మహమ్మద్ సిద్దిఖీ 'గణేశుడు' హైదరాబాద్ లో స్పెషల్ ఎట్రాక్షన్

20 సంవత్సరాలుగా హైదరాబాద్ రాంనగర్ లో కొనసాగుతున్న సిద్ధిఖీ 'గణేష్ ఉత్సవం';

Update: 2025-08-30 06:00 GMT

హైద‌రాబాద్ వినాయక నవరాత్రులు ప్రజలో ఐక్యమత్యాన్ని పెంచుతున్నాయి. ఆధ్యాత్మికతను వెల్లివిరిస్తుంది. పర్యావరణ హితాన్ని సైతం చాటిచెబుతున్నారు. పలు చోట్ల హిందూ - ముస్లింలు కలిసి వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. ఇక రాంన‌గ‌ర్‌లో ఈ పండగ వచ్చిందంటే అంతా సంబరమే.

మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు ప్రతీ ఏడాది గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. వరుసగా 20 ఏళ్ల నుంచి గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖ్‌. తాను "ముస్లిం అయినా.. అన్ని మతాలను గౌరవిస్తా" నని అంటున్నాడు. రామ్‌నగర్‌లోని ఈ గణేష్ మండ‌పం ఐక్యత సందేశాన్ని చాటి చెబుతోంది. "తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఇష్టం" అంటున్నాడు మహమ్మద్ సిద్ధిఖీ..

"చిన్నతనంలో పర్సనల్ గా గణేశుని వల్ల జరిగిన మంచి వల్ల ఆనాటి నుంచి ప్రతీ ఏడాది, తన హిందూ మిత్రులతో కలిసి గణేశునికి సేవ చేస్తున్నా" అని మొహమ్మద్ సిద్దిఖ్ ఫెడ‌ర‌ల్‌తో చెప్పారు.

ముఖ్యంగా "గణేష్‌ నవరాత్రులంటే తనకు చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబరాలు చేసుకోవడం చూసి, తాను కూడా అందులో పాల్గొనేవాడినని. అంతే కాదు తన చిన్నతనంలో గణేష్‌ వల్ల మంచి జరగడంతో.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా గణేష్ ఉత్స‌వాల్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నా" .

Full View

ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా, సిద్దిక్ త‌న స్నేహితుల‌తో క‌లిసి గ‌ణేష్ ఉత్స‌వాల కోసం కోసం విస్తృతమైన ప్రణాళికలు వేస్తాడు. కులం, మతంతో సంబంధం లేకుండా తన ప్రాంతంలోని ఇతర యువకులను చేర్చుకుంటాడు. "తాను చిన్నప్పుడు పూజ ప్రారంభించానని, ఇప్పుడు విగ్ర‌హం సైజుతో పాటు వేడుక‌లు కూడా పెరిగాయి" అని అత‌ను చెప్పాడు.

"నా స్నేహితుల సర్కిల్ చాలా పెద్దది. నాకు అన్ని వర్గాల నుండి స్నేహితులు ఉన్నారు. ప్రేమ, స్నేహం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మేము ఇష్టపడతాము” అని సిద్దిక్ చెబుతున్నాడు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తనను ప్రోత్సహించడం పట్ల సిద్ధిక్ సంతోషంగా ఉన్నాడు. ముస్లింలు కూడా త‌న‌ని అభినందిస్తున్నార‌ని ఆయన చెప్పారు.

"ఎవరు ఎన్ననుకున్నా మేము మానవతా వాదులం, సమాజానికి అవసరమైన సందేశాన్ని చాటి చెబుతున్నాం".

ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, హిందువుల‌తో క‌లిసి ప్రతిష్టించిన వినాయకుడే రాంన‌గ‌ర్ సిద్దిఖ్‌భాయి వినాయ‌కుడు. ఈ మండ‌పాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

వినాయక చవితి అంటే హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ప్రతి ఇంట్లో, గల్లీలో, సంస్థలో గణపయ్యను పూజిస్తారు భక్తులు. మరి ఆ బాధ్యత ఒక ముస్లిం యువకుడు తీసుకుంటే.. అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో.. ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 20 ఏళ్ళ నుండి గణేశుని సేవలో ఉంటూ లక్షల్లో ఖర్చు చేస్తున్నాడు రాంన‌గ‌ర్ సిద్దిఖ్ భాయి.

Tags:    

Similar News