అయిదు కథల నవల - "కురుక్షేత్రం"

ఆశ్చర్యంగా ఉంది కదూ! ఉండదు మరి, అయిదు కథలంటా, నవలంటా. చోద్యం కాకపోతే మరేంటి? చోద్యం కాదు మరేంకాదు, నిజమే. నిజంగా నిజమే. ఆ నిజమైన నిజమేంటో చూద్దాం.

Update: 2024-08-28 05:53 GMT

సరిగ్గా 70 ఏళ్ళ క్రితం అంటే 1954 ఆంధ్రపత్రిక వారపత్రికలో వారసత్వం, స్వయంవరం అనే రెండు కథలు అచ్చయాయి. ఆతర్వాత ఆరేళ్ళకి అంటే 1960లో నవోదయ వారపత్రికలో ప్రవేశం, నిర్వహణ, నిష్క్రమణ అనే మూడు కథలు ప్రచురితమయ్యాయి. ఈ అయిదు కథలకూ రచయిత ఒక్కరే. పేరు వనశ్రీ. ఇది కలం పేరు. అసలు పేరు వాసిరెడ్డి నారాయణరావు. ఇది సరే, మరి కురుక్షేత్రం నవలేంటి? వస్తున్నా... అక్కడికే వస్తున్నా.

కురుక్షేత్రం నవల 1962 మే నెలలో అచ్చయింది. వాసిరెడ్డి సీతాదేవి, పి. సీతాలక్ష్మి, వి. సక్కుబాయి ఎం.ఏ; బి. ఇడి, జె. ఉమామహేశ్వరరావు బి.ఏ. ఆనర్స్, వి. నారాయణరావు ఈ అయిదుగురు సంపాదకులుగా ఉన్నారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రస్తావన మాటలు రాశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలు హైదరాబాద్‌ లో జరిగాయి. ఆ మహాసభా వేదిక మీద ఏ.పి రాష్ట్ర ఎన్ జి ఓ సంఘం అధ్యక్షులు అమనగంటి శ్రీరాములు "కురుక్షేత్రం" నవలను ఆవిష్కరించారు. మరొకరు ఈ నవలకు కుటుంబరావుగారు రాసిన ప్రస్తావన చదివారు. తొలి ప్రతిని మహాసభ ప్రారంభకులు నాటి రాష్ట్ర సహకార శాఖా మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారికి రచయిత స్వయంగా అందజేశారు. రెడ్డి గారు పుస్తకం తెరిచి చూశారు. సమర్పణ "దగాపడ్డ ఎన్ జి ఓ లకి" అని ఉంది. మంత్రి అది చూసి క్షణకాలం ఆగి తల పైకెత్తి రచయిత వంక చూసి మందహాసం చేశారు. (ఈ అంశాలను రచయిత నారాయణరావు 2009మే లో ప్రచురించిన కురుక్షేత్రం - వనశ్రీ కథలు సంపుటి చివరి పుటల్లో "కురుక్షేత్రం-ముందు వెనుక..." అంటూ జ్ఞాపకాల్లోంచి నమోదుచేశారు. అయితే నారాయణ రావుగారు బ్రహ్మానందరెడ్డిగారిని ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అది దీర్ఘకాలానంతర జ్ఞాపకాల్లోంచి దొర్లిన పొరపాటు కావచ్చు. 1962లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి. వారి మంత్రివర్గంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్థిక, సహకారశాఖల మంత్రిగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి 1964లో ముఖ్యమంత్రి అయ్యారు.1971వరకూ ఆ పదవిలో కొనసాగారు.).

ఆ కథలకు ఈ నవల ఆవిష్కరణకు ఏమిటి సంబంధం?

ఏమిటంటే...

ఆ అయుదు కథలలోనూ వస్తువు ఎన్. జీ. ఓ . లు, వారి కుటుంబాల దుర్భర జీవితమే. అదో కురుక్షేత్రం. ఇంటిలో, కార్యాలయంలో, సమజంలో వారు అనుభవించే వ్యధ, అవమానాలు, సంఘర్షణల పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఆ అయిదు కథల కథానాయకుడు విశ్వనాథం. ఆ అయిదు కథలూ విడివిడిగా దేనికదే. వానిని ఒకదానితో మరొకదానిని కలిపే ఒక సూత్రం ఉంటుంది. అది అంతర్లీనంగా కొనసాగుతుంది.

వారసత్వం కథలో శేషయ్య ఉద్యోగ విరమణ చేసిన ఎన్.జి.ఓ. యాభై నాలుగు రూపాయిల పెన్షన్ దారుడు. ఇల్లు గడవటానికి అదే ఆధారం. వ్యాధిగ్రస్తుడు. కొడుకును డాక్టర్ చేయాలని అనుకొంటాడు. ఉన్న రెండెకరాల్లో ఒక ఎకరం అమ్మి ఇంటర్ సైన్స్ గ్రూపు చదివిస్తాడు. తీరా ఇంటర్మీడియట్ అయిపోయి ఫలితాలొచ్చేప్పటికి చేతిలో డబ్బు అయిపోతుంది. ఇక చదువొద్దు ఉద్యోగం చూసుకోమంటాడు. ఉన్న ఎకరం అమ్మయినా డాక్టర్ చదువుతానంటాడు విశ్వం. తల్లీ కొడుకును సమర్థిస్తుంది. వాడు డాక్టరైతే అన్నీ చక్కబడతాయని భర్తకు సర్ది చెపుతుంది. కానీ దరఖాస్తు పంపకుండానే శేషయ్య మరణిస్తాడు. విశ్వం ఉన్న పొలం కూడా అమ్మేస్తాడు. హిస్టరీ గ్రాడ్యుయేటవుతాడు. హటాత్తుగా తమ్ముడు చచ్చిపోతాడు.

రెండో కథలో ఉద్యోగాన్వేషణ, ఇంటర్వ్యూల తతంగాలూను. అందుకే ఆ కథ శీర్షిక స్వయంవరం. నిరుద్యోగ యువత ఇంటర్వ్యూల తంతుతో వినోద విషాదాల కలపోతగా కథనం సాగుతుంది.



ఆరేళ్ళతర్వాత రాసిన మూడో కథ ప్రవేశం. విశ్వం ఎల్.డి.సీ. గా ఓ ఉద్యోగ ప్రవేశంతో కథ ప్రారంభం. రచనలో విరామమే గాని కథా గమనంలో విరామం ఉండదు. అందువల్ల మూడోకథ రెండోకథకు కొనసాగింపుగానే ఉంటుంది. ఆ తరువాతి రెండు కథలూ నిర్వహణ, నిష్క్రమణ. నిర్వహణలో ఉద్యోగ, కుటుంబ నిర్వహణలో కష్ట నష్టాల అనుభవాలు. చివరికథలో విశ్వం పద్మవ్యూహంలో అభిమన్యుడి రీతి. చివరిగా చెల్లి చెవికమ్మలు తాకట్టుపెట్టి ఆమె ఛీత్కారానికి గురవుతాడు. తల్లి విలవిలలాడిపోతుంది. విశ్వం ఓ రోజు ఆఫీసు నుండి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రోజుల్లో రైలు కట్టమీదా, చెరువులోనూ, నూతిలోనూ గుర్తు తెలియని శవాల్ని చూస్తారు పోలీసులు. అవి ఎవరివో? ఉన్నాడో లేడో తెలియని విశ్వం ఎప్పటికీ తిరిగిరాడు. ఈ మొత్తం కథల్లో నాటి ఎన్. జి. ఓ. ఉద్యోగుల అల్లకల్లోల జీవితం బొమ్మకడుతుంది. పాలనాయంత్రాంగం లోని లొసుగులు కళ్ళకు కడతారు రచయిత. సమాజిక జీవితంలోని బీభత్సం పాఠకుణ్ణి కంపింపచేస్తుంది. ఈ మొత్తం కథలలో లేదా కథల్లాంటి నవలలో ఎన్.జి.ఓ. ల వాస్తవిక జీవనాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్తారు రచయిత. "ఎన్. జీ. వో. అంటే ఎలా వినబడుతుంది? గంజికి లేనివాడన్న ధ్వని స్ఫురించడం లేదూ...?"

1959వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 'జీవన భృతి'ని పెంచాలని ఎన్ జి. ఓ. లు సమ్మె చేశారు. ఆ సమ్మె 56 రోజులు సాగింది. ఎన్.జి.ఓ. ల జీవన భృతిని ప్రభుత్వం అర్థ రూపాయి నుండి 5రూపాయిలవరకు పెంచింది. కానీ ఎన్.జీ.ఓ.లు సంఘటితమయ్యారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.ఓ. సంఘం జాతీయ మహాసభలు జరపాలని నిర్ణయించింది. ప్రగతి ప్రచురణ సంయుక్త స్థాపకుడు పరుచూరి హనుమంతరావు. "ఎన్. జీ. ఓ. కథలను నవలగా ముద్రించి మహాసభలకు విడుదల చేస్తే బాగుంటుంద" న్నారు నారాయణరావుగారితో.

"ఎప్పుడో రాసిన కథలు కలిపి అచ్చుగుద్ది నవల అంటే చెల్లుబాటవుతుందా" రచయిత సందేహం. మద్రాసులో ఉన్న కొడవటిగంటి అభిప్రాయం కోసం రాశారు.

"ఛార్లెస్ డికెన్స్ పిక్విక్ పేపర్స్`ను నవల అనే అంటున్నారు. `పిక్విక్ పేపర్స్ నవల అయినప్పుడు మీ "కురుక్షేత్రం" కూడా నవలే" అన్నారు కొడవటిగంటి. అంతేకాదు, "ప్రస్తావన" కూడా రాసి పంపారు. "కురుక్షేత్రం నవల ఈ కాలపు నవలా సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకుంటుందని నాకు గట్టి నమ్మకం... ఇందులో వాస్తవికత నూటికి నూరుపాళ్ళు ఉట్టిపడుతున్నది. ఇందులో చిత్రించిన వ్యక్తి ఈ నాటి సమాజంలో ఒక విస్తృత వర్గానికి ప్రతినిధి... ఈ రెండు విషయాలలోనూ ఈ నవల నేను చదివిన అన్ని నవలలకన్నా ముందున్నది. భవిష్యత్తులో రాబోయే అనేక నవలకు ఇది వరవడిగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను." అని పేర్కొన్నారు. మహాసభల్లో ప్రతులు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

Tags:    

Similar News