'రెజీనా' ( అమెజాన్ ప్రైమ్) మినీ రివ్యూ!
ఎలాంటీ ఆర్భాటాలు లేకుండా ఓటీటీలో విడుదలైన క్రైమ్ సినిమా రెజీనా ఎలా ఉందంటే..
Update: 2024-02-24 06:37 GMT
పగ, ప్రతీకారాలతో సినిమాలు తీస్తే బాగా ఆడతాయ..దాదాపు అన్ని సినిమాలు అవే కదా అనే సమాధానం వస్తుంది. అయితే సాధారణంగా ఈ సినిమాల్లో హీరోలు మాత్రమే పగ తీర్చుకునే పోగ్రామ్ పెట్టుకుంటూంటారు. అయితే హీరోలు డేట్స్ దొరకనప్పుడు ఏం చేయాలి. అందుబాటులో ఉన్న హీరోయిన్ తో సినిమా చేయాలి. అదే కథను హీరోయిన్ ఓరియెంటెడ్ గా కూడా మార్చచ్చు.
అయితే ఈ ఆలోచన దాకా బాగానే ఉంటుంది. కానీ తెరకెక్కాక కొనేదెవరు..థియేటర్ లో చూసేదెవరు అనే ఆలోచన వస్తుంది. అప్పుడు ఓటిటిలు, యూట్యూబ్ లు కనిపిస్తాయి. అలాంటి సినిమాలు బోలెడు. తాజాగా మరో హీరోయిన్ ఓరియెండెట్ పగ,ప్రతీకారం మార్క్ సినిమా రిలీజ్ అయ్యింది. డైరక్ట్ ఓటీటీలో రిలీజైంది.
శ్రీవిష్ణుతో చేసిన రాజ రాజ చోర ఫేమ్ సునైన కీరోల్ లో దాదాపు హీరోలాగ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా. ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెలుగుకు కొత్త గానీ , ఆల్రెడీ తమిళంలో లాస్ట్ ఇయిర్ థియేటర్స్ లో విడుదలైన సినిమానే ఇది. ఎలాంటి చడీ చప్పుడు, ప్రకటనలు లేకుండా నేరుగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. సర్లే ఎలాగైతేనే మన ఇంట్లోకి ఓటీటీలోకి వచ్చేసింది కదా అని చూస్తే..ఇదో కాస్తంత ఎక్కువ ఘాటైన పగ, ప్రతీకారం మార్క్ ఫిల్మే.
స్టోరీ లైన్ ఏంటంటే... రెజీనా (సునైన) జో ( అనంత్ నాగ్) ప్రేమికులు. కొన్నాళ్లు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుంటారు. ఆ 'జో' ఒక బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు. కొత్తగా పెళ్లైంది..లైఫ్ ఆనందంగా .. హాయిగా ఉంది అనుకున్న సిట్యువేషన్ లో ఒక రోజున అతను పనిచేసే బ్యాంక్ లోకి ఓ నలుగురు క్రిమినల్స్ ప్రవేశిస్తారు. ముఖానికి మాస్క్ ను ధరించిన వాళ్లు డబ్బు .. నగలు దోచుకెళుతూ, పనిలో పనిగా అడ్డుపడ్డ 'జో' గాయపరుస్తే అతను చనిపోతాడు.
రెజీనాకు ఏం చేయాలో అర్దం కాదు. కుప్పకూలిపోతుంది. చిన్నప్పుడే తండ్రి మంచి కోసం పోరాడుతూ మర్డరయ్యాడు. ఇప్పుడు తన భర్త కూడా అదే దారిపట్టాడు. తనకే ఇలా ఎందుకు జరుగుతోందని బాధపడి... పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది. అయితే ఆమెను, ఆ రిపోర్ట్ ని పట్టించుకునే వాళ్లే ఉండరు. అయితే ఈ క్రమంలో అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద ఆమెకు అనుమానం వస్తుంది.
అది ఎంతదాకా వెళ్తుందంటే తన భర్త ఏదో యాక్సిడెంటల్ గా చనిపోలేదని, అతని మరణం వెనక మిస్టరీ ఉందని, అది బ్యాంక్ దొంగతనంలో భాగంగా జరిగింది కాదని అర్దమవుతుంది. అక్కడ నుంచి రెజీనా ఏం చేసి ఉంటుంది. మీకు అర్దమయ్యే ఉంటుంది. తన భర్త మరణానికి కారకులు ఎవరు? అనే పనిపెట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్లపై పగ తీర్చుకుంటుంది. ఇదంతా చూస్తూంటే అప్పట్లో వచ్చిన రివాల్వర్ రాణి వంటి సినిమాలు గుర్తు వస్తే అది మీ తప్పుకాదు.
డైరక్టర్ డోమిన్ డిసిల్వా ఇంత పురాతన కథతో ఏం చెయ్యదలుచకున్నాడో అర్దం కాదు. పగ తీర్చుకునే పోగ్రామ్ కు పది రీళ్లెందుకు వేస్ట్ అన్నట్లు..ఈ సినిమా అంతా ప్రెడిక్టబుల్ గానే సాగుతుంది. మనం చూస్తూ మన ఇంట్లో వాళ్లతో బెట్ లు కాసుకోవచ్చు..తర్వాత సీన్ ..ఫలానాది వస్తుంది అవునా కాదా అని..అలాంటి పజిల్స్ కు అవకాశం ఇచ్చే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా చెప్పలేకపోయారు అని అర్దమవ్వటానికి మీరు స్క్రీన్ ప్లే మాస్టర్ కానక్కర్లేదు.
ఓ నాలుగు సీన్స్ చూస్తే చాలు. దీనికి తోడు బ్లడ్ షెడ్ అనగా బోలెడు రక్తపాతం..రక్తం ఉంటే సినిమా హిట్ అవుతుందని నమ్మినట్లున్నాడు. అయితే రక్తం ఉండాలి కానీ రక్తం మరిగించే సీన్స్ లీడ్ కూడా ఉండాలి కదా డిసిల్వా సాబ్...అర్దం చేసుకోరు. దీనికి తోడు హీరోయిన్ ఓరియెంటెడ్ కదా పెద్ద విలన్ ఎందుకు అనుకున్నట్లున్నారు.
అదీ లేదు. వాడో సన్నాసి విలన్ లా ఉంటాడు. ఎక్కడా ఛాలెంజ్ లు గట్రా ఉండవు. మరి ఎందుకు చూడాలి దీన్ని అంటే మన ఓటీటీలో ఉంది కాబట్టి అనేది గొప్ప ఆన్సర్ కాదు కదా. ఉన్నంతలో సతీశ్ నాయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. పవి కె పవన్ ఫొటోగ్రఫీ .. టోబీ జాన్ ఎడిటింగ్ ఛల్తాహై అన్నట్లు ఉంటాయి.
చూడచ్చా?
ఓటీటిలో సినిమాలు అన్నీ అయిపోయినప్పుడు దీన్ని ఓ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. లేదా హీరోయిన్ సునైన కు మీరు ఫ్యాన్స్ అశోశియేషన్ అధ్యక్ష్యుడు కానీ, చుట్టం కాని అయ్యితే చూడక తప్పదు.