మమ్ముట్టి ‘భ్రమయుగం’ మూవీ ఎందుకు బాగుందంటే...
రాజులూ, యక్షులు, మంత్రాలూ, భ్రమలు, యుద్దాలు, బానిసలు మొదలైన వాటి మధ్య సాగే కథనం ఇది. మిమ్మల్ని విసిగెత్తించిన మూస సినిమా నుండి దొరికిన ఓ విశ్రాంతి ‘భ్రమయుగం’.
By : The Federal
Update: 2024-02-24 05:03 GMT
-రామ్.సి
భ్రమయుగం- భ్రమకు వెండితెర రూపం, ఎలాగో చదవండి
ఎప్పుడో చిన్నప్పుడు తిన్నదో , విన్నదో ,చూసినదో ఎదురొస్తే ఉండే ఆనందం నాకు దొరికింది. ఆ తిన్న, విన్న రుచిని మించిన రుచి, ఆస్వాదించేలోపు అయిపోయినట్టు ఉంటుంది.మీ వీక్షణకు దొరికే ఓ సరికొత్త వెండి తెర కథాకాలం 'భ్రమయుగం'.
నలభై ఏళ్ళ ముందు మా (అందరి) నాన్నమ్మ/అమ్మమ్మో చెప్పిన జానపద సాహిత్యంలోని కథ,నేడు నవరూపం తీసుకుని సినిమా గా మారి 'భ్రమయుగం' గా చూడ ముచ్చట గొల్పింది. అంతం లేని కథ, భ్రమకు తోలి మెట్టు. కథనం దానికి ఆయువుపట్టు.కాలం, పాత్రలు భిన్నమైనవి. కథ ఓ మోస్తోరు ముందే తెలిసిపోయినా, ఉత్సుకత కలిగించి కొస దాకా లాక్కెళ్లే సినిమా. ఇందులో థ్రిల్స్ ని కొసరి కొసరి వడ్డిస్తారు, అంతే కాదు ఆచితూచి నిదానంగా అనుభూతికి సిద్ధం చేస్తుంటాడు దర్శకుడు. ఓ రకంగా తన ముగ్గులోకి లాగుతాడు, వెళ్లాలా వద్దా అనే ఊగిసలాట మధ్య ఉండే ఈ రెండు పార్స్యాల సంధానమే భ్రమ.
కలియుగం లోని ఓ శకం ‘భ్రమ కాలం ’. ఆనాటి ఆనవాళ్లు కొంచెం దాటి వచ్చి శిధిలావస్థలో ఉండే ఓ రాజు గారి భవనంలో మొదలైన కథ ఇది. ఆకలి గొన్న ఓ బాటసారి ఎరక్క పోయి ఇరుక్కుంటాడు ఇందులో.ఒక యక్షి చేసే మాయ తెలియక సాలీడు వలలో విలవిల్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చిన తోలి నాళ్లను పరిచయం చేయడంతో కథ ముగుస్తుంది.
చివరిగా కథకు ముగింపు లేదని తెలిసి మీలోని చిన్నారి కొంచం బుర్ర గోక్కుంటూ, నవ్వుకొంటూ బయటకి వస్తాడు.ఎదో హాయి ఆవరిస్తుంది. నవ్వు పూయిస్తుంది.
ఆద్యంతం ఓ నలుపు, తెలుపుల చీకటి కోణంలో ఆవిష్కృతమయిన సినిమా ఇది. రాజులూ, యక్షులు, మంత్రాలూ, భ్రమలు, యుద్దాలు, బానిసలు మొదలైన వాటి మధ్య సాగే కథనం. మిమ్మల్ని విసుగెత్తించిన మూస సినిమాల నుండి దొరికిన ఓ విశ్రాంతి వంటిది భ్రమయుగం. ఓ ప్రత్యేక అనుభూతి కూడాను.
కోరికలు తీర్చుకొనే యక్షి, అల్లుకొంటూ పోతున్న సాలీడు, ఉచ్చులో చిక్కున్న ఎలుక, మనిషైనా రాక్షషైనా కోరుకొనేది అజమాయిషి, ఆధిపత్యం అని , మంచిగా కనిపించే మోసం రూపం ఎలా ఉంటుందని, అవకాశం వస్తే అందరు సైతానులే, అందరికి అధికారమే కావాలని, కులం ఇచ్చే నిషా, కడుపు నింపేందుకు మత్తు, తీసే కొద్దీ క్యాట్స్ క్రాడిల్ ఈ సినిమా.
మన అనుభవించే ప్రతి కష్టానికి నమ్మకాన్ని తాకట్టు పెట్టడమే మూల కారణం. ఎంతో తెలిసిన మనం, ఆ నమ్మకం మనం ఎలా ఇచ్చేశాం అన్నది కాదు, మన నుంచి తీసుకోవడంలో ఎదుటి వాడి ప్రతిభ, తెలివిను అని తెలియడానికి ఓ సమయం పడుతుంది. అప్పుడు మనకు రావాల్సింది రాకుండా, జరగవల్సినది జరగకుండా తెలిసొచ్చినప్పుడు తొలగేపోయే వాటిలో మొదటిది భ్రమ. అప్పుడు మొదలయ్యదే భ్రమయుగం.
మన చుట్టూ మనుషులు పలు రకాల వాళ్ళు ,పలు సందర్భాల్లో మనపై నమ్మకంతో సాగించే మోసంలో విలవిలలాడ్డం గుర్తుకొస్తాయి. మన జీవితాల్ని ఉద్ధరిస్తామని ఓట్లు అడిగే రాజకీయనాయకులు, నాణ్యత లేనివి అంట గట్టే వ్యాపారాలు, తెలిసిన వాళ్లు మనల్ని వాడుకొని వదిలేశారని తెలిసుకున్నప్పుడు, అభిమానంతో ఊగిపోయే వాళ్లకు ఆ అభిమానించే వాళ్లే నట్టేట ముంచినట్టు కలిగే అనుభూతులెన్నో స్ఫురణకు వస్తాయి.
భయం కన్నాపెద్ద జబ్బు ఏది లేదని, కలిసిరాని కాలంలో పాచికలు ఆడకూడదని, సమయంను పందెం కాసిన వైనం కొత్త ఆలోచనకు అబ్బురపడక తప్పదు, దగాపడ్డామని తెలుసుకొనే లోపల ఊహించని దౌర్జన్యంకు గురవడం, స్వాంతన దొరక్క కాలం తెలియని కాలంలో గడపడం, మాయ, మోసం కలగలిపి తాండవమాడే భ్రమకు లోనయ్యే కథనానికి మచ్చుతునక యీ సినిమా.
యక్షిగా మమ్ముటి,బాటసారిగా అశోక్ ,వంటవాడిగా సిద్దార్థ్ ముగ్గురు పోటీ కన్నా, ఎవరికి వారు భ్రమను దాటి అలరిస్తారు. భగవతి దేవాలయాలలోని భద్రకాళిని పూజించే పాటలు రెండు నన్ను తన్మత్వానికి గురిచేశాయి. అమ్మవారిని ప్రార్ధించడం చాల రోజుల తరువాత విన్న గొప్ప స్వరం క్రిష్ జేవియర్ ( Chris Xavier) ని ఇప్పుడు రోజు వింటున్నాను.
భ్రమయుగం భ్రష్టుపట్టిన, బయటపడలేని కలియుగంలో ఓ సమాంతర కాలం.
(* తన పొడవాటి పేరును రామ్.సి గా కుదించుకుని సరదా పడే ఈ రచయిత నిజానికి మేనేజ్మెంట్ స్ట్రాటజీ నిపుణుడు. కొంతమంది మిత్రులతో కలసి ఈ మధ్య Figure It Out అనే పుస్తకం రాశారు. కథలను, సినిమా కథలను విశ్లేషించడంలో దిట్ట)