విజయ్ 69: పెద్దవాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా

గిరిజ పైడిమర్రి మూవీ రివ్యూ

Update: 2024-11-15 07:33 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. నేడు చాలామంది ప్రజలు అరవైకి మించి జీవించాలని కోరుకుంటున్నారు. జీవిస్తున్నారు కూడా. ప్రపంచంలోని ప్రతి దేశం జనాభాలో వృద్ధుల సంఖ్య, నిష్పత్తి పెరుగుతోంది. 2020- 2050 మధ్య 80 సంవత్సరాలకంటే ఎక్కువ వయసు వారి సంఖ్య మూడురెట్లు పెరిగి 426 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసారు.1900లో నవజాత శిశువు సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు. 2021 నాటికి అది 71 సంవత్సరాలకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయిందన్నమాట.

2024 గణాంకాల ప్రకారం జపాన్ లో అత్యధిక శాతం 65 అంతకంటే ఎక్కువ వయసున్న వారున్నారు. దాని జనాభాలో 30.2% మంది ఈ వయసులో ఉన్నారు. ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, ఫిన్లాండ్ లాంటి యూరోపియన్ దేశాలు కూడా ఈ విషయంలో ప్రముఖంగా ఉన్నాయి.

భారతదేశంలో కూడా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 1961 జనాభా లెక్కల ప్రకారం వృద్ధుల జనాభా 5.6% ఉన్నది. అది 2031 నాటికి 14% కి పెరుగుతుందని అంచనా చేశారు.

ఈ సందర్భంలో ఇటీవల NETFLIX లో వచ్చిన 'విజయ్ 69' సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. 2024 నవంబరులో హిందీలో వచ్చింది. తెలుగులో కూడా ఉన్నది. " Better late than nevar " అనే స్పిరిట్ తో తీసిన సినిమా ఇది. మన భారత దేశంలో అరవై దాటిన వృద్ధులను కుటుంబం, ప్రభుత్వం, సమాజం షష్టిపూర్తి చేసేసి ఒకమూలన కూచోబేడుతుంది. కానీ ఈ సినిమాలో హీరో అనుపమ్ ఖేర్ 69 ఏళ్ళు దాటినా అలా ఒక మూలకు కూచోవడానికి ఇష్ట పడలేదు. తనను 'తాత ' అని పిలవడం కూడా ఇష్టపడలేదు. తనను ' అంకుల్ ' అని పిలవమంటాడు. స్విమ్మింగ్ కోచ్, ముక్కోపి అయిన విజయ్ మాథ్యూ.

అంతేకాదు, ట్రైతలాన్ లో పాల్గొనాలని ఉత్సహ పడతాడు. ట్రైతలాన్ అంటే సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ లలో పాల్గొని నెగ్గడం. ఈక్రమంలో కుటుంబం ప్రత్యేకంగా కూతురు, స్నేహితులు, సమాజం... 20లలో చేయాల్సిన పని 60లలో చేయడం ఏమిటని, ఈ వయసుకు ఎంత మాత్రం తగినది కాదని హేళన చేస్తూ నిరుత్సాహ పరుస్తారు. కానీ పట్టువదలని విక్రమార్కుడి లాగా విజయ్ మాథ్యూ మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలో ఆయన సాధించిన శారీరక దృఢత్వం, స్పాన్సర్లను పొందడం మొదలైనవి నేను ప్రత్యేకంగా చెప్పను. సినిమాచూసి తెలుసుకోవాల్సిందే..... వృద్ధులను ఎందుకూ పనికిరాని వారిగా తయారు చేసి ఒక మూలన కూచో బెట్టే మూస విధానానికి వ్యతిరేకంగా తీసిందే ఈ సినిమా. పొద్దస్తమానం BP, షుగర్లు చెక్ చేసుకుంటూ అనవసరమైన ఆందోళనకు గురవుతూ, ఉన్న రోగాలను పెంచుకుంటూ, లేని రోగాలను తెచ్చుకుంటూ, చావు కొరకు ఎదురుచూస్తూ, కుటుంబానికి, సమాజానికి భారమై జీవచ్చవం లాగా బతకడం కన్నా ఏదో ఒక లక్ష్యం ఏర్పరచుకొని దానికోసం తపనపడుతూ ఆ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం జీవిత పరమార్థం కావాలని చెపుతుంది ఈ సినిమా.

సినిమా ప్రధాన వస్తువు ఇదే అయినా అంతర్గతంగా పిల్లల పట్ల పెద్దలు ప్రవర్తించవలసిన తీరును, కుటుంబ బాధ్యతలు, స్వచ్చమైన ప్రేమ, కుటుంబ అనుబంధాలు, మానవ సంబంధాలు, స్నేహ బంధాలు లాంటి ఎన్నో గొప్ప విషయాలను చాలా శక్తివంతంగా చర్చించాడు దర్శకుడు. పోటీ అభ్యాసంలో భాగంగా విజయ్ మాథ్యూ, పోటీ దారుడు ఆదైత్య ఇద్దరూ కిందపడతారు. ఇద్దరికీ దెబ్బలు తగులుతూయి. అనుకోకుండా ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఒకే రూం షేరింగ్ లో కలుసుకుంటారు. ఆదిత్య పట్ల విజయ్ మాథ్యూ చూపిన కన్సర్న్ వలన ఇద్దరూ మిత్రులవుతారు. ఒకసారి స్విమ్మింగ్ లోఆదిత్యకు సమస్య వచ్చినప్పుడు పోటీని పక్కకు పెట్టి విజయ్ అతనిని కాపాడుతాడు. అలాగే ఎత్తు ప్రదేశంలో విజయ్ సైకిలు తొక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆదిత్య అతనికి సాయపడడం, అంతెందుకు ఆదిత్య విజయ్ కు రహస్యంగా శిక్షణ ఇవ్వడం, ఆదిత్య లవర్ మాలతి స్పాన్సర్లను వెతికిపెట్టడం వరకు వాళ్ళ అనుబంధం

పెనవేసుకుంటుంది. స్పోర్ట్ స్పిరిట్ ను ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఆదిత్య తండ్రి కొడుకుపట్ల ప్రవర్తించే తీరు .... పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలా ఉండకూడదో చెప్పకనే చెపుతుంది సినిమా. భార్యకు క్యాన్సర్ అని తెలిసి తన కెరియర్ ను పక్కకు పెట్టీ భార్యకు సేవలు చేయడం, కూతురును ఉన్నత స్థానానికి తీసుకురావడం . ... కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో చెపుతుంది. ఇదంతా సినిమాలో మనకు ఎక్కడా కనిపించదు కానీ ప్రేక్షకులకు అర్థమవుతూనే ఉంటుంది. తాను చనిపోయాక తన భర్త అతని ఇష్టమొచ్చిన విధంగా జీవించాలని విజయ్ భార్య ప్రమాణం చేయించుకోవడం ఉన్నతమైన ప్రేమకు తార్కాణం. విజయ్ స్నేహితులు మొదట అతని లక్ష్యాన్ని హేళన చేసినా తరువాత అతడు పోటీలో పాల్గొనడం కొరకు, అతని గెలుపు కొరకు చేసిన హంగామా స్నేహబంధాన్ని తెలుపుతుంది.

విజయ్ మాథ్యూ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేసే నెగెటివ్ సన్నివేశంతో దర్శకుడు అక్షయ్ రాయ్ సినిమాను మొదలు పెట్టి, సినిమా అంతటిని ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. కథ అక్షయ్ రాయ్, అబ్బాస్ టైరే వాలాలు రాశారు. గౌరవ్ ఛటర్జీ నేపథ్యసంగీతం, సాహిల్ భరద్వాజ్ ఫోటోగ్రఫీ ఆయా సంఘటనలకు తగినట్లుగా ఉన్నాయి. భారీసెట్టింగులు లేకుండా తక్కువ బడ్జెట్ తో సినిమా తీయడం ప్రశంసనీయం. విజయ్ మాథ్యూ పాత్రలో అనుపమ్ ఖేర్ నటన నటించాడు అనడం కన్నా జీవించాడనడం సమంజసంగా ఉంటుంది. చంకీపాండే లాంటి ఇతర నటీనటులు కూడా పాత్రోచితంగా నటించారు. సినిమా ప్రొడ్యూసర్ మనీష్ శర్మ.

నేను ఈ మధ్య పదవీ విరమణ వేడుకలకు వెళ్ళినప్పుడు... ముఖ్యంగా మహిళలకు... పదవీ విరమణ తర్వాత బద్ధకంగా ఇంట్లో కూచుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తమకు ఆసక్తి ఉండి, పని ఒత్తిడి వల్ల చేయలేక మధ్యలోనే వదిలిపెట్టిన పనులను తిరిగి మొదలుపెట్టమని సూచిస్తున్నాను. అది సంగీతం, చిత్రలేఖనం, రచనావ్యాసంగం, ట్రెక్కింగ్, ప్రయాణం ఏదైనా కావచ్చు. పురుషులు పదవీవిరమణ పొందిన తరువాత వాకింగ్ సాకుతో కనీసం బయటకు వెళ్ళి లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. స్త్రీపురుషులువరైనా సరే ఒక వయసు వచ్చాక అంతా అయిపోయిందనే ఆధ్యాత్మిక భావనలోకి పోకుండా జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెడితే ఆనందం, ఆరోగ్యం రెండూ బాగుంటాయని చెపుతుంది విజయ్ 69 సినిమా. అందరూ చూడవలసినసినిమా. ముఖ్యంగా పెద్దవాళ్ళు తప్పకుండా చూడాలి.

Tags:    

Similar News