ఓ జ్ఞాపకం అయిపోయిన నిజం.. కాశీభట్ల వేణుగోపాల్

వేణు గురించి ఒక ముక్కలో చెప్పడం చాలా కష్టం. ఏ రకమైన ఇజానికి అందని వాడు. ఓ ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వాడు. ఎప్పుడు ఏం చెప్తాడో, ఏం రాస్తాడో చెప్పడం కష్టం.

Update: 2024-08-19 14:12 GMT

ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. ఏడు పదుల వయసులో ఎన్నోసార్లు వెళ్లి పోవడం, మళ్ళీ రావడం జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకున్న వేణు అనబడే కాశీభట్ల వేణుగోపాల్ ఈసారి మోసం చేసి శాశ్వతంగా వెళ్లిపోయాడు.

వేణుతో నాకున్న అనుబంధం 55 ఏళ్లది. నాకు 10 ఏళ్ల అప్పుడు వేణు పరిచయం అయ్యాడు. అయితే ఎప్పుడూ మాట్లాడింది లేదు. నాకన్నా కొంచెం పెద్దవాడు కావడం వల్ల, ఇద్దరం బి క్యాంప్ కాలనీ వాసులమైనప్పటికీ, వేణుతో మాట్లాడడానికి ఓ 10 సంవత్సరాలు పట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు వేణు తో మాట్లాడకుండా లేను. ఈ మధ్యకాలంలో వేణుని కలిసి మాట్లాడింది తక్కువే.

నాకు 25 ఏళ్ళు వచ్చేటప్పటికి, మరోసారి వేణు తో చిక్కనైన, విడదీయలేని అనుబంధం మొదలైంది. నాలుగు దశాబ్దాల పాటు అది కొనసాగుతూ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని రోజులపాటు కలవకపోయినా, కలిసినప్పుడు మాత్రం గంటల తరబడి గడిపే వాళ్ళం. వేణు గురించి వేణుకు తప్ప మరెవరికి తెలియదు. నాకైనా తెలిసింది తక్కువే. అయితే బి క్యాంప్ కాలనీ గురించి నేను మాత్రమే రాయాలని వేణు కోరిక. నేను రాస్తాను రాస్తాను అని చెప్పి ఇంతవరకు రాయలేకపోయాను. వేణు జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగానే గడిచింది. కానీ వేణు మాత్రం అది ఒప్పుకోడు. నేను ఒంటరిగా లేను, ఏకాంతంలో ఉన్నాను అనేవాడు. పుస్తకాలు చదవడం రాయడం లోనే ఎక్కువ భాగం గడిపాడు. మొదట్లో సరదాగానో, డబ్బుల కోసమో ఒక రెండు ఉద్యోగాలు చేసినట్టు గుర్తు. ముఖ్యంగా కర్నూల్ లో అప్పట్లో ప్రముఖమైన హోటల్ లక్ష్మీ నివాస్ పక్కన ఉన్న రమణ అనే ఒక ఫ్రెండ్ సూపర్ మార్కెట్లో, చాలా కాలం చేశాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో కూడా కొంతకాలం చేసినట్లు గుర్తు.

వేణు తో నేను ఎక్కువకాలం గడిపింది రాత్రుళ్ళే.ఉన్నట్టుండి సాయంకాలం " సలీం గారు, మీకు టైం ఉండి ఇబ్బంది లేకపోతే ఓ క్వార్టర్ తీసుకొస్తారా?" అని అడిగినప్పుడల్లా వెళ్లేవాడిని, క్వార్టర్ తో సహా.

సావిత్రి అక్క ఇంక టైం అయింది రా అని ఇద్దరికీ గుర్తు చేసినప్పుడు మాత్రమే నేను ఇంటికి వెళ్లేవాడిని. చాలా పుస్తకాలు రాశాడు. అందులో నేను చెప్పవలసింది బతుకు బడి గురించి. బికాంప్ కాలనీకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలతో ఆ పుస్తకం రాసినట్లు బాగా గుర్తు. ఆ పుస్తకంలో కొన్ని చోట్ల నా ప్రస్తావన కూడా తెచ్చాడు. అలాగే "కాలం కథలు" కూడా చాలా జ్ఞాపకాలను గుర్తుచేసే పుస్తకం.

వేణు గురించి ఒక ముక్కలో చెప్పడం చాలా కష్టం. ఏ రకమైన ఇజానికి అందని వాడు. ఓ ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వాడు. ఎప్పుడు ఏం చెప్తాడో, ఏం రాస్తాడో చెప్పడం కష్టం. అప్పుడప్పుడు కొంత కాల్పనికవాదం కూడా ఒంట పట్టించుకునే వాడు. పుస్తకాలు బాగా చదివినవాడు, బాగా రాసిన వాడు కూడా. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉండడానికి వ్యతిరేకి అయిన ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన వాడు. సమాజంలో స్వేచ్ఛగా బతకాలనుకున్నవాడు. సమూహంలో ఒంటరిగా ఉండాలనుకునేవాడు.

వేణుకు వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధం కూడా మాటల్లో చెప్పలేనిది. ఆ అనుబంధం తర్వాత ఇద్దరు అక్కలతో ఉండింది అమ్మ పోయినతర్వాత , పెద్దగా నమ్మకం లేకపోయినా ఆమె కోరిక మేరకు అస్తికలు కాశీకి తీసుకెళ్లాడు .

అస్తికలు గంగ పరం చేసిన తర్వాత, డబ్బుల్లేక ఉత్తర్ ప్రదేశ్ అంతా తిరిగాడు. డబ్బుల కోసం కోసం ఏ పని దొరికితే అది చేస్తూ లక్నో చేరుకున్నాడు , ఒక తవాయిఫ్ ఇంటి (అంటే ఒక సాని ఇల్లు అన్న మాట !) ముందు సొమ్మసిల్లి పడిపోయాడు, ఆమె వేణు మీద జాలిపడి ఇంట్లోకి తీసుకెళ్ళింది! అలా కొన్ని రోజులు అక్కడే ఉన్న వేణు కు మానవజీవితాల నిగూఢమైన అవకతవకలు అర్థమయ్యాయి. జీవితంలో పెనుమార్పు వచ్చింది, కొన్ని రోజుల తర్వాత ఆమె దయవల్ల మళ్లీ కర్నూలుకు రాగలిగాడు. ఈ విషయం వేణు నాకు ఓ సందర్భంలో చెప్పాడు.

వాళ్ల నాన్నతో(ఇప్పుడున్న విజ్ఞాన మందిరం పూజారి ఒకప్పుడు) వేనుకున్న సంబంధం కూడా అర్థం కాదు. ఇద్దరికీ పడకపోయినా ఆయన చివరి రోజుల్లో తన దగ్గరే ఉంచుకోవడం వేణుకే చెల్లు. ఒక విధంగా చెప్పాలంటే వేణు తో నాకున్న సంబంధం గురించి నాకే పూర్తిగా తెలియదు. అది ఏ నిర్వచనానికి అందేది కాదు. అది అలా నడుస్తూ వెళ్ళింది అంతే. వేణు లాంటి వ్యక్తులు సమాజానికి అనార్కిస్టులు. అని వేణునే చెప్పేవాడు.

నేను వేణుని చివరి సారి కలిసింది ఓ సాయంత్రం జర్నలిస్టు మిత్రుడు జింక నాగరాజు తో కలిసి. అప్పుడు ఎన్నో విషయాలు చర్చించుకున్నాం.. మళ్లీ ఒకసారి కలవాలని అనుకున్నాం. కలవలేకపోయాం. . ఇంక కలిసే అవకాశం పూర్తిగా లేదు.

చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. "బి క్యాంప్ కాలనీ" గురించి నేనే రాయాలని పట్టుబట్టిన వేణు ఆ పుస్తకానికి, చాలా కాలం ముందే " ముందుమాట" రాసి పెట్టుకున్న వేణు, నేను పుస్తకం రాయక ముందే అలా వెళ్ళిపోవడం మాట తప్పడం, మోసం కాక మరేంటి? పుస్తకం రాయకముందే వేణు అలా వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ వేణు కదా... అలాగే చేస్తాడు.. ఒకరికి నచ్చడం కోసం బతికినవాడు కాదు, తనకు తాను నచ్చినట్లు బతికినవాడు. ఏదైనా సరే ఇక వేణు అనే నా ప్రత్యేకమైన మిత్రుడు ఒక జ్ఞాపకం అయిపోయాడు, ఇక జ్ఞాపకాల్లోనే ఉంటాడు.. ఉండిపోతాడు.

Tags:    

Similar News