబావం చూపే రంగంపై మాట్లాడడం ఎంతో ముఖ్యం. అలాంటి ఓ ప్రయత్నం చేసిన ఈ సినిమా ఎలా ఉందిక, కథేంటి, చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
వ్యాస్ (సుమంత్) – మార్కుల కన్నా మార్పు ముఖ్యమని నమ్మే టీచర్. చదువుని కథలుగా, పాఠాల్ని పాఠాలుగా కాదు, అనుభవాలుగా చెప్పాలనుకునే ఆలోచనాత్మక ఉపాధ్యాయుడు. కానీ... అలాంటి భావాలు కార్పొరేట్ స్కూళ్లకు నచ్చవు. తమ పద్ధతులు విభిన్నంగా ఉన్నాయన్న కారణంగా, ఆయనను ప్రక్కన పెట్టేస్తూంటారు.
ఇక అతని కొడుకు రామ్ (విహర్ష్) కూడా అదే స్కూల్లో చదువుతూ – చదువు అంటే భయపడే స్థితిలో ఉంటాడు. తండ్రి చెప్పే కథలు మాత్రమే అతనికి బాగుంటాయి. కానీ తల్లి భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి), అదే స్కూల్ ప్రిన్సిపాల్. చదువులో రామ్ ఫెయిల్ అవుతుండటంతో, భార్యగా, తల్లిగా, ప్రిన్సిపాల్‌గా – ఆమె కోపం అంతా వ్యాస్ మీదే. ఒక టైమ్ లో పిల్లల్ని ఫెయిల్యూర్‌గా స్టేజ్ మీద నిలబెట్టి అవమానపరుస్తుంది కూడా.
అప్పుడు వ్యాస్ ఏం చేశాడు? చదువులో వెనుకబడిన పిల్లల్ని ఎలా ప్రేరేపించాడు? స్కూల్ యాజమాన్యానికి తన పద్ధతులు ఎలా నచ్చజెప్పాడు? రామ్ జీవితాన్ని ఎలా మార్చాడు? అన్నదే 'అనగనగా' లోని అసలైన ప్రయాణం.
విశ్లేషణ
I do not speak through my characters; it's not a ventriloquist act.
— Aaron Sorkin (The Social Network, The West Wing)
ఈ విషయాన్ని ఎందుకనో మన దర్శకులు, రచయితలు పట్టించుకోరు. తాము చెప్పాలనుకున్న విషయాన్ని తమ పాత్రలు ద్వారా చెప్పేస్తారు. అంతేతప్పించి, వాటిని కథలో భాగంగా, సన్నివేశాల్లో అంతర్లీనంగా చెప్పటానికి ప్రయత్నించరు. ఈ సినిమాకు అదే జరిగింది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని పాత్రల ద్వారా చెప్పించేస్తూంటాడు. అదే కాస్త ఇబ్బంది. మిగతాదంతా బాగుంది.
ఇదేమీ కొత్త కాన్సెప్టు కాదు..కొత్త కథా కాదు. కాకపోతే మరోసారి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ప్రెజర్ ని పరిశీలించే అవకాసం ఇచ్చే చిత్రం ఇది . తారే జమీన్ పర్, పసంగ-2, సార్, ‘త్రీ ఈడియట్స్’ , తెలుగులో వచ్చిన ’35 – చిన్న కథ కాదు’ లాంటి సినిమానే ఇది.
ఇలాంటి చోటే డైరక్టర్ కు అసలైన ఛాలెంజ్ . ఎందుకులో ఈ కథలో చెప్పాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ వారు వింటున్నదే, చూసేదే. దాంతో ఆ విషయాన్ని ఎంత ఆసక్తికరంగా చెప్పారు, ఎంత ఉత్తేజికరంగా చెప్పారు అనేదే పరిశీలించే అంశంగా మారుతుంది.
అలాంటప్పుడు డైరక్టర్ కు సపోర్ట్ ఇచ్చేవి మూడే. అద్బుతమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్, తల ప్రక్కకు తిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లే , నటీనటుల నటన. వాటిలో వంద శాతం సక్సెస్ అయ్యాడు అనలేం కానీ కొంతవరకూ రీచ్ అయ్యారు.
కార్పొరేట్ స్కూల్స్, ఒత్తిడిలో పిల్లలు, పూర్తి మార్కుల మోత – ఇవన్నీ ప్రేక్షకుడికి కొత్త కాకపోవటంతో ఫస్టాఫ్ రొటీన్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ సినిమాకి నిజమైన ధైర్యం ఇచ్చిన ఘట్టం. ఇక్కడకు వచ్చేసరకి కథ, పాత్రలు పూర్తి గా సెట్ అవుతుంది. అక్కడ కథ విద్యా వ్యవస్థపై కాదు, తండ్రి భావజాలంపై ఫోకస్ ఇక్కడ మొదలవుతుంది.
"నా తండ్రి నా కలలు గుర్తించలేకపోయాడు... కానీ నేను నా కొడుకు నిద్రపోయే కలల్లోనైనా మెరుపులై మెరవాలనుకున్నాను" – ఇది వ్యాస్ పాత్ర సబ్‌టెక్స్ట్.
ఇక్కడి నుంచి కథ ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. ప్రేక్షకులు మొదట తండ్రిని అనుమానిస్తారు... తర్వాత అర్థం చేసుకుంటారు... చివరికి ప్రేమించేస్తారు. ఇక క్లైమాక్స్ లోఎవరూ గెలవరు, ఎవరూ ఓడరు..కేవలం ప్రేక్షకులు రియలైజేషన్ కు వస్తారు. ఇది మంచి డిజైన్.
సోషల్ మెసేజే – కానీ వ్యక్తిగత అనుభవాల ఇమేజే
ఈ సినిమా ఎజ్యుకేషన్ సిస్టమ్ మీద శాపనార్థాలు వేయదు. తండ్రుల హృదయంలో ఉండే "అప్రకటిత ప్రెజర్" గురించి మాట్లాడుతుంది.
అక్కడే ఈ సినిమా భిన్నంగా నిలుస్తుంది. ఇది ఒక problem-solving movie కాదు. ఇది ఒక "problem-understanding movie."
చూడచ్చా
విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ఈ సినిమాపై చదువుకునే పిల్లలు ఉన్న తల్లి,తండ్రులు ఓ లుక్కేయచ్చు. అలాగే టీచర్ వృత్తిలో ఉన్న వాళ్లు ఈ సినిమా కొత్త కోణాన్ని పరిచయం చేసే అవకాసం ఉంది.
ఎక్కడ చూడచ్చు
ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఉంది.
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేశ్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు;
సంగీతం: చందు రవి;
సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల;
ఎడిటింగ్: వెంకటేశ్ చుండూరు;
నిర్మాత: రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి;
రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్;